జమున హేచరీస్‌పై రీసర్వే షురూ

17 Nov, 2021 01:13 IST|Sakshi
 జమున హేచరీస్‌లో సర్వే చేస్తున్న రెవెన్యూసిబ్బంది 

సర్వేలో పాల్గొన్న ఆరు సర్వే బృందాలు 

మూడు రోజుల్లో నివేదిక ఇస్తామన్న ఆర్డీఓ 

వెల్దుర్తి/మెదక్‌జోన్‌: బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు సంబంధించి జమున హేచరీస్‌ భూముల రీసర్వే ప్రారంభమైంది. తొలిరో జు మంగళవారం మెదక్‌ జిల్లా మాసాయి పే ట్‌ మండలం అచ్చంపేట శివారులో సర్వే నం.130లో 18.35 ఎకరాల భూమిని సర్వే చేశారు. తూప్రాన్‌ ఆర్డీఓ శ్యాంప్రకాశ్‌ పర్యవేక్షణలో ఆరు బృందాలు సర్వే నిర్వహించా యి. ఉదయం నుంచి సాయంత్రం వరకు సర్వే కొనసాగింది. సర్వే చేస్తున్న ప్రదేశానికి మీడియాకు అనుమతి నిరాకరించారు.

నోటీసులు అందుకున్న రైతులను మాత్రమే అనుమతించారు. రాజేందర్‌ భార్య జమున, ఆయన కుమారుడు నితిన్‌రెడ్డిలతో మొత్తం 17 మంది రైతులకు ఈనెల 8న సర్వే నోటీసులు జారీచేసిన రెవెన్యూ అధికారులు మంగళవారం సర్వే నం.130లోని భూ సర్వే నిర్వహించారు. ఈ సర్వేకు జమున, నితిన్‌రెడ్డి హాజరుకాలేదని అధికారులు తెలిపారు. 

కోవిడ్‌ కారణంగా సర్వే వాయిదా... 
టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగిన ఈటలపై భూఆక్రమణ ఆరోపణలు 6 నెలల క్రితం సంచలనం సృష్టించిన విష యం విదితమే. తమ భూములను ఈటల కుటుంబీకులు బలవంతంగా లాక్కున్నారని  పలువురు రైతులు కేసీఆర్‌కు ఫిర్యాదు చేయడం.. ఆయన్ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేయడం.. ప్రభుత్వం వెంటనే విచారణకు ఆదేశించడం చకచకాగా జరిగిపోయాయి. అప్పట్లో ఆగమేఘాల మీద సర్వే నిర్వహించిన రెవెన్యూ అధికారులు జమున హేచరీస్‌లో 66.01 ఎకరాలు కబ్జాలున్నట్లు ప్రాథమికంగా నిర్ధారించారు.

దీనిపై హేచరీస్‌ సంస్థ రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించడంతో సంబంధిత రైతులకు నోటీసులు జారీ చేసి, నిబంధనల ప్రకారం సర్వే నిర్వహించి నివేదిక ఇవ్వాలని న్యాయస్థానం ఆదేశించింది. అప్పట్లో కోవిడ్‌ వ్యాప్తి ఉధృతంగా ఉండటంతో సర్వే వాయిదా వేసిన అధికారులు తాజాగా ఈనెల 8న సంబంధిత రైతులకు నోటీసులు జారీ చేశారు. మంగళవారం సర్వే నిర్వహించారు.  

తొలి రోజు 18.35 ఎకరాలు సర్వే.. 
జమున హేచరీస్‌కు సంబంధించి అచ్చంపేట, హకీంపేట శివారుల్లోని సర్వే నం.77లో 8.32 ఎకరాలు, సర్వే నం.78లో 14.02 ఎకరాలు, సర్వే నం.79లో 13.36 ఎకరాలు, సర్వే నం.80లో 17.25 ఎకరాలు, సర్వే నం.81లో 16.19 ఎకరాలు, సర్వే నం.82లో 13.09 ఎకరాలు, సర్వే నం.130లో 18.35 ఎకరాలు, సర్వే నం.97లో 11.27 ఎకరాల చొప్పున..  115 ఎకరాల పైచిలుకు భూములను సర్వే చేయాల్సి ఉంది.  మొదటి రోజు 18.35 ఎకరాలు సర్వే చేశారు.  

నివేదిక వచ్చాక వివరాలు వెల్లడిస్తాం.. 
మూడు రోజులపాటు సర్వే నిర్వహించి సర్వే డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ నివేదిక వచ్చాక వివరాలను వెల్లడిస్తామని తూప్రాన్‌ ఆర్డీఓ శ్యాంప్రకాశ్‌ పేర్కొన్నారు. కాగా, కబ్జాలకు గురైన భూములను నిరుపేదలకు పంపిణీ చేయాలని డిమాండ్‌ చేస్తూ ఎమ్మార్పీఎస్‌ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.

>
మరిన్ని వార్తలు