కోడికి ఫుల్‌ టికెట్‌... డిపో మేనేజర్‌ వెంకటేశం ఏం అన్నారంటే...

9 Feb, 2022 12:15 IST|Sakshi

కోల్‌సిటీ(రామగుండం): ఓ ప్రయాణికుడు వెంట తీస్కపోతున్న కోడికి టికెట్‌ కొట్టాడో ఆర్టీసీ బస్సు కండక్టర్‌. కోడేంది? బస్సుల టికెట్‌ గొట్టుడేంది? అని సినిమాల్లో బ్రహ్మానందం కండక్టర్‌గ జేసిన సీన్లు గుర్తు తెచ్చకుంటున్నరా? ఆగుర్రాగుండ్రి. దానికి లైవ్‌ ఎగ్జాంపుల్‌ ఇది. మహమ్మద్‌ అలీ.. గోదావరిఖని డిపో బస్సు ఎక్కిండు. కరీంనగర్‌కు టికెట్‌ తీసుకున్నడు. చుట్టాలింటికి పోతున్నడో.. చుట్టాల దగ్గరనుంచే వస్తున్నడో... తెల్వదుగానీ కోడిని మాత్రం వెంట తెస్తున్నడు.

చీరల మూటగట్టుకుని సీట్ల కూసున్నడు. అసలే కోడి. కూయకుండా ఉంటుందా? సుల్తానాబాద్‌ రాంగనే ‘కొక్కొరోకో’ అన్నది. సప్పుడొచ్చిన కెయ్యి చూసిండ్రు. ఇగ కండక్టర్‌ తిరుపతి ఊకుంటడా... మహమ్మద్‌ అలీ దగ్గరకొచ్చి చీర తీసి చూస్తే... కోడి. బస్సులో కోడిని ఎట్ల తీసుకొస్తవని సీరియస్‌ అయ్యిండు. టికెట్‌ తీసుకుంటవా లేదాని పట్టుబట్టిండు. కోడికి టికెటేందని అలీ... తీసుకోవల్సిందేనని తిరుపతి.. ఇద్దరూ లొల్లిపెట్టుకున్నా... చివరకు రూ.30లతో ఫుల్‌ టికెట్‌ కొట్టి కూల్‌ అయ్యిండు కండక్టర్‌.

పైసలు పోతే పొయినయి.. కోడి మిగిలిందని నిమ్మలపడ్డడు అలీ. ఇదేందని అడిగితే.. ‘బస్సులో కోడిని తీసుకురావడానికి అనుమతి లేదు. అధికారులు తనిఖీ చేస్తే ఇబ్బందులొస్తయని టికెట్‌ ఇచ్చిన’ అని కండక్టర్‌ చెబితే.. ‘కోడిని బస్సులో అనుమతించిన కండక్టర్‌పై చర్యలు తీసుకుంటాం’ అని డిపో మేనేజర్‌ వెంకటేశం అంటున్నడు. అసలు పదేండ్లు దాటితే గానీ ఫుల్‌ టికెట్‌ ఉండదు... కానీ పదేండ్లుకూడా బతకని కోడికి ఫుల్‌ టికెట్‌ కట్‌ చేసుడేందని జనం నవ్వుకుంటున్నరు.

మరిన్ని వార్తలు