తప్పుగా నింపాడని ఓఎంఆర్‌ షీట్‌ మింగేశాడు

27 Feb, 2023 04:23 IST|Sakshi
అబ్దుల్‌ ముఖీద్‌

నిజామాబాద్‌ జిల్లాలో ఘటన

అభ్యర్థిపై మాల్‌ ప్రాక్టీస్‌ కేసు నమోదు చేసిన పరీక్ష సూపరింటెండెంట్‌

నిజామాబాద్‌ అర్బన్‌: నిజామాబాద్‌ జిల్లాలోని ఓ పరీక్ష కేంద్రంలో అభ్యర్థి ఓఎంఆర్‌ షీట్‌లో తప్పులు నింపాడని ఏకంగా ఆ షీట్‌నే నమిలి మింగేశాడు. ఆది­వారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. మోపాల్‌ మండలం బోర్గాం(పి) పాఠశాలలో ఏ­ర్పా­టుచేసిన ఓ పరీక్షాకేంద్రంలో టీఎస్‌­పీఎస్సీ నిర్వహించిన డీఏవో (డివిజనల్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌) పరీక్షకు నిర్మల్‌ జిల్లాకు చెందిన సహకార శాఖలో క్లర్క్‌గా పని చేస్తున్న అబ్దుల్‌ ముఖీద్‌ అనే అభ్యర్థి హాజరయ్యాడు.

పరీక్షరాసే క్రమంలో అతడు ఓఎంఆర్‌ షీట్‌ను తప్పుగా నింపడంతో దానిని చింపి మింగేశాడు. తన బెంచీలో గైర్హాజరైన అభ్యర్థికి సంబంధించిన ఓఎంఆర్‌ షీట్‌ను తీసుకుని అందులో సమాధానాలు బబ్లింగ్‌చేశాడు. కొంతసేప­టికి ఇన్విజిలేటర్‌ పరీక్షకు హాజరుకాని ఏడుగురు అభ్యర్థుల ఓఎంఆర్‌ షీట్లను కలెక్ట్‌ చేస్తుండగా...ఒకటి తక్కువ వస్తోంది.

దీంతో అబ్దుల్‌ ముఖీద్‌ పక్కన ఉండాల్సిన ఓఎంఆర్‌ షీట్‌ గురించి ఆరా తీశారు. అయితే తనకేం తెలియదని ముందు బుకాయించగా..సీసీ టీవీ ఫుటేజీ పరిశీలనలో ఇతగాడి వ్యవహారం అంతా రికార్డు కావడంతో తప్పు ఒప్పుకున్నాడు. దీంతో సూపరింటెండెంట్‌ ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వగా..ఆర్డీవో వచ్చి పరిశీలించారు. అనంతరం నాల్గవ టౌన్‌లో అబ్దుల్‌పై మాల్‌ ప్రాక్టీస్‌ కేసు నమోదు చేశారు.  

మరిన్ని వార్తలు