ప్లాస్మా దాతలను సత్కరించిన మెగాస్టార్ చిరంజీవి

7 Aug, 2020 16:31 IST|Sakshi

సాక్షి, హైద‌రాబాద్‌: కోవిడ్‌పై యుద్ధానికి ప్లాస్మా దానం ప‌దునైన ఆయుధంగా మారింది. దీంతో క‌రోనా బారిన ప‌డి ప్రాణాపాయంతో ఉన్న‌వారికి ప్లాస్మాను ఇచ్చే దిశ‌గా సైబ‌రాబాద్ సీపీ స‌జ్జ‌నార్ ప్ర‌త్యేక సెల్‌ను ఏర్పాటు చేసి స్వ‌యంగా ప‌ర్య‌వేక్షిస్తున్నారు. ముందుకొచ్చి ప్రాణాలు నిలిపిన వారిని ప్లాస్మా యోధాతో స‌త్క‌రిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా ప్లాస్మా అందించిన ప్రాణాలు కాపాడుతున్న వారిని మెగాస్టార్ చిరంజీవి అభినందించారు. శుక్ర‌వారం సైబ‌రాబాద్ కమిష‌న‌రేట్‌లో "ప్లాస్మాదానం- ప్రాణ‌దానం" ప్ర‌త్యేక కార్య‌క్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయ‌న‌ ప్లాస్మాదాత‌ల‌ను స‌త్క‌రించారు. కోవిడ్ నుంచి కోలుకున్న వారు ప్లాస్మాదానం చేయాల‌ని పిలుపునిచ్చారు. సీపీ స‌జ్జ‌నార్ మాట్లాడుతూ.. బ్లడ్ డోనేషన్ క్యాంప్‌లో త‌మ‌తో కలిసి మెగాస్టార్ చిరంజీవి పని చేశార‌ని చెప్పుకొచ్చారు. కోవిడ్ సమయంలోనూ చిరంజీవి బ్లడ్ బ్యాంక్ నుంచి కూడా రక్త దానం చేశారని తెలిపారు. (కోవిడ్‌ ట్రీట్‌మెంట్‌ @ రూ.28 వేలు)

ప్లాస్మా దానం చేస్తే మళ్లీ కోవిడ్ వ‌స్తుంద‌నేది అస‌త్య‌మేనని, దీనిపై ఎవ‌రూ అపోహలు పెట్టుకోవద్దని సూచించారు. ప్లాస్మా దానం చేయడం వల్ల‌ మరో కుటుంబాన్ని కాపాడిన వారవుతార‌ని, కాబ‌ట్టి కోవిడ్ నుంచి రికవరీ అయిన వారందరు కూడా దీని కోసం ముందుకు రావాల‌ని కోరారు. ఇక‌ కోవిడ్ సమయంలో కేవలం సైబరాబాద్‌లోనే కాకుండా, మారుమూల‌ గ్రామాల్లోకి వెళ్లి తాము భోజనం, వారి నిత్యావసర సరుకులు అందజేశామ‌న్నారు. ఇప్పటికే 400 మందికి ప్లాస్మా ఎక్కించి వారి జీవితాల్లో వెలుగులు నింపగలిగామ‌ని తెలిపారు. ప్లాస్మా దానం చేసిన వారిని సత్కరించుకోవడం చాలా సంతోషంగా ఉంది అని స‌జ్జ‌నార్ తెలిపారు. (కోవిడ్‌పై యుద్ధం: సైబరాబాద్‌ పోలీసుల ఆధ్వర్యంలో స్పెషల్‌ సెల్‌)

మరిన్ని వార్తలు