దిక్కుమాలిన కేంద్ర సర్కార్‌.. నూకలు తినమంటూ అవమానించిండు: సీఎం కేసీఆర్‌

12 Apr, 2022 19:05 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  రైతులకు 24 గంటలు కరెంట్‌ ఇచ్చిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని, బీజేపీ పాలిత రాష్ట్రంలో ఎక్కడా ఇది జరగట్లేదని అన్నారు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌ రావు. కేబినెట్‌ కీలక నిర్ణయాలు ప్రకటించిన అనంతరం.. రైతు వ్యతిరేక విధానాలు పాటిస్తోందంటూ కేంద్ర ప్రభుత్వాన్ని ఏకీపారేశారు.

కేంద్రంలో దిక్కుమాలిన ప్రభుత్వం అధికారంలో ఉందని, రైతుల ఉద్యమంపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడారని, చివరకు సాక్షాత్తూ ప్రధానే రైతులకు క్షమాపణలు చెప్పారని సీఎం కేసీఆర్‌ గుర్తు చేశారు. మంగళవారం కేబినెట్‌ భేటీ అనంతరం ఆయన ప్రగతి భవన్‌ నుంచి మీడియాతో మాట్లాడారు.

► పనికి మాలిన విద్యుత్‌ సంస్కరణలు ప్రవేశపెట్టారని, ఎరువుల ధరలను విపరీతంగా పెంచేశారని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని విమర్శించారు. ధాన్యం కొనుగోలు చేయమంటే అవమానించేలా మాట్లాడారని సీఎం కేసీఆర్‌ ఆక్షేపించారు. తెలంగాణ ప్రజలకు నూకలు తినడం అలవాటు చేయడండంటూ బుర్రతక్కువ మాటలు మాట్లాడాలంటూ, ‘క్యా చమత్కార్‌’ అంటూ పిచ్చి ప్రేలాపనలు చేశాడని, అసలు ఆయనకు బుద్ధి, జ్ఞానం ఉందా? అంటూ కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌పై సీఎం కేసీఆర్‌ మండిపడ్డారు. 

► తెలంగాణ రైతుల పట్ల కేంద్రం వైఖరి సరిగా లేదన్న సీఎం కేసీఆర్‌.. బియ్యం మెలికకు ప్రతీసారి మెలిక పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అసమర్థతను ఇతరుల మీద నెట్టేసే ప్రయత్నం చేస్తున్నారంటూ విమర్శించారు. వడ్లు కొనడం చేతకాదు అని కేంద్రం చెప్పొచ్చు కదా అని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. 

► బలమైన కేంద్రం, బలహీన మైన రాష్ట్రం అనేది బీజేపీ, ఆరెస్సెస్‌ దిక్కుమాలిన సిద్ధాంతమని, అది ఫెడరల్‌ స్ఫూర్తికి విరుద్ధమని సీఎం కేసీఆర్‌ అన్నారు.

► బ్యాంకు రుణాలు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన కార్పొరేట్‌ గద్దల్ని వదిలేస్తారని, అదే రైతుల సంక్షేమం కోసం అయితే నానారాద్ధాంతం చేస్తున్నారని, ఇదొక దద్దమ్మ ప్రభుత్వమని కేంద్రంపై మండిపడ్డారు.

► వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేసేందుకే కేంద్రం కుట్ర చేస్తోందని, ఆహార భద్రత నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. 

► కేంద్రం వైఖరి అర్థమయ్యే.. వేరే పంటలు వేసుకోవాలని రైతులకు చెప్పామని సీఎం కేసీఆర్‌ అన్నారు. 

► తెలంగాణలో యాసంగి ధాన్యం కొనుగోలు కేంద్రాలను మొదలుపెట్టమని, సీఎస్‌ నేతృత్వంలో కమిటీ వేశామని,  మూడు నాలుగు రోజుల్లో ధాన్యం కొనుగోలుకు అధికార యంత్రాంగాన్ని ఆదేశించామని, తమది సమర్థవంతమైన ప్రభుత్వమని, ఒక్క గింజ కూడా తక్కువ ధరకు అమ్మకండని రైతులకు సీఎం కేసీఆర్‌ విజ్ఞప్తి చేశారు.

► కేంద్రం కొనకపోతేనేం.. కనీస మద్ధతు ధరకే తాము కొనుగోలు చేస్తామని, గతంలో మాదిరే డబ్బు బ్యాంకుల్లో జమ అవుతాయని తెలంగాణ రైతులకు స్పష్టం చేశారు సీఎం కేసీఆర్‌. క్వింటాల్‌ ధాన్యానికి రూ.1960 చొప్పున కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు. ధాన్యం కొనుగోలు చేసేందుకు ప్రతి ఊరిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

► ఎన్నికలు ఉన్న రాష్ట్రాల్లోనే శ్రీరామనవమి సందర్భంగా రాళ్లు రువ్వడం, మతఘర్షణలు జరిగాయని, రాజకీయ లబ్ధి కోసం చూస్తున్నారంటూ విమర్శించారు.

 సిలికాన్‌ వ్యాలీగా పేరున్న బెంగళూరును.. హిజాబ్‌ అంశంతో ప్రపంచస్థాయిలో బద్నాం చేశారని సీఎం కేసీఆర్‌ అన్నారు.

► మత పిచ్చితో దేశం ఛిన్నభిన్నమైతే సంబాలించుకోవడానికి వందల ఏళ్లు పడుతుందని, అతి భారీ మూల్యం దేశం చెల్లించాల్సి వస్తుందని, ఉన్మాదుల చేతులో మేధావులు, యువత పడితే వెనక్కి వెళ్లిపోతుందని, భారత్‌ బుద్ధి జీవుల దేశంగా విరజిల్లాలని కోరుకుంటున్నట్లు సీఎం కేసీఆర్‌ చెప్పారు.

► నియంతలెందరో చరిత్ర నుంచి కనుమరుగు అయ్యారని కేంద్రంలో ఉన్నవాళ్లు గుర్తించాలని, అలాగే దేశంలో రైతాంగానికి ఒక ఏకీకృత వ్యవస్థ విధానం అవసరం ఉందని, ఈ కేంద్ర ప్రభుత్వం గనుక దానిని స్వీకరించకపోతే రైతులే తమకు అనుకూల ప్రభుత్వం తెచ్చుకుంటారని, దేశాన్ని చైతన్య పరిచే పోరాటంలో తన వంతు కృషి తప్పక ఉంటుందని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు