ఎలక్ట్రిక్‌ స్కూటర్లు.. మరో అగ్ని ప్రమాదం.. ప్రతిష్టాత్మక సంస్థకి విచారణ బాధ్యతలు

12 Apr, 2022 19:07 IST|Sakshi

పెట్రోలు ధరల నుంచి అతి పెద్ద ఉపశమనంగా ఎలక్ట్రిక్‌ వాహనాలను ప్రజలు భావిస్తున్న తరుణంలో ఊహించని ప్రమాదాలు ఇటు ప్రజలను అటు ఈవీ తయారీదారులను కలవరపాటుకు గురి చేస్తున్నాయి. మార్చి  మధ్య నుంచి దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్‌ స్కూటర్లు అకస్మాత్తుగా తగలబడి పోతున్నాయి. తాజాగా మహారాష్ట్రలోని నాసిక్‌లో జితేంద్ర ఈవీ కంపెనీకి చెందిన 20 ఎలక్ట్రిక​ స్కూటర్లు 2022 ఏప్రిల్‌ 12న మంటల్లో చిక్కుకుని కాలిపోయాయి. ఫ్యాక్టరీ నుంచి స్కూటర్లను రవాణా చేసేందుకు తరలిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.

వరుసగా ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ అగ్నికి ఆహుతి అవుతుండటంపై కేంద్ర ప్రభుత్వం కన్నెర్ర చేసింది. ఏ కారణం చేత ఇలా వాహనాలు తగలబడిపోతున్నాయో విచారణ జరపాల్సిందిగా ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌, బెంగళూరుకు ఆదేశాలు జారీ చేసింది. అంతకంటే ముందే పూనేలో ఓలా స్కూటర్‌ తగలబడిపోయిన ఘటనపై కేంద్రం స్పందించింది. 

ఉన్నట్టుండి ఈవీ స్కూటర్లు ఎందుకు మంటల్లో చిక్కుకుంటున్నాయో కనిపెట్టాలంటూ సెంటర్‌ ఫర్‌ ఫైర్‌ ఎక్స్‌ప్లోజివ్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌ సేఫ్టీ (సీఎఫ్‌ఈఈఎస్‌)కు సూచింంచింది. ఈ విచారణ కొనసాగుతుండగానే మరో ప్రమాదం చోటు చేసుకోవడంతో కేంద్రం విచారణ బాధ్యతలు ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ బెంగళూరు వంటి ప్రతిష్టాత్మక సంస్థకి అప్పగించింది.

ఇండియాలో ఈవీ వెహికల్స్‌ మార్కెట్‌ పుంజుకుంటోంది. 2020-21 ఏడాదిలో దేశవ్యాప్తంగా 1,34,821 ఈవీలు అమ్ముడవగా 2021-22 ఏడాదిలో 4,29,417 ఈవీలు అమ్ముడయ్యాయి. ఇలా నాలుగింతలు మార్కెట్‌ పెరిగిన తరుణంలో ప్రమాదాలు కలవరం కలిగిస్తున్నాయి. నాసిక్‌లో తాజాగా చోటు చేసుకున్న ఘటన ఈవీ స్కూటర్లకు సంబంధించి అతి పెద్ద ప్రమాదంగా నమోదు అయ్యింది.
 

చదవండి: కాలిపోతున్న ఎలక్ట్రిక్ స్కూటర్లు..కారణం ఏంటంటే?

మరిన్ని వార్తలు