మీ మద్దతు మాకివ్వండి: ఉత్తమ్‌

29 Mar, 2021 02:47 IST|Sakshi

సాగర్‌ ఎన్నికల కోసం కమ్యూనిస్టులకు కాంగ్రెస్‌ లేఖలు

సీపీఐ, సీపీఎం కార్యదర్శులతో ఫోన్‌లో మాట్లాడిన ఉత్తమ్, భట్టి

హైదరాబాద్‌: నాగార్జునసాగర్‌ ఉపఎన్నికల్లో మద్దతివ్వాలంటూ వామపక్షాలను కాంగ్రెస్‌ కోరింది. తమ పార్టీ అభ్యర్థి కె.జానారెడ్డి గెలుపునకు సహకరించాలని కోరుతూ టీపీసీసీ అధ్యక్షుడు ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఆదివారం సీపీఐ, సీపీఎంలకు లేఖలు రాశారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ అవినీతి, అప్రజాస్వామ్య పాలన, బీజేపీ మత రాజకీయాలను ఓడించేందుకు తెలంగాణలోని అన్ని లౌకిక, ప్రజాస్వామ్య శక్తులు తమతో కలసి రావాలని ఇరు పార్టీల రాష్ట్ర కార్యదర్శులను కోరారు. తమ అభ్యర్థి జానారెడ్డి.. సమితి అధ్యక్షుడిగా, 7 సార్లు ఎమ్మెల్యేగా, 17 సంవత్సరాలు కేబినెట్‌ మంత్రిగా, 5 సంవత్సరాలు సీఎల్పీ నేతగా పనిచేశారని, ప్రజాజీవితంలో గౌరవానికి ప్రతీకగా నిలిచారని తెలిపారు.

ఆయన గెలుపు తెలంగాణ రాజకీయాల్లో కీలక మలుపు అవుతుందని, ఈ నేపథ్యంలో తమకు మద్దతివ్వాలని విజ్ఞప్తి చేశారు. ఇరు పార్టీల నేతలకు లేఖలు రాయడంతో పాటు ఆ పార్టీ నేతలతో ఫోన్‌లో కూడా మాట్లాడారని, తమ పార్టీల్లో చర్చించిన అనంతరం నిర్ణయం వెల్లడిస్తామని కామ్రేడ్లు చెప్పారని కాంగ్రెస్‌ వర్గాలు వెల్లడించాయి. కాగా, ఈ విషయమై ఒకట్రెండు రోజుల్లో ఇరు పార్టీల నేతల మధ్య చర్చలు జరిగే అవకాశాలు కన్పిస్తున్నాయి.  

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు