కొడుకు, కోడల్ని పొట్టన పెట్టుకుంది 

30 May, 2021 04:16 IST|Sakshi

కరోనాల మన్నువడా.. నాకు కడుపుకోత మిగిల్చింది

కన్నీరుమున్నీరవుతున్న సిద్దవ్వ

సాక్షి, కామారెడ్డి: ‘నా పాణం బాగుండది బిడ్డా. బీపీ, సుగర్‌ ఉన్నది. నా కొడుకు ఎంతన్న మంచిగా చూస్తుండే. కోడలు గూడ ఎంతన్న మంచిగా ఉండేది. ఇద్దరు మనుమరాల్లను ఆడించుకుంటూ ఉండేదాన్ని. దేవుడునాకు ఆన్నాయం జేసిండు. నా కొడుకు, కోడల్ని కరోనా బలి తీసుకుంది. నాకేమో చాత గాదు. ఇప్పుడీ 
ఇద్దర్నీ ఎట్లా సాదాలయ్యా’అంటూ చిన్నారులను దగ్గర పెట్టుకుని కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది కామారెడ్డికి చెందిన సిద్దవ్వ.

కరోనా సెకండ్‌ వేవ్‌ కుటుంబాలకు కుటుంబాలనే బలి తీసుకుంటోంది. భార్యాభర్తలు, అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్లు, తాతా మనవళ్లు.. ఇలా ఒకే కుటుంబంలో ఇద్దరు, ముగ్గురు దాని బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. ఇదే తరహాలో సిద్దవ్వ తన కొడుకును, కోడల్నీ కోల్పోయింది. తననే ఒకరు చూసుకోవాల్సిన పరిస్థితిలో ఉన్న ఆమె.. ఇద్దరు మనవరాళ్లను ఎలా సాకాలో తెలియక తల్లడిల్లిపోతోంది. 

అంతులేని విషాదం 
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పంచముఖి హనుమాన్‌ కాలనీకి చెందిన బీమరి రాజేష్‌ (35), ఆయన భార్య స్రవంతి (31)ని వారం రోజుల వ్యవధిలోనే కరోనా కాటేసింది. రాజేష్‌కు తల్లి సిద్దవ్వ, కుమార్తెలు పదేళ్ల వైష్ణవి, ఏడేళ్ల వర్షిత ఉన్నారు. చిరు వ్యాపారం చేసే రాజేష్‌ కొన్నాళ్ల క్రితం కరోనా లక్షణాలతో ఓ స్థానిక వైద్యుడి దగ్గరకు వెళ్లాడు. మలేరియా జ్వరం అని చెప్పిన ఆ వైద్యుడు మందులు రాసిచ్చాడు. నాలుగు రోజులు గడిచేసరికి పరిస్థితి విషమించి ఇంట్లోనే కన్ను మూశాడు. ‘నా కండ్ల ముందరనే కొడుకు సచ్చిపోయిండు. కొడుకు సావు జేసినమో లేదో కోడలు స్రవంతికి, నాకు, నా బిడ్డకు కూడా కరోనా వచ్చింది.

మేమందరం మందులు ఏసుకున్నం. కోడలికి ఇబ్బంది అయ్యింది. దవాఖానకు తీసుకుపోతే హైదరాబాద్‌కు పొమ్మని డాక్టర్లు చెప్పిండ్రు. దీంతో పట్నంల కింగ్‌ కోఠి ఆస్పత్రిల చేరిస్తే, అక్కడ ఇబ్బంది ఉందని యశోదకు తీసుకుపోయినారు. ఆడ కూడా సుదరాయించలేదు. గాంధీ ఆస్పత్రికి తీసుకుపోయినాక చనిపోయింది. ఇప్పుడు నా మనుమరాండ్లను నేనెట్టా సాదాలి. నాకు తల కొరివి పెడతాడని అనుకుంటే నా కండ్ల ముందే కొడుకు, కొడుకు తర్వాత కోడలు సచ్చి పోయిండ్రు. నాకు, నా మనుమరాండ్రకు ఎవరు దిక్కు..’అంటూ సిద్దవ్వ రోదిస్తోంది.

కొడుకు, కోడలు పోయిన దుఃఖం.. పిల్లలను చూసుకోవాల్సిన బాధ్యతతో ఏం చేయాలో తెలియక ఆమె అల్లాడిపోతోంది. మరోవైపు రాజేష్‌ ఇంటి కోసం తీసుకున్న బ్యాంకు లోను భారంగా మారింది. బ్యాంకు వాళ్లు లోన్‌ కట్టాలని అంటున్నారని, దానికి ఇన్సూరెన్స్‌ కూడా లేదని చెబుతున్నారని రాజేష్‌ బంధువులు తెలిపారు. పిల్లల పోషణ భారంగా మారిన పరిస్థితుల్లో ఇంటి రుణం మాఫీ అయ్యేలా చూడాలని కోరుతున్నారు.

పిల్లలను చూస్తే గుండె అవసిపోతోంది
 ‘నా తమ్ముడు మంచిగా బతుకుతున్నాడు అని ఎంతన్న మురిసిపోయిన. కానీ కరోనాతో చనిపోయిండు. నా మరదలన్నా బాగై ఇంటికొస్తదని అనుకున్నా. చనిపోయిందని ఫోన్‌ రాగానే గుండెలు బాదు కున్నం. పిల్లలను చూస్తుంటే దుఖం వస్తోంది..’అని పిల్లల మేనత్త అంజమ్మ రోదిస్తోంది.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు