వ్యాక్సిన్‌ మొదట వారియర్స్‌కే! 

22 Oct, 2020 13:05 IST|Sakshi

సాక్షి, కామారెడ్డి‌: కోవిడ్‌–19 వ్యాక్సిన్‌ త్వరలో అందుబాటులోకి వస్తుందన్న అంచనాల నేపథ్యంలో.. మొదటి విడతలో ఈ వ్యాక్సిన్‌ను కరోనా వారియర్స్‌కు వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వైరస్‌ నియంత్రణకు ప్రాణాలొడ్డి కృషి చేస్తోన్న హెల్త్‌ కేర్‌ వర్కర్స్‌ (హెచ్‌సీడబ్ల్యూ)కు వ్యాక్సిన్‌ వేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. కరోనా వ్యాక్సిన్‌ ఎవరెవరికి ఇవ్వాలో పేర్లతో జాబితా రూపొందించాలని వైద్యారోగ్య శాఖ ఆదేశించింది. దీంతో జిల్లా యంత్రాంగం ఆయా వివరాలు సేకరిస్తోంది. ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో పని చేసే వైద్య సిబ్బందితో పాటు ఆశలు, ఏఎన్‌ఎంల వివరాలతో జాబితా రూపొందిస్తోంది. ఆయా వివరాలను కేంద్ర అధికారిక పోర్టల్‌లో నమోదు చేయనున్నారు. 

జిల్లాలోని ప్రభుత్వ ఏరియా, సీహెచ్‌సీ, పీహెచ్‌సీ, యూపీహెచ్‌సీలతో పాటు ప్రభుత్వ పరిధిలో ఉన్న ఆరోగ్య సంరక్షణ కార్మికులు, రెగ్యులర్‌ ఉద్యోగులు, కాంట్రాక్ట్, ఔట్‌ సోర్కింగ్‌ సిబ్బంది, అధికారులతో పాటు ప్రైవేట్‌ ఆస్పత్రుల్లోని వైద్యులు, సిబ్బంది వివరాలను సేకరించారు. ప్రభుత్వ పరిధిలో ఉన్న వైద్యాధికారుల వివరాలను ఇప్పటికే ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. ప్రైవేట్‌కు సంబంధించి ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (ఐఎంఏ) ద్వారా ప్రభుత్వ అనుమతి పొందిన ఆస్పత్రుల్లో వైద్యులు, సిబ్బంది వివరాలను సేకరిస్తున్నారు. ఆయా వివరాలను గురువారం సేకరించి, వైద్యారోగ్య శాఖకు పంపించనున్నారు. 

ఆన్‌లైన్‌ డేటా ప్రకారమే వ్యాక్సిన్‌ 
కోవిడ్‌ వ్యాక్సిన్‌ను పంపిణీ చేసేందుకు ఆన్‌లైన్‌ ట్రాకింగ్‌ పద్ధతిన ఎలక్ట్రానిక్‌ వ్యాక్సిన్‌ ఇంటెలిజెన్స్‌ నెట్‌వర్క్‌(ఈవీఐఎన్‌) ద్వారా టీకాలను ఇవ్వనున్నారు. ఇందుకోసం సీవీబీఎంఎస్‌ ద్వారా డేటాను ట్రాకింగ్‌ చేయనున్నారు. మొదటి దశలో జిల్లాలో హెల్త్‌ కేర్‌ వర్కర్స్‌ డేటాను సేకరిస్తున్నారు. ఆ డేటా ప్రకారమే జిల్లాకు వ్యాక్సిన్‌ను విడుదల చేయనున్నారు. జిల్లాలో వైద్యారోగ్యశాఖ, వైద్యవిధాన పరిషత్‌లో మూడు వేలకు పైగా ఉద్యోగులు ఉండగా, ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో మరో రెండు వేల వరకు సిబ్బంది పని చేస్తున్నారు. వీరందరికీ మొదటి దశలోనే కోవిడ్‌–19 నివారణ టీకాలు ఇవ్వనున్నారు.  

వివరాలను సేకరిస్తున్నాం 
ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు హెల్త్‌ కేర్‌ వర్కర్స్‌ వివరాలను సేకరిస్తున్నాం. ప్రభుత్వ, ప్రైవేట్‌ పరిధిలోని వైద్యులు, ఉద్యోగులు, సిబ్బంది వివరాలు నమోదు చేస్తున్నాం. గురువారం పూర్తి వివరాలను పంపాల్సి ఉంది. అధికారులు పంపిన ఫార్మెట్‌ ప్రకారం వివరాలను సేకరిస్తున్నాం.  – డాక్టర్‌ చంద్రశేఖర్, డీఎంహెచ్‌వో

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా