కరోనా దరిచేరని ఊరు; అక్కడ ఒక్క కేసూ లేదు..

19 May, 2021 08:11 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

 మనుబోతులగూడెం గ్రామస్తులకు సోకని కోవిడ్‌–19

కరోనా భయం లేని మారుమూల గిరిజన గ్రామం 

సాక్షి, అశ్వాపురం: కరోనా సెకండ్‌ వేవ్‌ విజృంభిస్తూ ప్రజల ప్రాణాలను బలిగొంటోంది. పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా ప్రతి చోట కోవిడ్‌–19 కేసులు నమోదవుతూనే ఉన్నాయి. కరోనా సోకినవారిలో చాలామంది ప్రజలు కోలుకుంటున్నారు. ఇతరత్రా సమస్యలు ఉన్న కొద్ది మంది చనిపోతున్నారు. అయితే, కనీస రహదారి సౌకర్యం లేని ఓ మారుమూల గిరిజన గ్రామానికి మాత్రం కరోనా అంటలేదు. అక్కడి వారికి కరోనా భయం లేదు. గత ఏడాది మార్చి నుంచి ఇప్పటి వరకు ఒక్క కరోనా పాజిటివ్‌ కేసు కూడా నమోదు కాలేదు. కరోనా అంటే ఆ గిరిజనులకు ఎలాంటి భయాందోళనలు లేవు. అశ్వాపురం మండల కేంద్రానికి దూరంగా కనీస రహదారి సౌకర్యం లేని మారుమూల దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్న మనుబోతులగూడెం గ్రామపంచాయతీలో గతేడాది కాలంగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాకపోవడం గమనార్హం.

మనుబోతులగూడెం గ్రామపంచాయతీలో నాలుగు వలస గొత్తి కోయ గ్రామాలున్నా కరోనా కేసులు నమోదు కాలేదు. మనుబోతులగూడెం గ్రామపంచాయతీలో ఐతయ్య గుంపులో 41, మడకం మల్లయ్య గుంపులో 11, మనుబోతులగూడెం గ్రామంలో 20 కుటుంబాలు, సంతోష్‌గుంపులో 28, పొడియం నాగేశ్వరరావు గుంపులో 20, వేములూరు గ్రామంలో 40 కుటుంబాలు ఉన్నాయి. మనుబోతులగూడెం గ్రామపంచాయతీ ప్రజలు ఇతర గ్రామాలకు వెళ్లకపోవడం, శుభకార్యాలకు వెళ్లకపోవడం, జనావాసాల ప్రాంతాలకు వెళ్లకపోవడం వారికి కరోనా సోకకపోవడానికి కారణాలు. ఎక్కువ శాతం ఆ గ్రామానికే పరిమితమయ్యారు. ఆ గ్రామం నుంచి ఇతర గ్రామాలకు రాకపోకలు లేకపోవడంతో కొత్త వ్యక్తులు సంచరించే అవకాశం లేదు. గిరిజనులు, ఆదివాసీలు, గొత్తి కోయలు అటవీ ఉత్పత్తులు సేకరించి అడవిలో సహజంగా లభించిన ఆహార పదార్థాలు తినడం వారిలో వ్యాధి నిరోధకశక్తి అధికంగా ఉండటానికి కారణమవుతోంది. వాగులు, చెలిమల నీరే వారికి తాగునీరు. 

చదవండి:పెళ్లిచేసుకుని మోసం చేస్తున్నాడు: లేడీ కానిస్టేబుల్‌ ఫిర్యాదు 

మరిన్ని వార్తలు