మూడేళ్లుగా ఒకేచోట.. సైబరాబాద్‌లో ఎస్‌హెచ్‌ఓల బదిలీలు? 

29 Nov, 2021 10:21 IST|Sakshi

సైబరాబాద్‌లో ఎస్‌హెచ్‌ఓల బదిలీలు? 

మాదాపూర్, బాలానగర్‌ జోన్లలో..6 6 మంది ఎస్‌ఐలకు పోస్టింగ్‌లు కూడా.. 

సాక్షి, హైదరాబాద్‌: సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో మూడేళ్లకు పైగా ఒకటే పోలీస్‌ స్టేషన్లలో విధులు నిర్వహిస్తున్న స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్లు (ఎస్‌హెచ్‌ఓ)లు బదిలీ కానున్నారు. మాదాపూర్, బాలానగర్‌ జోన్లలో దీర్ఘకాలికంగా ఒకే చోట విధులు నిర్వహిస్తున్న పలువురు ఇన్‌స్పెక్టర్లను బదిలీ చేసేందుకు రంగం సిద్ధమైనట్లు విశ్వసనీయ సమాచారం. ఆయా అధికారుల పనితీరు సక్రమంగా లేకపోవటమే సస్పెన్షన్‌కు కారణాలని తెలిసింది. రెండు మూడు వారాల్లో ఆయా బదిలీలు జరుగుతాయని సమాచారం. శాసనమండలి (ఎమ్మెల్సీ) ఎన్నికల కోడ్‌ ఎత్తివేసిన నేపథ్యంలో ఈ బదిలీలు చేయాలని సైబరాబాద్‌ సీపీ స్టీఫెన్‌ రవీంద్ర నిర్ణయించినట్లు తెలిసింది. సైబరాబాద్‌ సీపీగా స్టీఫెన్‌ బాధ్యతలు చేపట్టిన తర్వాత.. పలు భూ వివాదాల్లో తలదూర్చినందుకు నార్సింగి పీఎస్‌ ఇన్‌స్పెక్టర్‌ మధనం గంగాధర్, ఎస్‌ఐ కే లక్ష్మణ్‌లను సస్పెండ్‌ చేసిన విషయం తెలిసిందే.  

66 మంది ఎస్‌ఐలకు పోస్టింగ్‌లు.. 
సైబరాబాద్‌లో మాదాపూర్, బాలానగర్, శంషాబాద్‌ మూడు జోన్లలో కలిపి 36 లా అండ్‌ ఆర్డర్‌ పోలీస్‌ స్టేషన్లున్నాయి. ఇన్‌చార్జి ఇన్‌స్పెక్టర్లతో నెట్టుకొస్తున్న పలు పోలీస్‌ స్టేషన్లకు శాశ్వత అధికారులను నియమించనున్నట్లు తెలిసింది. ఇటీవలే 66 మంది సబ్‌ ఇన్‌స్పెక్టర్లు (ఎస్‌ఐ) సైబరాబాద్‌ కమిషనరేట్‌కు రిపోర్ట్‌ అయ్యారు. ప్రస్తుతం వీళ్లంతా జోన్లకు అటాచ్‌లో ఉన్నారు. త్వరలోనే వీళ్లందరికీ కొత్త పోస్టింగ్స్‌ ఇవ్వనున్నట్లు తెలిసింది. చేవెళ్ల వంటి సున్నితమైన ప్రాంతాలలోని పీఎస్‌లలో ఎస్‌ఐల విద్యార్హతలు, నిబద్ధత, క్రమశిక్షణలను బట్టి పోస్టింగ్‌ ఇవ్వనున్నట్లు తెలిసింది.  

పీఎస్‌లను సందర్శిస్తూ.. 
సీపీగా బాధ్యతలు చేపట్టిన రోజు నుంచే శాంతి భద్రతలపై సీపీ స్టీఫెన్‌ రవీంద్ర ప్రత్యేక దృష్టి సారించారు. క్రమం తప్పకుండా పోలీస్‌ స్టేషన్లను సందర్శిస్తూ, పోలీసుల పనితీరును సీపీ ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. స్టేషన్, రికార్డ్‌ల నిర్వహణలను లోతుగా పరిశీలించారు. రిసెప్షన్, జేడీ ఎంట్రీ ప్రతి రికార్డ్‌లను క్షుణ్నంగా పరిశీలిస్తున్నారు. లా అండ్‌ ఆర్డర్, నేరాల నివారణ వ్యూహాలపై ఎప్పటికప్పుడు పోలీసులకు సూచనలు చేస్తున్నారు. ఇప్పటికే కూకట్‌పల్లి, రాజేంద్రనగర్, మైలార్‌దేవ్‌పల్లి పీఎస్‌లలో సందర్శించారు. 
చదవండి: హృదయ విదారకం: రోగికి ఊపిరి పోస్తుండగా.. ఆగిన డాక్టర్‌ గుండె

మరిన్ని వార్తలు