హమ్మయ్య.. ఊపిరాడింది! 

17 Nov, 2020 08:29 IST|Sakshi

సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్‌ సిటీజన్లకు ఇది శుభవార్త. దీపావళికి కాల్చిన బాణసంచాతో వెలువడే కాలుష్యం గతేడాది దీపావళితో పోలిస్తే తగ్గుముఖం పట్టింది. దీంతో ప్రజలు స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకుంటున్నారు. ఈసారి మహానగరవాసుల్లో పర్యావరణ స్పృహ పెరగడం, లాక్‌డౌన్, కోవిడ్‌ కష్టాల నేపథ్యంలో చేతిలో నగదు నిల్వలు లేక బాణసంచా కొనుగోళ్లు 40 శాతం మేర తగ్గాయి. దీంతో కాలుష్యం తగ్గుముఖం పట్టడం విశేషం. ప్రధానంగా వాయుకాలుష్యంలోని సూక్ష్మ, స్థూల ధూళికణాల కాలుష్యం గతేడాది కంటే తగ్గుముఖం పట్టగా..సల్ఫర్‌డయాక్సైడ్‌ కాలుష్యం స్వల్పంగా పెరగడం గమనార్హం. ఇక నైట్రోజన్‌ ఆక్సైడ్‌ల కాలుష్యం తగ్గుముఖం పట్టినట్లు పీసీబీ తాజానివేదికలో వెల్లడైంది. శబ్దకాలుష్యం సైతం గతేడాది కంటే స్వల్పంగా తక్కువ నమోదుకావడంతో సిటీజన్లు హర్షం వ్యక్తంచేస్తున్నారు. గతేడాది దీపావళి, ప్రస్తుత దీపావళి రోజున నగరంలో పలు ప్రాంతాల్లో నమోదైన శబ్ద, వాయు కాలుష్యం డేటాను సోమవారం రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి విడుదల చేసింది. చదవండి: ఎట్టకేలకు తల్లి చెంతకు..

తగ్గిన వాయు కాలుష్యం.. 
గ్రేటర్‌ పరిధిలో గతేడాది దీపావళి పర్వదినంతో పోలిస్తే ఈ సారి వాయుకాలుష్యం గణనీయంగా తగ్గుముఖం పట్టింది. ఉదాహరణకు సూక్ష్మ ధూళికణాల మోతాదు గతేడాది పండగరోజున ఘనపు మీటరుగాలిలో 72 మైక్రోగ్రాములు నమోదుకాగా..ఈ సారి పర్వదినం రోజున కేవలం 64 మైక్రోగ్రాములు మాత్రమే నమోదైంది. ఇక స్థూల ధూళికణాల మోతాదు గతేడాది దీపావళి రోజున 163.4 మైక్రోగ్రాములు నమోదుకాగా..ఈ సారి కేవలం 128 మైక్రోగ్రాములు మాత్రమే నమోదైంది. కాగా ఈ సారి సల్ఫర్‌డయాక్సైడ్‌ కాలుష్య కారకం మోతాదు స్వల్పంగా పెరిగినట్లు పీసీబీ తాజా నివేదిక వెల్లడించింది. చదవండి: ముంబైలో తగ్గిన దీపావళి సప్పుడు

స్వల్పంగా తగ్గిన శబ్ద కాలుష్యం.. 
నగరంలో పలు పారిశ్రామిక, వాణిజ్య, నివాస, సున్నిత ప్రాంతాల్లో పీసీబీ శబ్ద కాలుష్యాన్ని నమోదు చేసింది. గతేడాది నివాస ప్రాంతాల్లో పగలు 69 డెసిబుల్స్‌..రాత్రివేళ 64 డెసిబుల్స్‌ కాలుష్యం నమోదుకాగా..ఈ సారి(2020 దీపావళి) పగలు 59 డెసిబుల్స్‌..రాత్రి 63 డెసిబుల్స్‌ మేర శబ్దకాలుష్యం నమోదైనట్లు పీసీబీ తాజా నివేదిక తెలిపింది. 

కాలుష్యం తగ్గడానికి కారణాలివే.. 
♦  సిటీజన్లలో పర్యావరణ స్పృహ పెరగడం 
♦  కోవిడ్‌ రోగులు, కోవిడ్‌ నుంచి ఇటీవలే కోలుకున్నవారు, శ్వాసకోశ సమస్యలున్నవారు, వృద్ధులు, చిన్నారులు స్వేచ్ఛగా శ్వాసించేందుకు అసౌకర్యం కలుగుతుందన్న భావన. 
♦  కోవిడ్, లాక్‌డౌన్‌ కష్టాల నేపథ్యంలో చేతిలో నగదు నిల్వలు లేకపోవడం. 
♦  క్రాకర్స్‌పై నిషేధం విషయంలో గ్రీన్‌ ట్రిబ్యునల్, హైకోర్టు నిషేధం ఉత్తర్వులు జారీచేయడంతో వినియోగదారులు అయోమయానికి గురవడం.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా