‘నెల తక్కువ’ బిల్లులపై ఈఆర్సీ నజర్‌

19 Apr, 2022 04:06 IST|Sakshi

‘సాక్షి’కథనానికి స్పందించిన రెగ్యులేటరీ కమిషన్‌.. వివరణ కోరుతూ డిస్కంలకు నోటీసులు  

సాక్షి, హైదరాబాద్‌: నెల పూర్తికాకముందే విద్యుత్‌ బిల్లులు జారీ చేసే క్రమంలో బిల్లులు భారీగా పెరిగిపోతున్నాయని.. ఈ నెల 9న ‘నెల తక్కువ.. మోత ఎక్కువ’ శీర్షికతో ‘సాక్షి’ ప్రచురించిన కథనంపై ఈఆర్సీ స్పందించింది. ఈ వ్యవహారంపై వివరణ ఇవ్వాలని డిస్కంలను తాజాగా ఆదేశించింది. డిస్కంల నుంచి వివరణ అందాక పరిశీలించి తగిన ఆదేశాలు జారీ చేస్తామని ఈఆర్సీ చైర్మన్‌ తన్నీరు శ్రీరంగారావు ‘సాక్షి’కి తెలిపారు. నిబంధనల ప్రకారం నెల రోజులకు మీటర్‌ రీడింగ్‌ తీసి బిల్లులు జారీ చేయాలి. కానీ ఆచరణలో అది సాధ్య మవట్లేదు.

నెల దాటాక కాని, లేదా నెల పూర్తికాక ముందే బిల్లులు జారీ చేస్తున్నారు. అయితే నెల గడిచాక బిల్లులు జారీ చేస్తే వినియోగం పెరిగి బిల్లు శ్లాబులు మారిపోతున్నాయి. దీంతో బిల్లులు బాగా పెరుగుతున్నాయని గతంలో వినియోగదారుల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయి. దీంతో నెల రోజుల సగటు వినియోగాన్ని అంచనా వేసి సంబంధిత శ్లాబు కిందే బిల్లులు జారీ చేయాలని డిస్కంలను ఈఆర్సీ ఆదేశించింది. ఈ ఉత్తర్వులను అడ్డుగా పెట్టుకుని, నెల పూర్తికాకుండానే జారీ చేసే బిల్లుల శ్లాబులను మార్చి అధిక బిల్లులు జారీ చేస్తున్నాయి.

సకాలంలో మీటర్‌ రీడింగ్‌ తీయకపోవడం డిస్కంల పొరపాటైనా వినియోగదారులు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోందని ‘సాక్షి’ కథనాన్ని ప్రచురించింది. ఈ విషయంలో డిస్కంల చర్యలు ఈఆర్సీ టారీఫ్‌ ఉత్తర్వులకు విరుద్ధంగా ఉన్నాయని నిపుణులు ఆరోపిస్తున్నారు. డిస్కంల చర్యలను తప్పుబడుతూ ఈఆర్సీ ఆదేశాలు జారీ చేస్తే ఏటా రూ.కోట్ల భారం వినియోగదారులకు తప్పనుంది.

మరిన్ని వార్తలు