ఎమ్మెల్యే రాజాసింగ్‌పై ఫేస్‌బుక్ నిషేధం

3 Sep, 2020 14:53 IST|Sakshi

సాక్షి, హైద‌రాబాద్ :  గోషామ‌హ‌ల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై ఫేస్‌బుక్ నిషేధం విధించింది. ద్వేష‌పూరిత ప్ర‌సంగాలు, రెచ్చ‌గొట్టే వ్యాఖ్య‌లు చేస్తూ ఫేస్‌బుక్ నిబంధ‌న‌ల్ని ఉల్లంఘించిన కార‌ణంగా నిషేదం విధిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఈ మేర‌కు ఫేస్‌బుక్ ప్ర‌తినిధి ఒక‌రు ఈ- మెయిల్ ద్వారా వెల్ల‌డించారు. హింసను ప్రోత్స‌హించేలా వ్యాఖ్య‌లు చేస్తున్న కార‌ణంగా రాజాసింగ్‌ ఫేస్‌బుక్ అకౌంట్‌ని తొలిగిస్తున్నామంటూ ప్ర‌క‌టించారు. ఇదివ‌ర‌కే దీనికి సంబంధించి ప‌లుసార్లు హెచ్చ‌రించినా ఫేస్‌బుక్ నియమా‌వళిని ఉల్లంఘించార‌ని పేర్కొన్నారు. (‘గణపతిని మావోయిస్టు పార్టీ వదులుకోదు’)

మ‌రోవైపు ఫేస్‌బుక్ నిషేదంపై స్పందించిన రాజాసింగ్ త‌న‌కు అధికారికంగా ఇంత‌వ‌ర‌కు ఎలాంటి ఫేస్‌బుక్ అకౌంట్ లేద‌ని, త‌న పేరుతో ఉన్న న‌కిలీ అకౌంట్ల‌కు తాను బాధ్యుడిని కానంటూ వివర‌ణ ఇచ్చారు. ఇక ప్ర‌పంచవ్యాప్తంగా అత్య‌ధిక ఖాతాదారులున్న ఫేస్‌బుక్ బీజేపీ నేతల విద్వేషపూరిత ప్రసంగాలను  చూసీచూడనట్లుగా వదిలేస్తోందనే వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ కథనం ప్ర‌చురించిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో తాజాగా బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై నిషేధం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. (డ్ర‌గ్స్ వ్య‌వ‌హారంతో న‌టికి లింకు!)

మరిన్ని వార్తలు