నిరీక్షణ ఫలించిన వేళ.. మెతుకుసీమకు తొలి ప్యాసింజర్‌ రైలుబండి

23 Sep, 2022 10:57 IST|Sakshi

తీరనున్న మెదక్‌ ప్రాంతవాసుల దశాబ్దాల కల

దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి కృషి ఫలితం 

2012–2013 బడ్జెట్‌లో ఆమోదం

ప్రారంభానికి రానున్న కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

మెదక్‌జోన్‌: ఎన్నో దశాబ్దాలుగా రైలుకోసం ఎదురు చూస్తున్న మెతుకు సీమ ప్రజల కల ఎట్టకేలకు నెరవేరే సమయం ఆసన్నమైంది. శుక్రవారం రైలు ప్రారంభోత్సవానికి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరవుతున్నారు. దివంగత ఇందిరా గాంధీ ఎంపీగా మెదక్‌ నుంచి ప్రాతినిధ్యం వహించినప్పటినుంచే ఈ ప్రాంతానికి రైల్వే సౌకర్యం కల్పించాలన్న డిమాండ్‌ ఉంది. అందుకోసం చాలా కాలం ఉద్యమాలు కొనసాగాయి. 2012 –13లో కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం ఉండగా, రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉంది. అంతకు ముందు దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి చేసిన కృషి ఫలితంగా కాస్ట్‌ షేరింగ్‌ పద్ధతిలో రామాయంపేట మండలం అక్కన్నపేట నుంచి మెదక్‌ జిల్లా కేంద్రం వరకు కొత్త బ్రాడ్‌గేజ్‌ రైల్వేలైన్‌ మంజూరైంది.  

2014లో శంకుస్థాపన..  
మెదక్‌–అక్కన్నపేట రైల్వేలైన్‌ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో 17.2 కిలోమీటర్ల దూరం కొత్త రైల్వేలైన్‌ నిర్మాణానికి 2012–2013 సంవత్సరంలో రూ.117 కోట్లు అవసరమని అంచనా వేసి ఆమోదం తెలిపారు. 2014లో రైల్వేలైన్‌ నిర్మాణానికి అప్పటి ఎంపీ విజయశాంతి చేతులమీదుగా శంకుస్థాపన జరిగింది. ఆ తర్వాత పనుల ఆలస్యంతో అంచనా వ్యయం రూ.206 కోట్లకు చేరింది. ఇందులో రూ.103 కోట్లు రాష్ట్రం భరించగా, మిగతా నిధులు కేంద్రం విడుదల చేసింది.  

భూసేకరణకు రాష్ట్ర నిధులు  
రైల్వేలైన్‌ కోసం అవసరమయ్యే 392 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం సేకరించి రైతులకు రూ.16.80 కోట్ల పరిహారం అందజేసింది.  

రేక్‌పాయింట్‌తో రైతులకు మేలు..  
రెండు నెలల క్రితమే మెదక్‌కు రేక్‌పాయింట్‌ మంజూరు కాగా, మంత్రి హరీశ్‌రావు దానిని ప్రారంభించారు. రైతులు తాము పండించిన ఉత్పత్తులను దేశంలో ఎక్కడైనా తరలించుకోవడానికి ఈ పాయింట్‌ ఉపయుక్తంగా ఉంటుంది. అదే విధంగా వివిధ రాష్ట్రాల నుంచి ఎరువులు, ఇతర ఉత్పత్తులు కూడా దిగుమతి చేసుకోవచ్చు.  

మెదక్, కామారెడ్డి జిల్లాల ప్రజలకు సౌలభ్యం  
మెదక్‌ నుంచి రైళ్ల రాకపోకలతో మెదక్, కామారెడ్డి జిల్లాల ప్రజలకు లబ్ధి చేకూరనుంది. మెదక్, హవేళిఘనాపూర్, చిన్నశంకరంపేట, కొల్చారం మండలాలు, కామారెడ్డి జిల్లా లింగంపేట, నాగిరెడ్డిపేట, ఎల్లారెడ్డి మండలాల వారు ఈ సేవలు పొందొచ్చు.

కలనెరవేరింది... 
మెదక్‌ నుంచి ఇందిరాగాంధీ ఎంపీగా గెలుపొంది దేశ ప్రధానమంత్రి పదవి చేపట్టిన నాటి నుంచే ఇక్కడి ప్రజలు రైలు కోసం ఎదురుచూస్తున్నారు. సీఎం కేసీఆర్‌ చొరవ తీసుకుని రాష్ట్ర వాటాగా 50 శాతం నిధులు విడుదల చేయడంతోపాటు భూసేకరణ కూడా వేగవంతం చేసి పరిహారం చెల్లించారు. దీంతో పనులు త్వరగా పూర్తయ్యాయి.  ఎట్టకేలకు రైలు రాకతో ఈ ప్రాంత ప్రజల కల నెరవేరింది.  
:: పద్మాదేవేందర్‌రెడ్డి, మెదక్‌ ఎమ్మెల్యే

మూడు రైల్వేస్టేషన్లు..  
మెదక్‌– అక్కన్నపేట మధ్యలో కొత్తగా నిర్మించిన రైల్వేలైన్‌ దూరం 17.2 కిలోమీటర్లు. ఈ మధ్యలో మెదక్, శమ్నాపూర్, లక్ష్మాపూర్‌లలో కొత్తగా రైల్వేస్టేషన్లు నిర్మించారు. ప్రస్తుతానికి మెదక్‌ టు కాచిగూడ, మెదక్‌ టు మహబూబ్‌నగర్‌కు ఉదయం, సాయంత్రం వేళ రెండు రైళ్లు నడుపుతారు. ప్రయాణికుల రద్దీని బట్టి మరిన్ని రైళ్లు నడిపేందుకు ప్రయత్నిస్తామని దక్షిణమధ్య రైల్వే అధికారులు చెప్పారు.   

మరిన్ని వార్తలు