హెచ్‌సీయూకి ‘విదేశీ’ వెల్లువ 

11 Aug, 2020 13:08 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఒకవైపు కోవిడ్‌ పంజా విసురుతున్నప్పటికీ నగరంలోని సెంట్రల్‌ వర్సిటీకి విదేశీ విద్యార్థులు వెల్లువెత్తుతున్నారు. దేశంలోనే ప్రతిష్టాత్మక వర్సిటీగా వెలుగొందుతున్న ఈ విశ్వవిద్యాలయానికి 2020–21 విద్యాసంవత్సరానికిగాను పలు దేశాలకు చెందిన విద్యార్థినీ విద్యార్థులు వందలాదిగా దరఖాస్తు చేసుకుంటున్నట్లు వర్సిటీ వర్గాలు తెలిపాయి. గతేడాది కేవలం 203 దరఖాస్తులు విదేశాల నుంచి రాగా..ఈ సారి 258 ఇంటర్నేషనల్‌ విద్యార్థుల దరఖాస్తులందాయని పేర్కొన్నారు. అంటే గతేడాదితో పోలిస్తే విదేశీ విద్యార్థుల రాక 20 శాతం పెరిగిందన్నమాట. ఇక ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ కల్చరల్‌ రిలేషన్స్‌(ఐసీసీఆర్‌) నుంచి 175 దరఖాస్తులు రాగా..ఈ సారి 200 దరఖాస్తులందినట్లు తెలిపాయి. ఇక ఓవర్సీస్‌ సిటిజన్స్‌ ఆఫ్‌ ఇండియా కార్డు కలిగి, విదేశీ పాస్‌పోర్టు కలిగిన వారి నుంచి 38 దరఖాస్తులందడం విశేషం. గతేడాది ఓసీఐ కార్డు కలిగిన వారి నుంచి 30 దరఖాస్తులు అందినట్లు పేర్కొన్నాయి. ఇక వర్సిటీలో అత్యధిక డిమాండ్‌ కలిగిన ఇంటిగ్రేటెడ్‌ మాస్టర్స్‌ ప్రోగ్రామ్‌కు 18 విదేశీ విద్యార్థుల దరఖాస్తులందడం విశేషం.

వర్సిటీకి అందిన విదేశీ విద్యార్థుల  దరఖాస్తులు.. 
2019–20 విద్యాసంవత్సరం: 30 మంది డైరెక్ట్‌గా,మరో 175 దరఖాస్తులు ఐసీసీఆర్‌ సంస్థ ద్వారా విదేశీ విద్యార్థుల దరఖాస్తులందాయి. 
2020–21 విద్యాసంవత్సరం: 40 మంది డైరెక్ట్‌గా,మరో 200 ఐసీసీఆర్‌ ద్వారా,మరో 18 మంది ఇంటిగ్రేటెడ్‌ మాస్టర్‌ప్రోగ్రాంకు విదేశీ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడం విశేషం.

ఈ దేశాల నుంచే అత్యధికం.. 
బంగ్లాదేశ్, ఆఫ్గనిస్తాన్, సూడాన్, గాంబియా, మడగాస్కర్, దక్షిణాఫ్రికా, టాంజానియా, గుయానా తదితర దేశాల విద్యార్థులు సెంట్రల్‌ వర్సిటీలో చదువుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఆయా దేశాలతో మెరుగైన సాంస్కృతిక, ద్వైపాక్షిక సంబంధాలు నెలకొల్పేందుకు ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ కల్చరల్‌ రిలేషన్స్‌(ఐసిసిఆర్‌)సంస్థ ఆయా దేశాల విద్యార్థులకు ఇక్కడ చదువుకునే అవకాశం కల్పిస్తోంది. ఆర్థికంగా వెనుకబడిన   దేశాలకు చెందిన విద్యార్థులే పలు కోర్సులకు దరఖాస్తు చేసుకుంటున్నారు. విదేశీ విద్యార్థుల వెల్లువతో సెంట్రల్‌ వర్సిటీకి ఇన్సిట్యూట్‌ ఆఫ్‌ ఎమినెన్స్‌(ఐఓఈ)స్టేటస్‌ను కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ గతేడాది కేటాయించిందని వర్సిటీ వర్గాలు తెలిపాయి. ఐసీసీఆర్‌ సౌజన్యంతో మరింత మంది విదేశీ విద్యార్థులను ఆకర్షించేందుకు వర్సిటీ ప్రయత్నిస్తోందని వర్సిటీ వర్గాలు తెలిపాయి.

విదేశీ విద్యార్థులకు 15 శాతం కోటా.. 
నగరంలోని సెంట్రల్‌ వర్సిటీలో అంతర్జాతీయ స్థాయిలో డిమాండ్‌ కలిగిన పలు కోర్సుల్లో సుమారు 15 శాతం సీట్లను విదేశీ విద్యార్థులకు కేటాయిస్తున్నారు. విదేశీ విద్యార్థులను విశేషంగా ఆకర్షిస్తుండడంతో ఈవర్సిటీని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ ఇన్సిట్యూట్‌ ఆఫ్‌ ఎమినెన్స్‌(ఐఓఈ) హోదా కల్పించడం విశేషం. ఈ హోదా దక్కడంతో విదేశాలకు చెందిన పలువురు వృత్తి నిపుణులను వర్సిటీలో బోధన చేసేందుకు వీలుగా వారిని నియామకం చేసుకునే అధికారాన్ని వర్సిటీకి ప్రభుత్వం కేటాయించింది. విదేశాలకు చెందిన పలువురు విద్యావేత్తలతో గెస్ట్‌ఫ్యాకల్టీని ఏర్పాటు చేయడం, పలు స్వల్పకాలిక కోర్సులకు విదేశీ విద్యార్థులను ఆహ్వానించడం వంటి చర్యలకు సెంట్రల్‌ యూనివర్సిటీ శ్రీకారం చుడుతోందని వర్సిటీ వర్గాలు తెలిపాయి. విద్య,పరిశోధన తదితర అంశాల్లో సెంట్రల్‌ వర్సిటీతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకునేందుకు అంతర్జాతీయ స్థాయిలో పేరున్న పలు విద్యాసంస్థలు,కంపెనీలు,పరిశోధన సంస్థలు ముందుకొస్తున్నాయని పేర్కొన్నాయి.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా