విదేశాల్లో కూడా వనభోజన సంప్రదాయం..! ఐతే ఎలా ఉంటాయంటే..

19 Nov, 2023 12:30 IST|Sakshi

ఇది కార్తీకమాసం. శివకేశవుల ఆరాధనకు విశిష్టమైన మాసం. కార్తీకమాసంలో దీపారాధన చేయడం, దాన ధర్మాలు చేయడం ఆచారంగా కొనసాగుతోంది. కార్తీకమాసం అంటే ఆలయ దర్శనాలు, పూజలు, వ్రతాలు మాత్రమే కాకుండా వనభోజనాలు కూడా గుర్తుకొస్తాయి. మన దేశంలో కార్తీక వనభోజనాలు సంప్రదాయ ప్రకారం కొనసాగుతున్నట్లే, వివిధ దేశాల్లో వనభోజనాలు చేసే సంప్రదాయాలు ఉన్నాయి. వాటి గురించి కూడా కాస్త ముచ్చటించుకుందాం..

కార్తీకమాసంలో వనభోజనాలు చేయడం మనకు చిరకాలంగా కొనసాగుతున్న ఆచారం. శివకేశవులకు పవిత్రమైన ఈ మాసంలో ఉసిరి చెట్టు నీడలో వనభోజనాలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. యాగాలు, హోమాలు, పూజలు, వ్రతాలు, తర్పణాలు చేసేటప్పుడు జరిగిన లోపాల వల్ల సంభవించిన దోషాలను తొలగించుకోవడానికి తప్పనిసరిగా కార్తీకమాసంలో వనభోజనాలు చేసి తీరాలని ‘స్కాందపురాణం’ చెబుతోంది. ఈ పురాణం ప్రకారం కార్తీక వనభోజనాల కోసం ఎంపిక చేసుకునే వనంలో నానాజాతుల వృక్షాలు పుష్కలంగా ఉండాలి.

వాటిలో ఉసిరి చెట్టు తప్పనిసరిగా ఉండాలి. ఉసిరిచెట్టు కింద సాలగ్రామాన్ని ఉంచి శాస్త్రోక్తంగా పూజించి, పురోహితులకు యథాశక్తి దక్షిణ తాంబూలాలను సమర్పించుకోవాలి. వనంలోనే వంటలు చేసుకుని, పురోహితులతోను, బంధుమిత్రులతోను కలసి భోజనాలు చేయాలి. కార్తీకమాసంలో ఉసిరిచెట్టు నీడన సాలగ్రామాన్ని పూజించి, పురోహితులకు అన్నసంతర్పణ చేసి, వనభోజనాలు చేసి, కార్తీక మహాత్మ్యాన్ని విన్నవారికి సమస్త పాపాలు తొలగి, మరణానంతరం విష్ణులోక ప్రాప్తి కలుగుతుందని ‘కార్తీక పురాణం’ చెబుతోంది.

చరిత్రలో వనభోజనాలు
వన భోజనాలకు శతాబ్దాల చరిత్ర ఉంది. కార్తీక వనభోజనాల ప్రస్తావన స్కాంద, కార్తీక పురాణల్లో ఉంది. వ్యాసుడు రాసిన అష్టాదశ పురాణాల్లో స్కాంద పురాణం ఒకటి. స్కాందపురాణం ప్రాచీన తాళపత్ర ప్రతి 1898లో దొరికింది. ఇది క్రీస్తుశకం ఎనిమిదో శతాబ్ది నాటిదని పరిశోధకుల అంచనా. దీనిని బట్టి మన దేశంలో వనభోజనాల సంస్కృతి ఎనిమిదో శతాబ్దికి ముందు నుంచే ఉండేదని అర్థమవుతుంది. పలు ఇతర దేశాల్లో కూడా సంప్రదాయకమైన వనభోజనాల సంస్కృతి మధ్యయుగం నాటికే వ్యాప్తిలో ఉండేది. ఇంగ్లిష్‌లో వనభోజనాలకు ‘పిక్నిక్‌’ అనే పేరు ఉంది. ‘పెక్‌’ లేదా ‘పిక్‌’ అంటే ఏరడం, ‘నిక్‌’ అంటే స్వల్ప పరిమాణం అని అర్థం. ఇవి ఫ్రెంచ్‌ మాటలు. ‘పిక్‌’, ‘నిక్‌’ అనే ఈ రెండు మాటల కలయికతో ‘పిక్నిక్‌’ అనే మాట ఏర్పడింది.

ఇంగ్లిష్‌లో ఈ మాట పదహారో శతాబ్దంలో వాడుకలోకి వచ్చింది. పాశ్చాత్య దేశాల్లో సంపన్నులు తీరిక వేళల్లో బంధుమిత్రులతో కలసి ఊళ్లకు దగ్గర్లో ఉండే వనాలకు వెళ్లి, రోజంతా అక్కడే విందు వినోదాలతో కాలక్షేపం చేసేవారు. ఫ్రెంచ్‌ విప్లవం తర్వాత పద్దెనిమిదో శతాబ్ది నాటికి పిక్నిక్‌ సంస్కృతి పాశ్చాత్య దేశాల్లో బాగా వ్యాప్తి చెందింది. పాశ్చాత్య సాహిత్యంలో కూడా పిక్నిక్‌ల ప్రస్తావన కనిపిస్తుంది. ‘పిక్నిక్‌ భోజనం వంటి ఆహ్లాదకరమైన విషయాలు జీవితంలో చాలా తక్కువగా ఉంటాయి’ అని ప్రసిద్ధ ఇంగ్లిష్‌ రచయిత సోమర్‌సెట్‌ మామ్‌ అన్న మాటలు ఆనాటి పాశ్చాత్య ప్రపంచంలో పిక్నిక్‌ల ప్రశస్తిని తెలియజేస్తాయి. ఫ్రెంచ్‌ విప్లవకాలంలో ఫ్రాన్స్‌ నుంచి వచ్చి లండన్‌లో స్థిరపడిన సుమారు రెండువందల మంది సంపన్న ఫ్రెంచ్‌ యువకుల బృందం 1801లో లండన్‌లో ‘పిక్నిక్‌ సొసైటీ’ని నెలకొల్పింది.

‘పిక్నిక్‌ సొసైటీ’ నిర్వహించే వనభోజనాల్లో విందుతో పాటు వినోద కార్యక్రమాలు అట్టహాసంగా ఉండేవి. ఎలాంటి నటనానుభవం లేని అతిథులు సైతం ఈ పిక్నిక్‌ పార్టీల్లో నటీనటులుగా మారి నాటకాలు వేసేవారని ‘ది టైమ్స్‌’ దినపత్రిక అప్పట్లో ఒక కథనంలో పేర్కొంది. ఇరవయ్యో శతాబ్ది ప్రారంభం నాటికి ఆధునిక వాహనాలు విస్తృతంగా అందుబాటులోకి రావడంతో ప్రపంచవ్యాప్తంగా పిక్నిక్‌ సంస్కృతి మరింతగా విస్తరించింది. అయితే, పాశ్చాత్య ప్రపంచంలో పిక్నిక్‌లు వ్యాప్తిచెందడానికి శతాబ్దాల ముందు నుంచే చైనా, జపాన్‌ వంటి తూర్పు దేశాల్లో సంప్రదాయ వనభోజనాల సంస్కృతి ఉండేది. ప్రాక్‌ పాశ్చాత్య దేశాల్లో వనభోజనాల సంస్కృతీ సంప్రదాయాలు సంక్షిప్తంగా తెలుసుకుందాం.

క్లీన్‌ మండే: గ్రీస్‌
క్రైస్తవుల ఉపవాస దినాలైన ‘గ్రేట్‌ లెంట్‌’ తొలిరోజును ‘క్లీన్‌ మండే’ అంటారు. క్లీన్‌ మండే రోజున విందు వినోదాలతో గడుపుతారు. గ్రీస్‌లో క్లీన్‌ మండే రోజున ప్రజలు పార్కులు, తోటలు, చిట్టడవులు, సముద్ర తీరాల్లో గుమిగూడి పిక్నిక్‌లు జరుపుకొంటారు. పిక్నిక్‌ సందర్భంగా చిత్రవిచిత్రమైన రంగు రంగుల గాలిపటాలను ఎగురవేయడం గ్రీకు ప్రజల ఆనవాయితీ. పిక్నిక్‌ విందులో సంప్రదాయబద్ధంగా చేసే రొట్టెలు, ఆల్చిప్పలు, ఆక్టోపస్, పీతలు, రొయ్యలతో చేసిన వంటకాలను ఆరగిస్తారు. మధ్యాహ్నం విందు తర్వాత పిల్లలు, పెద్దలు గాలిపటాలను ఎగురవేస్తారు.

బెర్రీ పికింగ్‌: ఐస్‌లాండ్‌
ఐస్‌లాండ్‌లో వేసవి మాత్రమే పిక్నిక్‌లకు అనుకూలంగా ఉంటుంది. మిగిలిన కాలాలన్నీ ఆరుబయట నిత్యం మంచు కురుస్తూనే ఉంటుంది. ఐస్‌లాండ్‌లో జూన్‌ నుంచి సెప్టెంబర్‌ వరకు వేసవికాలం ఉంటుంది. ఆగస్టు రెండోవారం నుంచి సెప్టెంబర్‌ రెండోవారం వరకు బెర్రీపండ్లు విరగకాస్తాయి. చెట్ల మీదనే బాగా పండినవి ఎక్కడికక్కడ రాలిపడతాయి. ఆరుబయటి వాతావరణం ఎంతో ఆహ్లాదభరితంగా ఉంటుంది.

అందువల్ల ఐస్‌లాండ్‌ ప్రజలు బెర్రీలు విరగకాసే కాలంలో ‘బెర్రీ పికింగ్‌’ పేరుతో పిక్నిక్‌లు చేసుకుంటారు. పార్కులు, తోటలు, చిట్టడవుల్లో చేసుకునే ఈ పిక్నిక్‌లలో నేలరాలిన బెర్రీ పండ్లను ఏరుకోవడం పిల్లా పెద్దా అందరికీ ఒక కాలక్షేపం. బెర్రీ పికింగ్‌ పిక్నిక్‌ విందులో సంప్రదాయబద్ధంగా చేసే రొట్టెలు, మంటపై కాల్చిన గొర్రెమాంసం, కప్‌కేకుల్లాంటి సాఫ్ట్‌స్కోన్స్, సాల్మన్‌ చేపలు, చీజ్‌తో చేసిన వంటకాలను ఆరగిస్తారు.

తిండి పోటీలు: అమెరికా
అమెరికాలో నేషనల్‌ పిక్నిక్‌ డే ఏప్రిల్‌ 23న జరుపుకొంటారు. దేశంలో అప్పటి నుంచే పిక్నిక్‌ల హడావుడి మొదలవుతుంది. మే 27న జరుపుకొనే మెమోరియల్‌ డే మొదలుకొని నవంబర్‌ 11న జరుపుకొనే వెటరన్స్‌ డే వరకు అమెరికాలో పిక్నిక్‌ సీజన్‌గానే పరిగణిస్తారు. అమెరికా స్వాతంత్య్ర దినోత్సవమైన జూలై 4న ఎక్కువ మంది పిక్నిక్‌లు జరుపుకొంటారు.

దాదాపు ఆరునెలల పాటు కొనసాగే పిక్నిక్‌ సీజన్‌లో బంధు మిత్రుల బృందాలు మాత్రమే కాకుండా, కార్పొరేట్‌ సంస్థలు కూడా ఉద్యోగుల కోసం పిక్నిక్‌ పార్టీలు నిర్వహిస్తూ ఉంటాయి. ఎక్కువగా పార్కులు, తోటలు, సముద్ర తీరాల్లో బార్బెక్యూ పిక్నిక్‌ పార్టీలు చేసుకుంటారు. పలు పిక్నిక్‌లలో తిండి పోటీలు నిర్వహిస్తుంటారు. భారీ పరిమాణంలో వంటకాలను తక్కువ సమయంలో భోంచేయడంలో జరిగే ఈ పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి ఆకర్షణీయమైన బహుమతులు కూడా ఉంటాయి.

పిక్నిక్‌ డే: ఆస్ట్రేలియా
ఆస్ట్రేలియాలో ఆగస్టు మొదటి సోమవారాన్ని పిక్నిక్‌ డేగా పాటిస్తారు. వేర్వేరు చోట్ల నుంచి వచ్చి ఆస్ట్రేలియా గనుల్లో పనిచేసే గనికార్మికులు పంతొమ్మిదో శతాబ్దిలో ఇక్కడ పిక్నిక్‌ సంస్కృతిని ప్రారంభించారు. 1881లో బలారాట్‌ మైనర్స్‌ అసోసియేషన్‌ తొలిసారిగా అబ్బరీ బొటానికల్‌ పార్కులో వేలాదిమంది కార్మికులతో భారీ పిక్నిక్‌ నిర్వహించింది. ఆస్ట్రేలియాలో 1940ల నాటికి దేశవ్యాప్తంగా రైల్వేలైన్లు ఏర్పడటంతో ఆగస్టు మొదటి సోమవారాన్ని రైల్వే హెరిటేజ్‌ పిక్నిక్‌ డేగా పాటించడం ఆనవాయితీగా మారింది. ఆస్ట్రేలియన్లు పిక్నిక్‌లలో ఎక్కువగా వినోదానికి ప్రాధాన్యమిస్తారు. పిక్నిక్‌లలో నృత్య గానాలు, టగ్‌ ఆఫ్‌ వార్‌ వంటి వివిధ క్రీడల పోటీలు నిర్వహిస్తారు. 

పిక్నిక్‌ టీ: న్యూజిలాండ్‌
న్యూజిలాండ్‌లో పిక్నిక్‌ సంస్కృతి పంతొమ్మిదో శతాబ్దిలో బ్రిటిష్‌ పాలకుల ద్వారా మొదలైంది. దక్షిణార్ధ గోళంలో ఉన్న న్యూజిలాండ్‌లో నవంబర్‌ నుంచి వసంత రుతువు మొదలవుతుంది. వసంతకాలంలో ఇక్కడ ఆరుబయట పిక్నిక్‌లు జరుపుకొంటారు. న్యూజిలాండ్‌ సంప్రదాయ పిక్నిక్‌లలో టీ పార్టీలు ప్రత్యేకం. పిక్నిక్‌ల కోసం జనాలు ఉదయాన్నే తోటలు, చిట్టడవులు, సముద్రతీరాలు వంటి ఆరుబయటి ప్రదేశాలకు చేరుకుంటారు. ఆటపాటలతో కాలక్షేపం చేస్తారు. మధ్యాహ్నం సంప్రదాయకమైన రొట్టెలు, కాల్చిన మాంసాహార వంటకాలతో విందు భోజనాలు ఆరగిస్తారు. పొద్దుగూకడానికి ముందు స్కోన్స్, బిస్కట్లు వంటి చిరుతిళ్లతో టీ పార్టీ చేసుకుంటారు.

బాస్టీల్‌ డే రికార్డు
నవ సహస్రాబ్దిలో వచ్చిన తొలి బాస్టీల్‌ డే సందర్భంగా 2000 సంవత్సరంలో ఫ్రాన్స్‌లో అత్యంత భారీ పిక్నిక్‌ జరిగింది. ఈ పిక్నిక్‌ ఆరువందల మైళ్ల పొడవున డన్‌కిర్క్‌ నుంచి స్పెయిన్‌ సరిహద్దుల్లో ఉన్న ప్రాట్స్‌ డి మోలో వరకు 337 నగరాలు, పట్టణాల మీదుగా సాగింది. ఈ విందులో లక్షలాది మంది పాల్గొన్నారు. 

వెండితెర మీద పిక్నిక్‌
హాలీవుడ్‌ దర్శకుడు జోషువా లోగాన్‌ 1955 ‘పిక్నిక్‌’ సినిమాను తెరకెక్కించాడు. విలియమ్‌ హోల్డన్, కిమ్‌ నోవాక్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఆరు ఆస్కార్‌ నామినేషన్లు పొందింది. వాటిలో రెండు విభాగాల్లో ఆస్కార్‌ అవార్డులు పొందింది. ఫిల్మ్‌ ఎడిటింగ్, ఆర్ట్‌ డైరెక్షన్‌ విభాగాల్లో ‘పిక్నిక్‌’ సినిమా ఈ అవార్డులను దక్కించుకుంది. 

హనామీ: జపాన్‌
జపాన్‌లోని వనభోజనాలను ‘హనామీ’ అంటారు. మన కార్తీక వనభోజనాల వేడుకలను ఉసిరిచెట్లు ఉన్న వనాల్లో జరుపుకున్నట్లే జపాన్‌ ప్రజలు చెర్రీచెట్లు విస్తారంగా ఉన్న వనాల్లో వనభోజనాలు చేస్తారు. ఏటా చెర్రీ వృక్షాలు విరగబూసే కాలంలో గుంపులు గుంపులుగా చెర్రీ వనాలకు చేరుకుని, అక్కడ విందు వినోదాలతో ఘనంగా వనభోజనాలు చేస్తారు. జపాన్‌ దేశవ్యాప్తంగా మార్చి నుంచి మే వరకు చెర్రీపూత కాలం కొనసాగుతుంది.

ఒకినావా దీవిలో మాత్రం జనవరిలోనే చెర్రీపూత మొదలవుతుంది. జపాన్‌ వాతావరణ శాఖ ప్రతి ఏడాది చెర్రీపూత కాలం తేదీలను వెల్లడిస్తుంది. చెర్రీవృక్షాలకు పూలు పూయడం మొదలైతే, వాటి పూత ఒకటి రెండు వారాల వరకు మాత్రమే ఉంటుంది. పూత ఉన్న సమయంలోనే జనాలు విందు వినోదాలతో వనభోజన వేడుకలను జరుపుకొంటారు. విందులో సంప్రదాయ వంటకాలను ఆరగిస్తారు. జపాన్‌లో ఈ ‘హనామీ’ వనభోజనాల సంస్కృతి క్రీస్తుశకం ఎనిమిదో శతాబ్ది ప్రారంభం నుంచి కొనసాగుతోంది. ఇరవయ్యో శతాబ్ది ప్రారంభంలో ‘హనామీ’ సంస్కృతి అమెరికా, కెనడా దేశాలకూ వ్యాపించింది.

పిక్నిక్‌ డే: బ్రిటన్‌
బ్రిటన్‌లో ఏటా జూన్‌ 18న నేషనల్‌ పిక్నిక్‌ డేగాను, జూన్‌ 17 నుంచి 25 వరకు నేషనల్‌ పిక్నిక్‌ వీక్‌గాను పాటిస్తారు. జూన్‌ 18 ఇంటర్నేషనల్‌ పిక్నిక్‌ డే కూడా కావడం విశేషం. ఈ సీజన్‌లో దేశవ్యాప్తంగా జనాలు ఆరుబయట పిక్నిక్‌ పార్టీలు చేసుకుంటారు. బ్రిటన్‌లో పద్దెనిమిదో శతాబ్ది నుంచి పిక్నిక్‌ సంస్కృతి ఉంది. పురాతన డిపార్ట్‌మెంట్‌ స్టోర్‌ ‘ఫోర్ట్‌నమ్‌ అండ్‌ మేసన్‌’ అప్పట్లో ప్రవేశపెట్టిన ‘స్కాచ్‌ ఎగ్‌’ను పిక్నిక్‌ విందుల్లో ప్రత్యేక వంటకంగా వడ్డించేవారు. సాసేజ్‌లో చుట్టిన గుడ్డును నిప్పుల మీద కాల్చి తయారు చేసే ఈ వంటకం సంపన్నుల పిక్నిక్‌ విందులో తప్పనిసరిగా ఉండేది. చిట్టడవులు, పార్కులు, సముద్ర తీరాల్లో నిప్పుల మీద కాల్చిన మాంసపు వంటకాలను ఆరగిస్తూ పిక్నిక్‌ విందులు జరుపుకోవడం బ్రిటిష్‌ సంస్కృతిలో భాగంగా మారింది.

క్రిస్మస్‌ పిక్నిక్‌: అర్జెంటీనా
అర్జెంటీనా ప్రజలు ఏటా క్రిస్మస్‌ సీజన్‌లో పిక్నిక్‌లు జరుపుకొంటారు. మంచు కురిసే ఈ కాలంలో ఆరుబయట వనభోజనాలు చేయడానికి అర్జెంటీనా ప్రజలు ఆసక్తి చూపుతారు. అర్జెంటీనాలో ఏటా డిసెంబర్‌ 8 నుంచి క్రిస్మస్‌ సీజన్‌ మొదలవుతుంది. డిసెంబర్‌ 8న ‘ఇమ్మాక్యులేట్‌ కాన్సెప్షన్‌ డే’ జరుపుకొంటారు. ఆ రోజున మేరీమాత పాపవిమోచన పొందిందని కేథలిక్‌ల నమ్మకం. అర్జెంటీనాలో డిసెంబర్‌ 8న ప్రభుత్వ సెలవు దినం. దేశంలో పిక్నిక్‌ల సందడి కూడా అప్పటి నుంచే మొదలవుతుంది. కొందరు వనాల్లోను, తీరప్రాంతాల్లో ఉండేవారు సముద్ర తీరంలోను ఆరుబయట విందు వినోదాలతో పిక్నిక్‌లు చేసుకుంటారు. ఆరుబయట మంటలు వేసి, కోడి, టర్కీ, మేక, పంది వంటి వాటి మాంసాలను కాల్చుకుని, వాటితో విందు చేసుకుంటారు.

హెరింగ్‌ లంచ్‌: ఫిన్‌లాండ్‌
ఫిన్‌లాండ్‌లో వసంత రుతువు కాస్త ఆలస్యంగా మొదలవుతుంది. మేడే నుంచి దేశంలో పిక్నిక్‌ల హడావుడి మొదలవుతుంది. నిజానికి మేడే పిక్నిక్‌ల కోసం జనాలు ఏప్రిల్‌ 30 నుంచే హడావుడి ప్రారంభిస్తారు. ఊళ్లకు వెలుపల ఉండే చిట్టడవులు, పార్కులు, సముద్ర తీరాల్లో ఎక్కువగా పిక్నిక్‌లు చేసుకుంటారు. అట్టహాసంగా విందు వినోదాలతో జరిగే పిక్నిక్‌లలో సంప్రదాయబద్ధంగా వడ్డించే మధ్యాహ్న భోజనాన్ని ‘హెరింగ్‌ లంచ్‌’ అంటారు. ఉప్పుచేపలు, ఊరవేసిన చేపలు, బంగాళ దుంపలు, ఆరుబయట నిప్పుల మీద కాల్చిన మాంసాహార పదార్థాలతో విందు భోజనాలు చేస్తారు. వెండిరంగులో మెరిసే చిన్నచేపలను ‘హెరింగ్‌’ అంటారు. సంప్రదాయక ఫిన్నిష్‌ పిక్నిక్‌ విందులో హెరింగ్‌ చేపలు తప్పనిసరి.

పిక్నిక్‌ డే: ఫ్రాన్స్‌
ఫ్రాన్స్‌లో ఏటా జూలై 14న నేషనల్‌ పిక్నిడ్‌ డే జరుపుకొంటారు  ఈ రోజు ‘బాస్టీల్‌ డే’ అని కూడా అంటారు. ఆ రోజున పిక్నిక్‌ సందడి ఎక్కువగా కనిపిస్తుంది. ఫ్రాన్స్‌లో ఏటా వేసవి పిక్నిక్‌లు జరుపుకోవడానికి అనుకూలమైన కాలం. అందువల్ల వేసవి పొడవునా ఫ్రెంచ్‌ ప్రజలు సెలవు రోజుల్లోను, తీరిక వేళల్లోను ఆరుబయట పిక్నిక్‌లు చేసుకుంటారు. ఫ్రెంచ్‌ విప్లవానికి ముందు పిక్నిక్‌ సంస్కృతి కేవలం సంపన్నులకే పరిమితమై ఉండేది.

ఫ్రెంచ్‌ విప్లవం తర్వాత సామాన్యులకు సైతం ఇది పాకింది. సంప్రదాయ ఫ్రెంచ్‌ పిక్నిక్‌ విందుల్లో సంప్రదాయ వంటకాలతో పాటు మద్యానికి కూడా అమిత ప్రాధాన్యం ఉంటుంది. వైన్, షాంపేన్, బ్రాందీ వంటి మదిరానంద పానీయాలు లేకుండా ఫ్రెంచ్‌ ప్రజలు పిక్నిక్‌లు జరుపుకోరు. పిక్నిక్‌ విందుల్లో ఎక్కువగా రకరకాల చీజ్‌తో చేసిన వంటకాలు, కాల్చిన మాంసాహార వంటకాలను ఆరగిస్తారు. నృత్యగానాలలో ఓలలాడతారు. 

(చదవండి: ఘనాపాటీలు! అసామాన్యమైన కళతో మతాబుల్లా వెలిగిపోతున్న చిచ్చరపిడుగులు!)

మరిన్ని వార్తలు