గాంధీ వైద్యుల ‘ఆరు’దైన సర్జరీలు 

20 May, 2022 02:29 IST|Sakshi
సక్సెస్‌ మీట్‌లో వివరాలు వెల్లడిస్తున్న గాంధీ వైద్యులు, మోకాలి చిప్ప మార్పిడి సర్జరీ చేయించుకున్న రోగులు 

ఆరు గంటలు.. ఆరు మోకాలి చిప్ప మార్పిడి సర్జరీలు

గాంధీఆస్పత్రి: సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రి వైద్యులు అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. ఆరు గంటల వ్యవధిలో ఆరుగురు రోగులకు మోకాలిచిప్ప మార్పిడి శస్త్రచికిత్సలు విజయవంతంగా నిర్వహించి శభాష్‌ అనిపించుకున్నారు. ఆస్పత్రి సూపరింటెండెంట్‌ ప్రొఫెసర్‌ రాజారావు వివరాలు వెల్లడించారు. గాంధీ ఆర్థోపెడిక్‌ విభాగ ప్రొఫెసర్‌ వాల్యా నేతృత్వంలో ఈ నెల 18న ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు, బీహెచ్‌ఈఎల్‌ లింగంపల్లి, రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్, కర్నూలు జిల్లా కొత్తకోట, హైదరాబాద్‌ జిల్లా అంబర్‌పేట, సూర్యాపేట జిల్లాకు చెందిన నాగమునీంద్ర(63), నాగమణి (40), మంగమ్మ (55), రామాచారి (56), విజయలక్ష్మి (69), పున్నమ్మ (68)లకు మోకాలి చిప్ప మార్పిడి శస్త్రచికిత్సలు విజయవంతంగా నిర్వహించారు. వైద్య శాఖ మంత్రి హరీశ్‌రావు ఆదేశాల మేరకు గాంధీ ఆస్పత్రిలో పెద్దసంఖ్యలో మోకాలిచిప్ప మార్పిడి సర్జరీలు చేపట్టారు.

ఒకేరోజు ఆరు గంటల్లో ఆరు సర్జరీలు సక్సెస్‌ కావడం అరుదైన విషయమని డాక్టర్‌ రాజారావు అన్నారు. మోకాలిచిప్ప మార్పిడి సర్జరీలు ప్రైవేటు, కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో చేయించుకుంటే నాలుగు లక్షల నుంచి ఐదు లక్షలు ఖర్చు అయ్యేదని పేర్కొన్నారు. ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్‌భారత్‌ పథకాల ద్వారా వీటిని ఉచితంగా నిర్వహించామని వివరించారు. సర్జరీల్లో పాల్గొన్న వైద్యులకు డీఎంఈ, గాంధీ మెడికల్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌ రమేశ్‌రెడ్డి, గాంధీ సూపరింటెండెంట్‌ రాజారావు, డిప్యూటీలు నర్సింహరావునేత, శోభన్‌బాబు అభినందించారు.

మరిన్ని వార్తలు