Hyderabad: ‘మీ సేవ’లో దరఖాస్తు చేసుకున్నా.. జీహెచ్‌ఎంసీకి వెళ్లాల్సిందేనట..!

24 Nov, 2022 12:55 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మలక్‌పేట సర్కిల్‌లోని సైదాబాద్‌కు చెందిన ఓ బాలుడు పదో తరగతి చదువుతున్నాడు. రాబోయే మార్చిలో పబ్లిక్‌ పరీక్షలకు అతను హాజరు కావాల్సి ఉంది. స్కూల్‌ యాజమాన్యం ఇచ్చిన సంబంధిత ఫారమ్‌లో పూర్తి వివరాలు నింపి జత చేయాల్సిన సర్టిఫికెట్లు బడిలో సమర్పించాడు. విద్యార్థి బర్త్‌ సర్టిఫికెట్‌లో తల్లి పేరు ఫారమ్‌లో తప్పుగా పేర్కొనడంతో స్కూల్‌లో అభ్యంతరం వ్యక్తం చేశారు. బర్త్‌ సర్టిఫికెట్‌లో తల్లి పేరు సరిచేసుకొని సమర్పించాలని సూచించారు. బాలుడి తల్లిదండ్రులు జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో సంప్రదించగా, మీ–సేవ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సలహా ఇచ్చారు.

ఇంట్లో మరో సంతానం బర్త్‌ సరిఫికెట్‌లో తల్లిపేరు సరిగా ఉంటే సదరు బర్త్‌ సర్టిఫికెట్‌ జిరాక్స్‌ జతచేసి మీ–సేవ ద్వారా దరఖాస్తు చేసుకుంటే సరిచేస్తారని తెలిపారు. మీ–సేవలో ఇచ్చిన  డిక్లరేషన్‌ ఫారమ్‌లో ఇద్దరు గెజిటెడ్‌ అధికారుల సంతకాలు పెట్టించడంతో పాటు, నోటరీ, విద్యార్థి తల్లి ఆధార్, పాన్‌కార్డు, తమ్ముడి బర్త్‌ సర్టిఫికెట్‌ సైతం జత చేస్తూ మీ సేవ కేంద్రం ద్వారా జీహెచ్‌ఎంసీకి  దరఖాస్తు  చేశారు. వారం రోజులైనా  దరఖాస్తు పెండింగ్‌లో ఉన్నట్లు  మీ–సేవలో పేర్కొన్నారు. దరఖాస్తు పరిష్కారానికి ఏం చేయాలని అడిగితే..  మేం చేసేదేమీ లేదని, జీహెచ్‌ఎంసీ నుంచి ఫోన్‌ రాలేదా? ఆని ప్రశ్నించారు. రాలేదని తెలపగా తామేం చేయలేమన్నారు. 

తెలిసిన వారి ద్వారా  జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో  సంబంధిత ఉన్నతాధికారిని సంప్రదించగా.. ఆన్‌లైన్‌లో పరిశీలించి దరఖాస్తు రిజెక్ట్‌ అయినట్లు తెలిపారు. కనీసం రిజెక్ట్‌ అయిన విషయం కానీ.. ఎందుకు రిజెక్ట్‌ చేశారో కానీ మొబైల్‌కు  సమాచారం అందలేదు. సదరు ఉన్నతాధికారి సంబంధిత సర్కిల్‌ అధికారులను ఫోన్లో వివరణ కోరగా, దరఖాస్తుతో జత చేసిన జిరాక్స్‌ల ఒరిజినల్స్‌ కావాలని తెలిపారు. దాంతో విస్తుపోయిన అధికారి ఎందుకని ప్రశ్నిస్తే.. ఇటీవల కొందరు ఫోర్జరీ పత్రాలిస్తున్నందున.. తాము పరిశీలన కోసం ఒరిజినల్స్‌ కోరుతున్నామని తెలిపారు. కనీసం ఒరిజినల్స్‌ తేవాల్సిందిగా దరఖాస్తుదారుకు సమాచారం ఇచ్చారా అంటే లేదని చెప్పారు.  మరి వారికెలా తెలుస్తుంది..? అంటే సమాధానం లేదు. ఇలా ఉంది జీహెచ్‌ఎంసీ, మీ–సేవల పని తీరు. 
చదవండి: Banjara Hills: కళ్లల్లో కారంకొట్టి బ్యాగ్‌ లాక్కొని ఉడాయింపు.. ట్విస్ట్‌ ఏంటంటే!

స్కాన్‌ కాపీలు పంపినా..  
ప్రజలు  కార్యాలయాల చుట్టూ తిరగకుండా ఉండేందుకే ప్రభుత్వం అన్ని సర్వీసుల్ని ఆన్‌లైన్‌ ద్వారా అందిస్తోంది. అందులో భాగంగానే బర్త్‌ సర్టిఫికెట్ల కోసం.. సవరణల కోసం సైతం ఆన్‌లైన్‌ సేవలు అందుబాటులోకి తెచ్చింది.  అవసరమైన ఒరిజినల్‌ పత్రాలు  మీ సేవలో స్కాన్‌ చేసి, సంబంధిత కార్యాలయాలకు పంపుతారని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. ఒరిజినల్స్‌వే స్కాన్‌ చేసి ఆన్‌లైన్‌లో పంపినప్పుడు మళ్లీ ఒరిజినల్స్‌ కావాలనడం.. అది సైతం కనీసం సమాచారం తెలపకపోవడం వెనక మతలబేమిటన్నది అంతుచిక్కడం లేదు.  

పైసల కోసమే..  
జీహెచ్‌ఎంసీ వ్యవహారాలు  తెలిసిన వారు అది పైసల కోసమని చెబుతున్నారు. సర్టిఫికెట్ల అవసరం ఉన్నవారూ ఎలాగూ వారి పనికోసం నానా తంటాలు పడతారు. అలా తిరిగి తిరిగి తమ వద్దకే వస్తారు కాబట్టి.. అప్పుడు లేనిపోని కొర్రీలు పెట్టి.. ఇతరత్రా భయపెడతారని, అడిగినంత ఇచ్చుకుంటే మాత్రం పని చేస్తారని పేర్కొన్నారు. జనన, మరణ ధ్రువీకరణ పత్రాల జారీలో అవకతవకలు జరుగుతున్నాయని, అవినీతికి పాల్పడుతున్నారనే ఆన్‌లైన్‌ సేవలు అందుబాటులోకి తెచ్చారు. ప్రభుత్వం ఒక విధంగా అవినీతిని కట్టడి చేయాలనుకుంటే.. అవినీతికి  అలవాటు పడ్డవారు మరో విధంగా  ఇలా ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారు.  

తనిఖీలు లేకనే.. 
జీహెచ్‌ఎంసీ ఉన్నతాధికారులు సర్కిల్‌ కార్యాలయాలను కనీసం తనిఖీలు చేయకపోవడం.. ప్రజలకు ఎదురవుతున్న ఇబ్బందులను పట్టించుకోకపోవడంతో సర్కిళ్లు, జోనల్‌ కార్యాలయాల్లో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రజలు ఎన్ని సార్లు మొత్తుకున్నా వారికి చీమకుట్టినట్లయినా ఉండటం లేదు. ప్రజల ఈ ఇబ్బందులను  సంబంధిత ఉన్నతాధికారి దృష్టికి  తేగా, ఇకపై అలా జరగకుండా చూస్తామని మొక్కుబడి సమాధానమిచ్చారు. అంతేకాదు.. డబ్బులడిగినట్లు  లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తే విచారణ జరుపుతారట. జీహెచ్‌ఎంసీ సిబ్బందికి, మీ సేవ కేంద్రాల సిబ్బందికి మధ్య పరస్పర సంబంధాలున్నట్లు ఆరోపణలున్నాయి.  మీ సేవలో దరఖాస్తు చేసినప్పుడే.. పని పూర్తయ్యేందుకు జీహెచ్‌ఎంసీలో కలవాల్సిన వారి గురించి చెబుతారని సమాచారం. ఇదీ.. జీహెచ్‌ఎంసీ.. మీ సేవ తంతు.   

మరిన్ని వార్తలు