ఇక గంట గంటకూ పాతాళగంగ లెక్క

20 Nov, 2020 03:49 IST|Sakshi

అందుబాటులోకి డిజిటల్‌ వాటర్‌ లెవల్‌ రికార్డర్లు

రాష్ట్ర వ్యాప్తంగా 240 పైజోమీటర్లకు డీడబ్ల్యూఎల్‌ఆర్‌ల బిగింపు

ఆన్‌లైన్‌లోనే ఆయా ప్రాంతాల నీటిమట్టం తెలుసుకునే వీలు

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌ : ఒక ప్రాంతంలో భూగర్భ జలమట్టం లెక్కించాలంటే భూగర్భజల శాఖ అధికారులు స్వయంగా ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన పైజోమీటర్ల వద్దకు వెళ్లాల్సి ఉంటుంది. ప్రస్తుతం ప్రతి నెల 15వ తేదీ తర్వాత పైజోమీటర్ల వద్దకు వెళ్లి ఆ నెలలో నీటి మట్టం ఎంత పెరిగింది, ఎంత తగ్గిందనే వివరాలు రికార్డు చేస్తున్నారు. అయితే.. ఇకపై ఈ తిప్పలు తప్పను న్నాయి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కార్యాలయంలో కూర్చునే ఆయా ప్రాంతాల్లో భూగర్భజల మట్టం ఏ స్థాయిలో ఉందో తెలుసుకునే వెసులు బాటు అందుబాటులోకి వచ్చింది. ప్రభుత్వం పైజోమీటర్లకు డిజిటల్‌ వాటర్‌ లెవల్‌ రికార్డర్ల (డీడబ్ల్యూఎల్‌ఆర్‌)ను అందుబాటులోకి తెచ్చింది. దీంతో ప్రతి గంటకు ఏ స్థాయిలో నీటి మట్టం ఉందో కూడా తెలుసుకునే వీలు కలిగింది.

వెబ్‌సైట్‌తో అనుసంధానం :
పైజోమీటర్లకు బిగించే డబ్ల్యూఎల్‌ఆర్‌లను ప్రత్యేక వెబ్‌సైట్‌తో అనుసంధానిస్తున్నారు. దీంతో ఈ వెబ్‌సైట్‌ ద్వారా అవసరం ఉన్న ప్రాంతాల్లోని పైజోమీటర్‌కు సంబంధించిన భూగర్భ నీటి మట్టం వివరాలను ఎప్పటికప్పుడు పొందవచ్చు. వీటి పనితీరుపై ఆ శాఖలో క్షేత్ర స్థాయిలో పనిచేస్తున్న హైడ్రాల జిస్టులు, జియాలజిస్టులకు శిక్షణ ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు.

నేషనల్‌ హైడ్రాలజీ ప్రాజెక్టు
భూగర్భజల వనరులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నేషనల్‌ హైడ్రాలజీ ప్రాజెక్టును అమలు చేస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పైజోమీటర్లలో కట్టుదిట్టమైన రక్షణ ఉన్న వాటికి డీడబ్ల్యూఎల్‌ఆర్‌లను అమర్చుతోంది. తొలి విడతలో రాష్ట్ర వ్యాప్తంగా 240 పైజోమీటర్లకు ఈ రికార్డర్లను అమర్చారు. రెండో విడతలో పెద్ద సంఖ్యలో ఈ రికార్డర్లను మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం ఇప్పటికే అన్ని జిల్లాల నుంచి ప్రతిపాదనలు సైతం తీసుకున్నారు. ఒక్కో మండలానికి కనీసం రెండు చొప్పున రికార్డర్లను అమర్చాలని ప్రతిపాదనలు వెళ్లాయి.

బోర్ల ద్వారా నీటి వాడకం తెలిసిపోతుంది
డిజిటల్‌ వాటర్‌ లెవల్‌ రికార్డర్ల ద్వారా ఏఏ ప్రాంతాల్లో బోర్లు నడుస్తున్నాయనే సమాచారం సైతం అధికారులకు తెలిసిపోతుంది. ఈ సమాచారం అటు విద్యుత్‌శాఖకు కూడా ఉపయోగపడుతుంది. వారు విద్యుత్‌ సరఫరాను పర్యవేక్షించుకునేందుకు ఈ సమాచారం ఉపయుక్తంగా ఉంటుంది.

పథకం పేరు : నేషనల్‌ హైడ్రాలజీ ప్రాజెక్టు
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పైజోమీటర్లు : 966
డీడబ్ల్యూఎల్‌ఆర్‌లు అమర్చిన ఫీజోమీటర్లు : 240

 

మరిన్ని వార్తలు