పెట్రోల్‌ పోయించుకున్న కాసేపటికే రిపేర్‌.. పెట్రోల్‌లో ఏకంగా 90 శాతం నీరు? వాహనదారులు షాక్‌!

22 Dec, 2022 13:27 IST|Sakshi

శాయంపేట: పెట్రోల్‌లో నీరు చేరడంతో వాహనాలు మోరాయించాయి. ఒకటి కాదు.. రెండు కాదు.. మూడు వాహనాలు పెట్రోల్‌ పోసుకున్న అరగంటకే మోరాయించడంతో వాహనదారులు పెట్రోల్‌ బంక్‌ వద్దకు వచ్చి యజమానిని ప్రశ్నించారు. దీంతో బంక్‌ యజమాని వారిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ క్రమంలో అక్కడికి చేరుకున్న గ్రామస్తులు బాటిల్‌లో పెట్రోల్‌ పట్టగా నీరే అధిక శాతం కనిపించింది. ఈ ఘటన హనుమకొండ జిల్లా శాయంపేట మండలం గంగిరేణిగూడెం గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది.

వివరాలిలా ఉన్నాయి. గంగిరేణిగూడెంలోని పెట్రోల్‌ బంక్‌లో బుధవారం ఉదయం పోతు సునీల్, దొంగరి శ్రావణ్, ముక్కెర సురేష్‌ తమ ద్విచక్రవాహనాల్లో పెట్రోల్‌ పోయించుకున్నారు. కాసేపటికే వాహనాలు మోరాయించడంతో మెకానిక్‌ వద్దకు వెళ్లారు. కల్తీ పెట్రోల్‌ వల్ల వాహనాలు చెడిపోయాయని చెప్పడంతో పెట్రోల్‌ బంక్‌ వద్దకు చేరుకుని యజమాని శ్రీనివాస్‌ను ప్రశ్నించారు. దీంతో అతడు బుకాయిస్తూ వారిపై  ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇంతలో గ్రామస్తులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకొని సమస్య విని ఖాళీ వాటర్‌ బాటిల్‌లో పెట్రోల్‌ పోయించగా 90శాతం నీరు, 10శాతం మాత్రం పెట్రోల్‌ రావడంతో కంగుతిన్నారు.

దీంతో కల్తీ పెట్రోల్‌ విక్రయిస్తున్నారని బంక్‌ యజమానిపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బంక్‌ సీజ్‌ చేయాలని ఆందోళన చేపట్టారు. ఈ విషయమై బంక్‌ యజమాని శ్రీనివాస్‌ను ప్రశ్నించగా మంగళవారం సాయంత్రం కొత్త లోడు వచ్చిందని, ఉదయం నుంచి పెట్రోల్‌ అమ్మకాలు చేపడుతున్నామని, నీరు ఎలా సింక్‌ అయిందో తెలియదని తెలిపారు. పెట్రోల్‌ పోసుకున్న వారి వాహనాలు పాడైతే మర్మమ్మతు చేయించే బాధ్యత తనదేనని భరోసా ఇచ్చారు.
 

మరిన్ని వార్తలు