యాదన్నా.. ఓసారి నడువన్నా

4 May, 2022 01:41 IST|Sakshi
మోకాలు చిప్పలమార్పిడి ఆపరేషన్‌ చేయించుకున్న వాళ్లతో మంత్రి హరీశ్‌రావు, వైద్య సిబ్బంది 

తొలిసారిగా సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రిలో మోకాలి చిప్పల మార్పిడి చికిత్స

ఆపరేషన్లు చేయించుకున్నవారిని పలకరించిన మంత్రి హరీశ్‌

సాక్షి, సిద్దిపేట: ‘యదన్నా.. బాగున్నవా, మంచిగ నడుస్తున్నవా.. ఓసారి నడువన్నా’అంటూ మోకాలు చిప్పలమార్పిడి ఆపరేషన్‌ చేయించుకున్న పుల్లూర్‌వాసి దేశెట్టి యాదగిరిని రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్యశాఖల మంత్రి టి.హరీశ్‌రావు పలకరించారు. ఆయనను నడిపించి ఆత్మవిశ్వాసం నింపారు. ‘ఎలాంటి నొప్పి లేకుండా నడుస్తున్నా’అంటూ యాదగిరి ఆనందం వ్యక్తం చేశారు. గాంధీ, ఉస్మానియా ఆస్పత్రుల తర్వాత రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రిలో మోకాలు చిప్ప ఆపరేషన్లు నిర్వహించారు.

రెండు నెలల క్రితం సిద్దిపేట రూరల్‌ మండలం రాఘవాపూర్‌లో జరిగిన క్యాంప్‌లో 72 మందికి ఈ తరహా ఆపరేషన్‌ చేయాలని వైద్యులు నిర్ణయించారు. వీరిలో ముగ్గురికి ఇటీవల ఆపరేషన్లు చేశారు. ఈ నేపథ్యంలో మంత్రి హరీశ్‌రావు మంగళవారం యాదయ్యతోపాటు సిద్దిపేట పట్టణానికి చెందిన బాపన్న, మందపల్లికి చెందిన మరోవ్యక్తిని పరామర్శించారు. వారితో కాసేపు ఆత్మీయంగా ముచ్చటించిన అనంతరం మంత్రి మాట్లాడుతూ... ఈ మోకాలి చిప్పల మార్పిడి ఆపరేషన్లు త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రారంభిస్తామన్నారు.

డబ్బులు ఉన్నవాళ్లు మాత్రమే చేసుకునే ఈ సర్జరీని ఇప్పుడు పేదవాళ్లకు కూడా అందుబాటులోకి తెచ్చామని చెప్పారు. గతంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో 30 శాతం ప్రసవాలు జరిగితే, ఇప్పుడవి 56 శాతానికి పెరిగాయని వివరించారు. సీఎం కేసీఆర్‌ ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలు ఏర్పాటు చేయడం వల్లే సర్జరీలు సాధ్యం అవుతున్నాయని తెలిపారు. 

మరిన్ని వార్తలు