Rain Alert: తీవ్ర అల్పపీడన ప్రభావం.. మరో రెండ్రోజులు భారీ వర్షాలు

11 Sep, 2022 02:24 IST|Sakshi

వాయవ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడన ప్రభావం

ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా  విస్తారంగా వానలు

మెదక్‌ జిల్లా టేక్మాల్‌లో అత్యధికంగా 16.3 సెం.మీటర్లు..

జల దిగ్బంధమైన ఏడుపాయల వనదుర్గమ్మ ఆలయం

సాక్షి, హైదరాబాద్‌/సాక్షి నెట్‌వర్క్‌: రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి మెదక్, కరీంనగర్‌ జిల్లాల్లో పలుచోట్ల శనివారం భారీ వర్షాలు కురిశాయి. చాలాచోట్ల ఎనిమిది నుంచి పది సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలోనే అత్యధికంగా మెదక్‌ జిల్లా టేక్మాల్‌లో 16.3 సెంటీమీటర్ల కుండపోత వాన కురిసింది. దీంతో ఏడుపాయల వనదుర్గమ్మ ఆలయం జలదిగ్బంధమైంది. కాగా వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి తీవ్ర అల్పపీడనంగా మారిందని.. దాని ప్రభావంతో ఆది, సోమవారాలు కూడా రాష్ట్రవ్యాప్తంగా వానలు పడతాయని వాతావరణ శాఖ ప్రకటించింది. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని.. గంటకు 40 కిలోమీటర్ల వరకు వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది.

ముఖ్యంగా ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షాలు పడొచ్చని అంచనా వేసింది. ఇక నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ, యాదాద్రి భువనగిరి, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడవచ్చని తెలిపింది. ఈ రెండు రోజుల పాటు  అధికారులు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని సూచించింది. కాగా.. హనుమకొండ జిల్లా శాయంపేట మండలం పెద్దకోడెపా కకు చెందిన చందా రమ (47) పొలంలో పని చేస్తుండగా పిడుగుపడి మృతి చెందింది.

ఇదీ చదవండి: కదలని నేతలు అవుట్‌..  టీపీసీసీ ప్రక్షాళనపై హైకమాండ్‌ దృష్టి!

మరిన్ని వార్తలు