ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు?

11 Jun, 2021 13:34 IST|Sakshi

రిటైర్‌ అయినా బెనిఫిట్స్‌ రాలే! 

సీసీఎస్‌ మాజీ ఏసీపీ విజయ్‌కుమార్‌ ఆవేదన

కరోనా సోకి చికిత్స పొందుతున్న ఆపత్కాలంలోనూ అందని వైనం

సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వ ఉద్యోగులు పదవీ విరమణ చేసిన రోజే అన్ని బెనిఫిట్స్‌ తీసుకెళ్లొచ్చంటూ సాక్షాత్తు ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అయితే కొందరు ఉన్నతాధికారులు, సెక్షన్‌ ఇన్‌చార్జుల నిర్లక్ష్యం కారణంగా అది నెరవేరట్లేదు. ఫలితంగా పదవీ విరమణ చేసిన అధికారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనికి తాజా ఉదాహరణే రిటైర్డ్‌ ఏసీపీ కేఎన్‌ విజయ్‌కుమార్‌ పరిస్థితి.

సీసీఎస్‌లో ఏసీపీగా పనిచేసిన కేఎన్‌ విజయ్‌కుమార్‌ ఫిబ్రవరి 28న పదవీ విరమణ చేశారు. ఇప్పటికీ ఆయనకు రావాల్సిన బెనిఫిట్స్‌ దక్క లేదు. ఇటీవల ఆయన కరోనా బారినపడి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రి ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. మొదట కొద్ది రోజులు గచ్చిబౌలిలోని కార్పొరేట్‌ ఆస్ప త్రిలో చికిత్స పొందారు. ఆర్థిక కారణాలతో ఆస్పత్రి బిల్లులు చెల్లించలేక ప్రస్తుతం మరో ప్రైవేట్‌ ఆస్పత్రికి మార్చారు. ఎంతో సేవ చేసిన తన తండ్రిని పోలీస్‌ విభాగం గాలికి వదిలేసిందంటూ ఆయన కుమార్తె ఓ వీడియోలో ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

కాగా, విజయ్‌కుమార్‌ను ఫోన్‌లో ‘సాక్షి’పలకరించింది. ‘నాకు రావాల్సిన బెనిఫిట్స్‌ నేను దాచుకున్నవి. నా డబ్బు నాకు తిరిగి ఇవ్వడానికి ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? నా కష్టార్జితం నుంచి పొదుపు చేసుకున్న నగదు ఇప్పుడు చేతికి అందట్లేదు’ అని ఆవేదన వ్యక్తం చేశారు.  

చదవండి:
ఇందల్వాయి ఎస్‌ఐ శివప్రసారెడ్డిపై వేటు

మాస్కుతో ఇబ్బందులు.. పీల్చిన గాలే పీల్చి..!

మరిన్ని వార్తలు