అపసవ్యంగా కేంద్రం.. అండగా రాష్ట్రం

20 Apr, 2022 02:17 IST|Sakshi

వ్యవసాయ రంగంపై సమీక్షలో సీఎం కేసీఆర్‌

రైతాంగాన్ని నిరుత్సాహపరిచేలా కేంద్రం

తిరోగమన విధానాలు అవలంబిస్తోంది

ఎన్ని అడ్డంకులొచ్చినా వ్యవసాయ రంగాన్ని మరింత అభివృద్ధి చేస్తాం

లాభదాయక పంటల సాగుపై అధికారులు ప్రత్యేక ప్రణాళికలను తయారు చేయాలి

రైతులు పత్తి, మిర్చి, కంది పంటలు సాగు చేసేలా ప్రోత్సహించాలని సూచన

సాక్షి, హైదరాబాద్‌: వ్యవసాయమే ప్రధాన వృత్తిగా ఉన్న దేశంలో ఆ రంగాభివృద్ధికి పాటుపడాల్సిన కేంద్రం దాన్ని కుదేలు చేసే తిరోగమన విధానాలు అవలంబిస్తోందని సీఎం కేసీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ రైతాంగాన్ని నిరుత్సాహపరిచే చర్యలు చేపట్టడం, దేశంలో పంటల దిగుబడిని తగ్గించే అపసవ్య విధానాలను అమలు చేస్తుండటం బాధాకరమన్నారు. అయితే ఎన్ని అడ్డంకులు ఎదురైనా రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని మరింతగా అభివృద్ధి చేస్తుందని, తెలంగాణ రైతాంగ సంక్షేమం కోసం కార్యాచరణను పటిష్టంగా కొనసాగిస్తుందని పునరుద్ఘాటించారు.

ధాన్యం కొనుగోళ్లు, వానాకాలం సాగు ఏర్పాట్లపై ప్రగతి భవన్‌లో మంగళవారం సీఎం కేసీఆర్‌ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. లాభదాయక పంటల సాగుపై ప్రత్యేక ప్రణాళికలను సిద్ధం చేయాలని ఆదేశించారు. జిల్లా స్థాయి వ్యవసాయ అధికారులు క్రేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించాలని, వ్యవసాయ విస్తరణ అధికారులు (ఏఈఓ) ఎప్పటికప్పుడు రైతులకు సూచనలు ఇవ్వాలన్నారు. ఏఈఓలకు నిరంతరం శిక్షణా తరగతులు నిర్వహించాలని, వ్యవసాయ అధికారుల బాధ్యతలు, విధులపై జాబ్‌ చార్ట్‌ తయారు చేయాలన్నారు.

ఎరువుల విచ్చలవిడి వాడకాన్ని తగ్గించాలి..
ఎరువులు, పురుగుమందులను విపరీతంగా వాడటం వల్ల భూములు పాడవుతున్నాయని, మోతాదుకు మించి ఎరువులు వాడకుండా రైతుల్లో అవగాహన పెంచాలని సీఎం కేసీఆర్‌ సూచించారు. రైతులు ఎకరానికి ఒక యూరియా బస్తాను 3–4 విడతల్లో వేయాలని, డీఏపీ, కాంప్లెక్స్‌ ఎరువులను సైతం తగుపాళ్లలో వాడాలని కోరారు. యూరియా, డీఏపీ తదితర ఎరువుల నిల్వలు తగినన్ని ఉన్నాయని సీఎంకు అధికారులు నివేదిక అందించారు.

డీఏపీ పొదుపుగా...
డీఏపీ తయారీకి ముడిసరుకులు రష్యా, ఉక్రేయిన్‌ తదితర దేశాల నుంచే దిగుమతి చేసుకుంటున్నామని, యుద్ధం నేపథ్యంలో డీఏపీ లభ్యతపై ప్రభావం పడనుందని అధికారులు నివేదించారు. దీనిపై స్పందించిన సీఎం... డీఏపీని పొదుపుగా వాడుకొనేలా రైతులకు అవగాహన కల్పించాలని, భూసారాన్ని పెంచడానికి పచ్చిరొట్ట వాడాకాన్ని పెంచాలన్నారు.

పంటల మార్పిడికి పత్తి, మిర్చి, కంది మేలు...
వరిని విపరీతంగా సాగుచేస్తే భూసారం తగ్గే ప్రమాదం ఉందని అధికారులు సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకురాగా లాభదాయక పంటలను ఎంచుకొని పంటల మార్పిడి దిశగా రైతులను చైతన్యపరచాలని సీఎం అధికారులకు సూచించారు. చైనా తదితర దేశాల్లో పత్తి దిగుబడి తగ్గడంతో తెలంగాణ పత్తికి డిమాండ్‌ పెరుగుతోందన్నారు. క్వింటాల్‌ పత్తికి రూ. 10–13 వేల వరకు ధర వస్తుందని ఈ సమావేశంలో చర్చించారు.

పత్తికి గిరాకీ పెరగనుందని, పత్తి సాగును ప్రోత్సహించాలని సీఎం ఆదేశించారు. మిర్చికి కూడా ఊహించని రీతిలో క్వింటాల్‌కు రూ. 42 వేలకుపైగా ధర పలకడం గొప్ప విషయమన్నారు. కందికి కూడా మార్కెట్లో డిమాండ్‌ ఉందని, దీని సాగుపై వ్యవసాయ శాఖ నిర్లక్ష్యం వహించరాదన్నారు. పొద్దు తిరుగుడు పంట విస్తీర్ణాన్ని పెంచాలని సూచించారు. వరి సాగులో వెదజల్లుడు విధానాన్ని ప్రోత్సహిస్తే ఖర్చు తగ్గుతుందన్నారు. కల్తీ విత్తనాలను అరికట్టడానికి పోలీసు శాఖ సహకారం తీసుకోవాలని, ఫ్లయింగ్‌ స్క్వాడ్లను రంగంలోకి దించాలన్నారు.

ధాన్యం సేకరణపై సీఎం ఆరా...
రాష్ట్రవ్యాప్తంగా యాసంగి ధాన్యం సేకరణపై సీఎం కేసీఆర్‌ ఈ భేటీలో ఆరా తీశారు. గన్నీ బ్యాగులు, హమాలీలు, రవాణా వాహనాలు, నిల్వ కేంద్రాల వివరాలు చెప్పాలని అధికారులను అడిగారు. ఇందుకు సంబంధించిన వివరాలను మార్కెటింగ్‌ శాఖ కమిషనర్‌ అనిల్‌ కుమార్‌ సీఎంకు తెలియజేశారు. 6,983 కేంద్రాలకుగాను ఇప్పటికే 536 కేంద్రాలను ప్రారంభించామని, 32 కేంద్రాల నుంచి 1,200 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని సేకరించామని చెప్పారు.

కొందరు రైతులు ఎరువులు ఎక్కువేస్తే 
దిగుబడి పెరుగుతుందనుకుంటరు. కానీ ఏదైనా మితంగా వాడాల్సిందే. మనం అన్నం అంతా ఒకేసారి తింటమా? ఎరువులు కూడా అంతే. మోతాదుకు మించి తిండి తింటే మనకు రోగాలొచ్చినట్లే వరి పంటకూ మోతాదుకు మించి ఎరువులు చల్లితే ఏపుగా ఎదగాల్సిన పంట ఆగమైతది.

ఇక కరువే ఉండదు
రాష్ట్రంలో వ్యవసాయం గొప్పగా పురోగమి స్తోంది. రాష్ట్ర జీఎస్డీపీకి 21% దోహదపడు తోంది. కాళేశ్వరం ప్రాజెక్టు మరింతగా విస్తరిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులు ఏడాదిలో పూర్తవుతాయి. భవిష్యత్తులో రాష్ట్రంలో కరువే ఉండదు. సాగు అభివృద్ధికి తగ్గట్లు ఆ శాఖ నిరంతరం కార్యాచరణ ప్రణాళికలను చేపట్టాలి.

ఏటా 2 లక్షల కుటుంబాలకు దళితబంధు...
‘దళితబంధు కింద ఏటా 2 లక్షల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించడమే లక్ష్యంగా ముందుకు సాగాలి. అప్పుడు దళిత యువతలో నిరాశా నిస్పృహలు తొలగి ఉత్సాహం పెరుగుతుంది. వివిధ వృత్తులు, వ్యాపారాల్లో వారు భాగస్వాములు కావడం వల్ల ఉత్పాదక పెరుగుతుంది’అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈ పథకం కింద ఎంపికైన లబ్ధిదారులకు సత్వర లబ్ధి చేకూరేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రోజుకు 400 మంది చొప్పున ఇప్పటివరకు 25,000 మంది లబ్ధిదారులకు దళితబంధును అందించామని సీఎం కార్యదర్శి రాహుల్‌ బొజ్జా నివేదిక అందించారు.

పథకానికి ముందస్తుగానే నిధులు విడుదల చేసినందున అర్హులకు నిధుల మంజూరులో జాప్యం జరగరాదని సీఎం చెప్పారు. ఈ పథకం అమలుపై త్వరలో జిల్లా కలెక్టర్లతో సమావేశం నిర్వహిస్తామన్నారు. ‘దళితబంధుపై దేశం నలుమూలాల నుంచి ప్రశంసలు అందుకుంటున్నాం. దీని కింద ఖర్చు చేసే ప్రతి రూపాయి పెట్టుబడిగా మారి తిరిగి లాభాలను ఆర్జించి పెడుతుంది. సామాజిక పెట్టుబడిగా మారి వ్యవసాయ రంగం కంటే గొప్పగా స్కిల్‌ ఎకానమీకి దోహదపడుతుంది. దళితబంధు ద్వారా జరిగే వ్యాపార, వాణిజ్యాలు, తద్వారా తిరిగి వచ్చే లాభాలు రాష్ట్ర జీఎస్డీపీని పెంచడంలో దోహదపడుతాయి’అని సీఎం అన్నారు.

మరిన్ని వార్తలు