లగ్జరీ కార్ల కేసు: ట్యాక్స్‌ చెల్లించకుండా తిరుగుతున్న కార్లు ఇవే

17 Aug, 2021 20:58 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: లగ్జరీ కార్ల కేసుల్లో పోలీసుల విచారణ కొనసాగుతోంది. పన్ను చెల్లించకుండా తిరుగుతున్న లగ్జరీ కార్లపై అధికారులు కొరడా ఝుళిపిస్తున్నారు. తాజాగా ట్యాక్స్‌ చెల్లించకుండా తిరుగుతున్న లగ్జరీ కార్లను అధికారులు గుర్తించారు. అవి..
► కిషన్ లోహియా (హురాకన్ లంబోర్గిని)
►నిశాంత్ సాబు (హురాకన్‌ లంబోర్గిని)
►అమీర్‌శర్మ (ఫెరారీ 488)
►సికిందర్‌ దారేడియా (హురకిన్‌ లంబర్గిని)
►ముజీబ్‌ (రోల్స్ రాయిసి)
►నితిన్‌రెడ్డి (ఫెరారీ)
►రాహుల్ (ఫెరారీ)
►నిఖిల్ (ఫెరారీ)

చదవండి: హైదరాబాద్‌లో 11 హై ఎండ్‌ లగ్జరీకార్లు సీజ్‌, ఇదే తొలిసారి


కాగా పన్ను ఎగవేసి తిరుగుతున్న హై ఎండ్‌ లగ్జరీ కార్లపై ఆర్టీఏ కొరడా దాడులు నిర్వహించి స్వాధీనం చేసుకుంటున్న విషయం తెలిసిందే. డిప్యూటీ ట్రాన్స్‌పోర్టు కమిషనర్‌ కె.పాపారావు నేతృత్వంలో మోటారు వాహన తనిఖీ అధికారులు, సహాయ మోటారు వాహన తనిఖీ అధికారులతో ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందాలు నగరంలోని వివిధ ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించాయి. ఇతర రాష్ట్రాల్లో రిజిస్ట్రర్‌ అయిన ఈ లగ్జరీ కార్లు రవాణా శాఖకు జీవితకాల పన్ను చెల్లించకుండా హైదరాబాద్‌లో తిరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఆర్నెల్లుగా ఇలాంటి వాహనాలపై పక్కా నిఘా పెట్టి పథకం ప్రకారం దాడులు నిర్వహించి 11 కార్లను సీజ్‌ చేశారు.
చదవండి: పన్ను ఎగవేసి విదేశాల నుంచి లగ్జరీ కార్ల దిగుమతి

పట్టుబడితే 200 శాతం కట్టాల్సిందే..
సాధారణంగా ఇతర రాష్ట్రాల్లో నమోదైన బైక్‌లు, కార్లు, తదితర వాహనాలు కనీసం నెల రోజుల కంటే ఎక్కువ కాలం ఇక్కడ తిరిగితే తప్పనిసరిగా జీవితకాల పన్ను చెల్లించాల్సి ఉంటుంది. వాహనదారులు స్వచ్ఛందంగా ఈ పన్ను చెల్లించాలి. కానీ చాలా మంది వాహనదారులు తాము పొరుగు రాష్ట్రాల్లో చట్టబద్ధంగానే వాహనాలను నమోదు చేసుకున్నట్లు భావించి ఇక్కడ చెల్లించేందుకు నిరాకరిస్తున్నారు. అధికారులు దీనిని నిబంధనల ఉల్లంఘనగా పరిగణించి కేసులు నమోదు చేస్తున్నారు.

‘వాహనదారులే స్వచ్ఛందంగా పన్ను చెల్లిస్తే నిబంధనల మేరకు వసూలు చేస్తాం. ఆర్టీఏ దాడుల్లో పట్టుబడితే మాత్రం 200 శాతం వరకు పెనాల్టీల భారం పడుతుంది’ అని రవాణాశాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. మరోవైపు తాజా దాడుల్లో లభించిన సమాచారం ఆధారంగా హైఎండ్‌ లగ్జరీ వాహనాలపైన దాడులను మరింత ఉధృతం చేయనున్నట్లు డీటీసీ పాపారావు తెలిపారు. అవసరమైతే వాహనదారుల ఇళ్ల వద్దకు వెళ్లి తనిఖీలు నిర్వహిస్తామన్నారు.   

అయితే  హైదరాబాద్‌లో ఖరీదైన వాహనాల పైన 14 శాతం వరకు జీవితకాల పన్ను విధించారు. అంటే రూ.2 కోట్ల ఖరీదైన వాహనంపైన సుమారు రూ.70 లక్షల వరకు పన్ను కట్టాల్సివుంటుంది. ఈ పన్నును ఎగ్గొట్టేందుకే వాహనదారులు ఇతర రాష్ట్రాలకు పరుగులు తీస్తున్నారు. హర్యానా, ఢిల్లీ, పాండిచ్చేరి, తదితర చోట్ల కేవలం  రూ.30లక్షలలోపు జీవిత కాలపన్నుతో వాహనాలు నమోదు కావడంతో నగరవాసులను ఆ రాష్ట్రాలను ఎంపిక చేసుకుంటున్నారు.

మరిన్ని వార్తలు