విషాదం: మ్యాన్‌హోల్‌లో దిగి ఇద్దరు జీహెచ్ఎంసీ కార్మికులు మృతి

4 Aug, 2021 15:14 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గ్రేటర్‌ హైదరాబాద్‌లో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఎల్‌బీ నగర్‌ పరిధిలోని సాహెబ్‌ నగర్‌లో డ్రైనేజీ క్లీనింగ్‌ కోసం మ్యాన్ హోల్‌లోకి దిగిన ఇద్దరు జీహెచ్ఎంసీ పారిశుధ్య కార్మికులు ప్రాణాలు విడిచారు. వాస్తవానికి రాత్రిపూట డ్రైనేజీ క్లీన్‌ చేసేందుకు అనుమతి లేదు. కాంట్రాక్టర్‌ బలవంతం చేయడంతో నలుగురు మ్యాన్‌హోల్‌లోకి దిగారు. ఆ ఊబిలో శివ అనే వ్యక్తి చిక్కుకుపోయాడు.

అతన్ని కాపాడేందుకు వెళ్లిన అంతయ్య కూడా గల్లంతయ్యాడు. శివ మృతదేహాన్ని రెస్క్యూ టీం వెలికితీసింది. అనంతయ్య మృతదేహాం కోసం రాత్రి నుంచి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కాంట్రాక్టర్‌ నిర్లక్ష్యం కారణంగానే తమవారి ప్రాణాలు గాల్లో కలిశాయని మృతుల కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. బాధ్యులపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. 

మృతుల కుటుంబాలను ఆదుకుంటాం
ఈ ఘటనపై ఎల్బీ నగర్‌ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ.. రాత్రి సమయాల్లో డ్రైనేజి క్లీన్‌ చేసేందుకు అనుమతి లేదనే స్పష్టమైన నిబంధనలు జీహెచ్‌ఎంసీలో ఉన్నాయన్నారు. అయితే ఉదయం వేళల్లో వాటర్‌ ప్రవాహం ఎక్కువగా ఉంటుదని.. రాత్రి ప్రవాహం తక్కువ ఉంటుందనే ఉద్ధేశ్యంతోనే ఈ పనికి పూనుకున్నారని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం తరపున తప్పకుండా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.

సాహెబ్‌నగర్‌లో ఉద్రిక్తత
ఇదిలా ఉండగా వనస్థలిపురం సాహెబ్‌నగర్‌లో ఉద్రిక్తత నెలకొంది. అధికార టీఆర్‌ఎస్ పార్టీ, కాంగ్రెస్ నేతల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. జీహెచ్‌ఎంసీ కార్మికుల మృతికి అధికారుల నిర్లక్ష్యమే కారణమంటూ కాంగ్రెస్ నాయకులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో ఈ వివాదం రాజుకుంది.

మరిన్ని వార్తలు