హైదరాబాద్‌లో మరో 2 ఫ్లై ఓవర్లు

3 Jul, 2021 20:26 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: జూబ్లీహిల్స్‌ రోడ్‌నెంబర్‌ 45, దుర్గం చెరువు కేబుల్‌ బ్రిడ్జిల మీదుగా ఐటీ కారిడార్లలోకి ఈజీగా వెళ్తున్నవారికి.. తిరిగి వచ్చే సమయంలో రోడ్‌నెంబర్‌ 45, జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్ట్‌ల వద్ద వేగానికి కళ్లెం పడుతోంది. సిగ్నల్స్‌ వద్ద ఆగాల్సి వస్తోంది. అక్కడి వరకు రయ్యిమని ఎక్కడా ఆగకుండా దూసుకువచ్చిన వారికి.. రోడ్డు ఇరుకుగా మారడం, సిగ్నల్స్‌ పడటంతో ఎక్కువ సేపు ఆగాల్సి వస్తోంది.

ఈ పరిస్థితి నివారించేందుకు రోడ్‌ నెంబర్‌ 45 జంక్షన్‌ వద్ద, జూబ్లీచెక్‌పోస్ట్‌ జంక్షన్‌ వద్ద ఫ్లైఓవర్లు నిర్మించేందుకు జీహెచ్‌ఎంసీ అధికారులు సిద్ధమయ్యారు. ఎస్పార్‌డీపీ(వ్యూహాత్మక రహదారుల పథకం) లో భాగంగా వీటిని నిర్మించనున్నారు.  


ఇవీ ఫ్లై ఓవర్లు.. 

రోడ్‌నెంబర్‌ 45 జంక్షన్‌వద్ద 400 మీటర్ల పొడవైన ఫ్లై ఓవర్, అనంతరం కొంత దూరం వెళ్లాక మరో ఫ్లై ఓవర్‌ జూబ్లీచెక్‌పోస్ట్‌ సమీపంలో ప్రారంభం అవుతుంది. దాదాపు కిలోమీటరు పొడవుండే ఆ ఫ్లైఓవర్‌ మీదుగా ఎల్‌వీప్రసాద్‌ కంటి ఆస్పత్రి జంక్షన్‌ వరకు సాఫీగా సాగిపోవచ్చు.

ఒకే మార్గంలో, రెండు లేన్లుగా నిర్మించనున్న ఈ రెండు ఫ్లై ఓవర్ల అంచనా వ్యయం దాదాపు రూ.72 కోట్లు. వీటిల్లో రోడ్‌నెంబర్‌ 45 జంక్షన్‌ వద్ద ఫ్లై ఓవర్‌ను మొదటి వరుసలో నిర్మించనుండగా, జూబ్లీచెక్‌పోస్ట్‌ వద్ద ప్లై ఓవర్‌ను రెండో వరుసలో నిర్మించనున్నారు.  

మరిన్ని వార్తలు