హైడ్రోజన్‌తో స్వావలంబన దిశగా..

1 Mar, 2023 03:45 IST|Sakshi
పోస్టర్‌ ఆవిష్కరిస్తున్న డాక్టర్‌ సమీర్‌ దవే, డీఎంఆర్‌ పాండా, శ్రీనివాసరెడ్డి, నెట్టెం చౌదరి 

విస్తృత స్థాయిలో పరిశోధనలు 

సౌర, పవన విద్యుత్‌లతో గ్రీన్‌ హైడ్రోజన్‌ ఉత్పత్తికి ప్రయత్నాలు 

ఎన్టీపీసీ జనరల్‌ మేనేజర్‌ డీఎంఆర్‌ పాండా వెల్లడి 

ఐఐసీటీలో ఘనంగా నేషనల్‌ సైన్స్‌ డే ఉత్సవాలు 

సాక్షి, హైదరాబాద్‌: ఇంధన రంగంలో మన దేశం స్వావలంబన సాధించేందుకు హైడ్రోజన్‌ ఉపయోగపడుతుందని, ఈ దిశగా పరిశోధనలూ వేగంగా సాగుతున్నాయని నేషనల్‌ థర్మల్‌ పవర్‌ కార్పొరేషన్‌ (ఎన్టీపీసీ) హైడ్రోజన్‌ విభాగం జనరల్‌ మేనేజర్‌ డీఎంఆర్‌ పాండా వెల్లడించారు. జాతీయ సైన్స్‌ దినోత్సవాల్లో భాగంగా మంగళవారం ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీలో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో డీఎంఆర్‌ పాండా ‘గ్రీన్‌ హైడ్రోజన్‌ ఎమర్జింగ్‌ ట్రెండ్స్‌’’అన్న అంశంపై కీలకోపన్యాసం చేశారు.

ఎన్టీపీసీ ఆధ్వర్యంలో పర్యావరణ అనుకూలమైన విధానాల్లో హైడ్రోజన్‌ను వినియోగంలోకి తెచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయని తెలిపారు. ఇందులో భాగంగా లేహ్, ఢిల్లీల్లో హైడ్రోజన్‌ బస్సులు ఇప్పటికే నడుస్తుండగా, సౌర విద్యుత్‌ సాయంతో హైడ్రోజన్‌ ఉత్పత్తి, నిల్వలకు కూడా పైలెట్‌ ప్రాజెక్టులు నిర్వహిస్తున్నామని చెప్పారు. 

గత పదేళ్లలో హైడ్రోజన్‌ ధర పదిరెట్లు తగ్గింది.. 
దేశంలో సౌర, పవన విద్యుదుత్పత్తులకు అపార అవకాశాలున్నాయని, ఇలా ఉత్పత్తి అయిన విద్యుత్‌తో వేర్వేరు పద్ధతులను ఉపయోగించుకుని హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేయడం ద్వారా దేశం పెట్రో ఉత్పత్తుల దిగుమతులపై ఆధారపడాల్సిన అవసరం తప్పుతుందని పాండా వివరించారు. అలాగే కర్బన ఉద్గారాల తగ్గింపూ సాధ్యమవుతుందన్నారు.

ప్రస్తుతం హైడ్రోజన్‌ ఉత్పత్తి ఖర్చులు ఎక్కువైనప్పటికీ, ఐఐసీటీ, ఇతర విద్యా, పరిశోధన సంస్థల సహకారంతో దాన్ని తగ్గించి విస్తృత వినియోగంలోకి తేవచ్చునని ఆశాభావం వ్యక్తం చేశారు. గత పదేళ్లలో హైడ్రోజన్‌ ధర పదిరెట్లు తగ్గిందని గుర్తు చేశారు. ఎలక్ట్రలైజర్లు, ఒత్తిడిని తట్టుకోగల సిలిండర్లు, హైడ్రోజన్‌ను చిన్న చిన్న సిలిండర్లలోకి పంపేందుకు అవసరమైన కంప్రెషర్ల విషయంలో దేశం ఇప్పటికీ విదేశాలపైనే ఆధారపడుతోందని, ఫలితంగా ఈ ఇంధనాన్ని అందరికీ అందుబాటులోకి తేవడంలో ఆల­స్యం జరుగుతోందని చెప్పారు.

ఐఐసీటీ డైరెక్టర్‌ డాక్టర్‌ డి.శ్రీనివాస రెడ్డి, డాక్టర్‌ సమీర్‌ దవే, డాక్టర్‌ నెట్టెం వి.చౌదరి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతకుముందు ఎన్టీపీసీ చైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ గురుదీప్‌ సింగ్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడుతూ దేశంలో హైడ్రోజన్‌ ఉత్పత్తి, వినియోగంపై జరుగుతున్న ప్రయత్నాలను క్లుప్తంగా వివరించారు. 

ఆంధ్రప్రదేశ్‌లో హైడ్రోజన్‌ హబ్‌
దేశంలో హైడ్రోజన్‌ ఉత్పత్తి, వినియోగాలను పెంచే కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో హైడ్రోజన్‌ హబ్‌ ఒకదాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఎన్టీపీసీ జనరల్‌ మేనేజర్‌ (హైడ్రోజన్‌ విభాగం) డీఎంఆర్‌ పాండా తెలిపారు. విశాఖపట్నంలోని ఎన్టీపీసీ కేంద్రానికి దగ్గరగా ఈ హబ్‌ ఏర్పాటు కానుందని ఆయన విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు.

మొత్తం 1200 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటయ్యే హైడ్రోజన్‌ హబ్‌లో హైడ్రోజన్‌ ఉత్పత్తితోపాటు దానికి సంబంధించిన టెక్నాలజీలు, రవాణా వ్యవస్థలపై విస్తృతమైన పరిశోధనలు జరగనున్నాయని, సౌర శక్తి కోసం పెద్ద ఎత్తున సోలార్‌ ప్యానెల్స్‌ కూడా ఏర్పాటు చేస్తామని తెలిపారు.

ఈ హబ్‌ ఏర్పాటుకు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసిందని, అన్నీ సవ్యంగా సాగితే ఇంకో వారం రోజుల్లో ఎన్టీపీసీ, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాల మధ్య దీనిపై ఒక అవగాహన ఒప్పందం కూడా జరగనుందని వివరించారు. రానున్న పదేళ్లలో ఈ హబ్‌ ఏర్పాటుకు కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నట్లు పాండా తెలిపారు.  

‘వన్‌ వీక్‌.. వన్‌ ల్యాబ్‌’ ఈ నెల ఏడు నుంచి! 
కౌన్సిల్‌ ఫర్‌ సైంటిఫిక్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ రీసెర్చ్‌ (సీఎస్‌ఐఆర్‌) పరిశోధనశాలల కార్యకలాపాలను ప్రజలకు వివరించేందుకు ఉద్దేశించిన ‘వన్‌ వీక్‌.. వన్‌ ల్యాబ్‌’కార్యక్రమం ఈ నెల ఏడవ తేదీ నుంచి ప్రారంభం కానుందని ఐఐసీటీ డైరెక్టర్‌ డాక్టర్‌ డి.శ్రీనివాస రెడ్డి తెలిపారు. ఆరు రోజులపాటు జరిగే ఈ కార్యక్రమంలో భాగంగా ఐఐసీటీలో జరుగుతున్న పరి­శోధనలు, అభివృద్ధి చేసిన ఉత్పత్తులను ప్రదర్శించనున్నామని చెప్పారు. పరిశోధకులు, ఉపాధ్యా­యులు, పారిశ్రామికవేత్తలు, టెక్నాలజిస్టులు, స్టార్టప్‌లు, సాధారణ ప్రజలు ఎవరైనా ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చునని సూచించారు. 

మరిన్ని వార్తలు