సంపద పెరగాలంటే పరిశ్రమలు రావాలి

14 Sep, 2023 02:43 IST|Sakshi

మంత్రి కేటీఆర్‌ 

సంగారెడ్డి జిల్లాలో మొనిన్‌ పరిశ్రమకు శంకుస్థాపన 

సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు వచ్చినప్పుడు రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు సహకరించాలని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ పిలుపునిచ్చారు. రాజకీయా లు ఎన్నికలు వచ్చినప్పుడు చేసుకోవచ్చన్నారు. రాష్ట్రం బాగుపడాలన్నా, సంపద పెరగాలన్నా కొత్త పరిశ్రమలు రావాలన్నారు. పరిశ్రమలు పెడితే స్థానికులకు నష్టం జరుగుతుందని కొందరు రాజకీయం కోసం వదంతులు సృష్టిస్తున్నారని పేర్కొన్నారు.

అలాంటి అపోహలకు గురికాకుండా స్థానిక నాయకులు పరిశ్రమల స్థాపనకు పూర్తి సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఫ్రాన్స్‌కు చెందిన ప్రీమియం సిరప్‌ తయారీ కంపెనీ మొనిన్‌ రూ.300 కోట్ల పెట్టుబడితో సంగారెడ్డి జిల్లా గుంతపల్లిలో నిర్మించతలపెట్టిన ఫ్యాక్టరీకి బుధవారం ఆయన భూమి పూజ చేశారు.

ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో అమలవుతున్న ప్రగతిశీల విధానాలను చూసి వివిధ దేశాలకు చెందిన కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయన్నారు. మొనిన్‌ కంపెనీ యాజమాన్యం దేశంలో 18 రాష్ట్రాల్లో తిరిగిందని, చివరకు తెలంగాణలో యూనిట్‌ను స్థాపిస్తోందని చెప్పారు. స్థానిక యువత నైపుణ్యాలు పెంచుకుంటే ఈ కంపెనీల్లో మంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయని తెలిపారు. 

ధాన్యం ఉత్పత్తిలో మొదటి స్థానం..
రాష్ట్రం వ్యవసాయ రంగంలో గణనీయ వృద్ధిని సాధించిందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. రాష్ట్రంలో ధాన్యం ఉత్పత్తి 68 వేల మెట్రిక్‌ టన్నుల నుంచి మూడున్నర లక్షల టన్నులకు చేరి దేశంలో మొదటి స్థానంలో నిలిచిందన్నారు. పారిశ్రామిక రంగం కూడా అభివృద్ధి బాటలో కొనసాగుతోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ జయేశ్‌రంజన్, మొనిన్‌ సంస్థ చైర్మన్‌ ఓలివర్‌ మొనిన్‌ తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు