భారత్‌తో కయ్యం చైనా పన్నాగమే 

11 Sep, 2020 01:41 IST|Sakshi

పాక్, నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్‌కు డబ్బు ఎర.. ఆసియాలో డ్రాగన్‌ సూపర్‌ పవర్‌ కావాలనుకుంటోంది 

కెలాగ్‌ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ జోషువా ఐసన్‌మన్‌ 

సాక్షి, హైదరాబాద్‌: భారత్‌తో సరిహద్దుల వెంబడి ఉద్రిక్తతలు పెంచడం, పొరుగుదేశాలు భారత్‌పై ధిక్కారస్వరం వినిపించడం వెనక చైనా సుదీర్ఘ రాజకీయ ప్రయోజనాలు దాగున్నాయని కెలాగ్‌ ఇనిస్టిట్యూట్‌ ఫర్‌ ఇంటర్నేషనల్‌ స్టడీస్‌ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ జోషువా ఐసన్‌మన్‌ అన్నారు. ‘ఇండో ఫసిఫిక్‌ ప్రాంతంలో చైనా ప్రాబల్యం’అనే అంశంపై అమెరికా కాన్సులేట్‌ ఏర్పాటు చేసిన వెబినార్‌లో ఆయన ముఖ్య వక్తగా మాట్లాడారు. ఆసియాలో భారత్, చైనా రెండు బలమైన దేశాలని, ఈ రెండింటి మధ్య ఉద్రిక్తతలు పెరగడం చైనా పన్నాగమేనని ఆయన విశ్లేషించారు.

డ్రాగన్‌ విస్తరణ విధానం రోజురోజుకూ పెరుగుతోందని, తాజాగా భూటాన్‌ కూడా తమ భూభాగమే అంటూ కొత్త వాదన తెరపైకి తీసుకురావడం దీనికి నిదర్శనని చెప్పారు. భారత్‌పై ఒత్తిడి పెంచడంలో భాగంగానే నేపాల్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, శ్రీలంకలోకి డ్రాగన్‌ విపరీతంగా డబ్బు ప్రవహింపజేస్తోందని, వాటికి ఆర్థిక సాయం పేరుతో ఎర వేస్తోందని చెప్పారు. ఆయా దేశాల్లో ప్రాజెక్టులు చేపట్టడం వెనక చైనా భవిష్యత్‌ మిలటరీ అవసరాలు దాగున్నాయని అభిప్రాయపడ్డారు. పొరుగు దేశాల్లో పాకిస్థాన్‌ మినహా మరే దే శంతోనూ భారత్‌కు ఎలాంటి రాజకీయ విభేదాలూ లేవనే విషయాన్ని ఆయన గుర్తుచేశారు. అయితే, నేపాల్‌ అకస్మాత్తుగా భారత్‌పై వ్యతిరేకత ప్ర దర్శిస్తుండటం గమనించదగ్గ అంశమన్నారు. భారత్‌ పొరుగు దేశాలతో మి లటరీ సంబంధాల బలోపేతానికి చైనా అధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు.  

అలాగైతేనే చైనా దూకుడుకు ముకుతాడు.. 
మరోవైపు వాయవ్య ఆసియాలోనూ చైనా జోక్యం పెరుగుతోందని జోషువా అన్నారు. ఈ ప్రాంతాల్లోని దీవులపై చైనా సైన్యం ఆధిపత్యం చాటుకునేం దుకు తాపత్రయపడుతోందని వివరించారు. మొత్తానికి ఆసియా దేశాలన్నీ తనను సూపర్‌పవర్‌గా గుర్తించాలన్న తహతహ చైనాలో కనిపిస్తోందన్నారు. అలాగే కోవిడ్‌ తదనంతరం తలెత్తిన ఆర్థిక సమస్యల నేపథ్యంలో చైనా ప్రతిష్టాత్మక ప్రాజెక్టు బీఆర్‌ఐ (బెల్ట్‌ అండ్‌ అండ్‌ రోడ్‌ ఇనిషియేటివ్‌) ప్రాజెక్టుకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలున్నాయని అభిప్రాయపడ్డారు. చై నా దూకుడుకు ముకుతాడు వేసేందుకు అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా, భారత్‌ చేతులు కలపాల్సిన అవసరముందన్నారు.  

మరిన్ని వార్తలు