రెండు నెలలు పాదయాత్రలు చేయాలి

8 Jan, 2023 02:04 IST|Sakshi
గాంధీభవన్‌లో ఎస్టీ సెల్‌ సమావేశంలో మాట్లాడుతున్న మహేశ్‌కుమార్‌ గౌడ్‌ 

హాథ్‌ సే హాథ్‌ జోడో జూమ్‌ సమీక్షలో టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ 

ఎస్సీ, ఎస్టీలకు కాంగ్రెస్‌ అండ 

సాక్షి, హైదరాబాద్‌: ఈనెల 26 నుంచి జరగనున్న హాథ్‌ సే హాథ్‌ జోడో అభియాన్‌లో భాగంగా రెండు నెలల పాటు పార్టీ శ్రేణులు రాష్ట్రమంతటా పాదయాత్రలు నిర్వహించాలని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు బి. మహేశ్‌కుమార్‌గౌడ్‌ పిలుపునిచ్చా రు. హాథ్‌ సే హాథ్‌ జోడోతోపాటు ఈనెల 9న ఇందిరాపార్కు వద్ద నిర్వహించనున్న సర్పంచ్‌ల ధర్నాపై శనివారం గాంధీభవన్‌ నుంచి డీసీసీ అధ్యక్షులు, అనుబంధ విభాగాల చైర్మన్‌లతో ఆయన జూమ్‌ మీటింగ్‌ ద్వారా సమీక్షించారు.

ఈ సమీక్షలో భాగంగా మహేశ్‌గౌడ్‌ మాట్లాడుతూ.. రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్రను తెలంగాణలోని పల్లెపల్లెకు తీసుకెళ్లాలని కోరారు. ఈనెల 9న ఇందిరాపార్కు వద్ద నిర్వహించనున్న ధర్నాకు సర్పంచ్‌లు పెద్ద సంఖ్యలో హాజరయ్యేలా చూడాలని కోరారు. రాష్ట్రంలోని దళితులు, గిరిజనులకు కాంగ్రెస్‌ పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని బి.మహేశ్‌కుమార్‌గౌడ్‌ స్పష్టం చేశారు.

జగన్‌లాల్‌ నాయక్‌ అధ్యక్షతన జరిగిన టీపీసీసీ ఎస్టీ సెల్‌ సమావేశంలో మహేశ్‌కుమార్‌గౌడ్‌ మాట్లాడుతూ..బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతే లక్ష్యంగా ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేసిన ఘనత కాంగ్రెస్‌కే దక్కుతుందన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వాల హయాంలో ఆయా వర్గాలకు జరిగిన లబ్దిని వివరించడం ద్వారా రాష్ట్రంలోని దళిత, గిరిజన వర్గాల మద్దతును కాంగ్రెస్‌ పార్టీకి కూడగట్టాలని ఆయన కోరారు. సమావేశంలో టీపీసీసీ ఉపాధ్యక్షుడు రాములు నాయక్, మల్లు రవి, చామల కిరణ్‌కుమార్‌రెడ్డి పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు