విషాదం: పెళ్లి రోజును భార్యపిల్లలతో కలిసి..

26 Jan, 2021 09:56 IST|Sakshi

సాక్షి, నిజామాబాద్‌: పెళ్లి రోజును కుటుంబంతో కలిసి ఆనందంగా గడుపుదామని అనుకున్న యువకుడు అంతలోనే రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడ్డాడు. ఈ ఘటన డిచ్‌పల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని నడిపల్లి తండా సమీపంలో ఆదివారం రాత్రి జరిగింది. డిచ్‌పల్లి ఎస్సై సురేశ్‌కుమార్, మృతుడి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. కమ్మర్‌పల్లి మండలం నాగపూర్‌ గ్రామానికి చెందిన గడ్డం రాజేశ్వర్‌ (31)కు భార్య లతాశ్రీ, ఐదేళ్ల కొడుకు ఉన్నారు. ఇటీవల కొనుగోలు చేసిన పంట కోత మిషన్‌ ద్వారా కర్నాటక రాష్ట్రం బళ్లారి ప్రాంతంలో పంట కోతలు నిర్వహిస్తున్నాడు. సోమవారం తన వివాహ వార్షికోత్సవం కావడంతో భార్యా పిల్లలతో గడిపేందుకు ఆదివారం తెల్లవారుజామునే తన బైక్‌పై (నంబర్‌ టీఎస్‌ 16 ఈబీ 7972) బయలుదేరాడు.

రాత్రికి కామారెడ్డిలో భోజనం చేసి భార్యా పిల్లల కోసం బిర్యాని, స్వీట్లు పార్శిల్‌ చేయించుకుని బయలుదేరాడు. 44వ నంబరు జాతీయ రహదారిపై నడిపల్లి తండా సమీపంలో  బైక్‌ అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న ఇనుప గ్రిల్స్‌పై పడిపోవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం  అందుకున్న డిచ్‌పల్లి ఎస్సై తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని మృతుని కుటుంబ సభ్యులకు విషయం తెలియజేశారు. మృతదేహానికి పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మరికొద్ది సేపట్లో భర్త ఇంటికి వస్తాడని ఆనందంతో ఎదురు చూస్తున్న భార్య  దుఃఖంలో మునిగిపోయింది. అందరితో కలిసి మెలిసి ఉండే రాజేశ్వర్‌ మృతి చెందినట్లు తెలియడంతో  సోమవారం నాగాపూర్‌లో విషాదం నెలకొంది. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు