అత్తా కోడళ్ల పంచాయితీ: ఇంట్లోకి రానివ్వకపోవడంతో..

29 Mar, 2021 10:17 IST|Sakshi

సాక్షి, చిలకలగూడ: ఇంట్లోకి తమను రానివ్వాలంటూ ఓవ్యక్తి కుంటుంబంతో కలిసి తన తల్లి ఇంటి ఎదుట నిరాహార దీక్ష చేసిన ఘటన చిలకలగూడ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. శ్రీనివాసనగర్‌ కాలనీకి చెందిన కింజర్ల సాయికుమార్‌ యాదవ్, భార్గవిలకు 2009లో వివాహం అయింది. ప్రస్తుతం వీరికి నలుగురు పిల్లలున్నారు. కట్నం డబ్బులతో ఇంటి భవనం మొదటి అంతస్తుపై సాయికుమార్‌యాదవ్‌ ఓ గదిని నిర్మించుకుని అందులో ఉంటున్నారు. సాయికుమార్‌ తల్లి భారతమ్మ, భార్య భార్గవి మధ్య గొడవ మొదలైంది. కోడలు తనపై దాడి చేసిందని గతంలోనే భారతమ్మ చిలకలగూడ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అప్పటి నుంచి సాయికుమార్, భార్గవి కుటుంబం వేరే అద్దె ఇంట్లో ఉంటున్నారు. సాయికుమార్‌యాదవ్‌ ఆటో డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు.

గతేడాది లాక్‌డౌన్‌ వల్ల ఆటోకు సరైన గిరాకీ లేక ఇంటి అద్దె, కుటుంబ పోషణ భారమైంది. దీంతో శనివారం సాయంత్రం సాయికుమార్‌యాదవ్‌ భార్యా పిల్లలతో కలిసి తల్లి భారతమ్మ ఇంటికి వచ్చారు. తాను ఇంటిపైన నిర్మించుకున్న గదిని తమకు ఇవ్వాలని తల్లిని కోరాడు. దీనికి భారతమ్మ నిరాకరించింది. దీంతో శనివారం రాత్రి నుంచి ఇంటి ముందు సాయికుమార్‌ కుటుంబంతో కలిసి నిరాహార దీక్ష చేపట్టారు. తమను ఇంట్లోకి రానివ్వకపోతే భార్య, పిల్లలతో కలిసి అత్మహత్య చేసుకుంటానని సాయికుమార్‌యాదవ్‌ తెలిపాడు.. ఆదివారం సాయికుమార్‌ కుటుంబానికి శ్రీనివాసనగర్‌ కాలనీవాసులు వేములవాడ మహాత్మాచారి, భరత్, బీజేపీ నాయకులు మేకల హర్షకిరణ్, ముషీరాబాద్‌ యాదవ సంక్షేమ సంఘం అధ్యక్షుడు అమరేందర్‌ యాదవ్, మధుయాదవ్‌ అండగా నిలిచారు.  

చదవండి:మానవత్వం మిస్సింగ్‌.. అంతిమ సంస్కారానికి అంత్యక్రియలు!

మరిన్ని వార్తలు