ఆడబిడ్డల ఆరోగ్యానికి ‘రుతు ప్రేమ’

7 Apr, 2022 02:18 IST|Sakshi
సదస్సులో మాట్లాడుతున్న మంత్రి హరీశ్‌రావు 

సిద్దిపేట మున్సిపాలిటీలో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం

రసాయనిక శానిటరీ ప్యాడ్స్‌కు బదులు శానిటరీ కప్స్, క్లాత్‌ ప్యాడ్స్‌ వాడాలని ప్రచారం

క్లాత్‌ ప్యాడ్స్‌ వాడకంలో దేశానికి సిద్దిపేట ఆదర్శం కావాలి: మంత్రి హరీశ్‌రావు

మహిళలు, బాలికలకు శానిటరీ కప్స్‌ ఉచితంగా పంపిణీ

సాక్షి, సిద్దిపేట: మహిళల ఆరోగ్యం కోసం సరికొత్త కార్యక్రమానికి సిద్దిపేట మున్సిపాలిటీ శ్రీకారం చుట్టింది. రుతుస్రావం సమయంలో మహిళలు రసాయనిక శానిటరీ ప్యాడ్స్‌కు బదులు శానిటరీ కప్స్, క్లాత్‌ ప్యాడ్స్‌ వాడేలా అవగాహన కల్పించేందుకు ‘రుతు ప్రేమ’ పేరుతో కార్య క్రమాన్ని బుధవారం మొదలుపెట్టింది. కార్యక్రమంలో భాగంగా మున్సిపాలిటీలోని 5వ వార్డులో మహిళలు, బాలి కలకు రుతుస్రావ, రుతు ప్రేమ అవగాహన సదస్సు నిర్వ హించారు.

శానిటరీ కప్స్, క్లాత్‌ ప్యాడ్‌లు, పిల్లలకు బట్ట డైప ర్‌లను ఉచితంగా పంపిణీ చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి హరీశ్‌రావు హాజరై మాట్లాడుతూ.. ‘మహిళల  ఆరోగ్యం, డబ్బు ఆదా, పర్యావరణ పరిరక్షణ కోసం సరికొత్త కార్యక్రమం చేపట్టిన సుదినం ఇది. సిద్దిపేటలో మొదలైన రుతు ప్రేమ ఇక్కడితో ఆగొద్దు. జిల్లా, రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలి. దేశానికి మనం ఆదర్శంగా ఉండాలి’ అని పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా 35 కోట్ల మంది మహిళలు రసాయనిక శానిటరీ ప్యాడ్స్‌ వాడుతున్నట్టు సర్వేలో తేలిందని మంత్రి చెప్పారు. వీటి వల్ల అనారోగ్య సమస్యలు వస్తున్నాయని వైద్యులు చెబుతున్నారన్నారు. క్లాత్‌ ప్యాడ్స్‌ వాడకంలో దేశానికి, ప్రపంచానికి సిద్దిపేట మార్గదర్శకం కావాలని ఆకాంక్షించారు. 

ఎక్కువ సిజేరియన్‌లు తెలంగాణలోనే
‘దేశంలో సిజేరియన్‌ డెలివరీలు తెలంగాణలోనే ఎక్కువగా జరుగుతున్నాయి. కర్ణాటకలో 24 శాతం, మహారాష్ట్రలో 28 శాతం ఉండగా రాష్ట్రంలో 62 శాతం జరుగుతున్నాయి. సిజే రియన్ల సంఖ్య తగ్గేందుకు తల్లిదండ్రులు సహకరించాలి’ అని మంత్రి హరీశ్‌ కోరారు. సీ సెక్షన్లు చేయడం వల్ల పుట్టిన బిడ్డ మొదటి గంటలో ముర్రుపాలు తాగట్లేదన్నారు. రాష్ట్రం లో పుట్టిన బిడ్డల్లో 37% మందే తల్లి పాలు తాగుతు న్నారని చెప్పారు. ‘మొదటి గంటలో బిడ్డకు ఇచ్చే పాలు రూ. కోట్లు పెట్టినా ఇవ్వలేరు. అవి అమృతంతో సమానం. రోగని రోధ క శక్తి పెరుగుతుంది’ అని వివరించారు.  కార్యక్రమంలో సీపీ శ్వేత, అడిషనల్‌ కలెక్టర్‌ మూజామిల్‌ ఖాన్‌ పాల్గొన్నారు.

ఒక్కో శానిటరీ కప్‌ను పదేళ్లు వాడుకోవచ్చు
రసాయనిక శానిటరీ ప్యాడ్‌లను మహిళలు వాడటం వల్ల సైడ్‌ ఎఫెక్ట్స్, చర్మ సంబంధిత సమస్యలు వస్తాయి. సిలికాన్‌ శానిటరీ కప్స్, క్లాత్‌ ప్యాడ్‌లను వాడితే సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఉండవు. శానిటరీ కప్స్‌ను వాడితే ఆందోళన లేకుండా సాఫీగా తమ పనులు తాము చేసుకునే అవకాశం ఉంటుంది. వీటి ధర రూ.500 నుంచి రూ.1,500 వరకు ఉం టుంది. ప్రతిసారి వాష్‌ చేసుకుని ఒక్కో కప్పు పదేళ్ల వరకు వాడుకోవచ్చు. ఇటు డబ్బులు ఆదా.. పైగా ఆరోగ్యం.
– డాక్టర్‌ తుమ్మల శాంతి, బెంగళూరు ప్రతినిధి 

శానిటరీ కప్స్‌ వాడండి
రుతుక్రమం సమయంలో బయట లభించే టిష్యూ ప్యాడ్‌లను వాడటం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి. శానిటరీ కప్స్‌ వాడితే సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఉండవు. వీటిని వాడటం చాలా మంచిది. వీటి గురించి టీవీలు, యూట్యూబ్‌లో ప్రచారం చేయాలి.     
– డాక్టర్‌ రమాదేవి, ప్రముఖ గైనకాలజిస్ట్‌ 

మరిన్ని వార్తలు