విద్యార్థుల నైపుణ్యాభివృద్ధికి ‘గెట్‌ సెట్‌ గో’

20 Nov, 2020 21:00 IST|Sakshi

ఎన్‌హెచ్‌ఆర్‌డీ హైదరాబాద్‌ ఓ వినూత్న కార్యక్రమం

సాక్షి,హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు ఉద్యోగార్హత సాధించేలా నైపుణ్యాలను మెరుగుపర్చేందుకు నేషనల్‌ హెచ్‌ఆర్‌డీ నెట్‌వర్క్‌ (ఎన్‌హెచ్‌ఆర్‌డీ) హైదరాబాద్‌ ఓ వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించింది. శ్రీని ఉడుముల  నాయకత్వంలో చాప్టర్‌ మేనేజ్‌మెంట్‌లో తాజా ధోరణులపై ఫ్యాకల్టీకి అవగాహన కల్పించడం, పరిశ్రమలతో సమన్వయం కలిగించడం ద్వారా విద్యాసంస్థలను బలోపేతం చేయడానికి ప్రణాళికలను సిద్ధం చేసింది. రెజ్యూమ్‌ తీర్చిదిద్దడం, ఇంటర్న్‌షిప్‌కు అందుబాటులో ఉండటం,  ఇంటర్వ్యూలకు సిద్ధమయ్యే విద్యార్థులకు తగిన సహాయం అవసరమయ్యే నేపథ్యంలో ‘గెట్‌ సెట్‌గో-మెంటార్‌@క్యాంపస్’‌ ద్వారా పరిష్కరించే ప్రయత్నాన్ని ఎన్‌హెచ్‌ఆర్‌డీ చేస్తోంది.

సుప్రసిద్ధ సంస్థలలో నాయకత్వ బాధ్యతలతో  కార్యకలాపాలు నిర్వహిస్తున్న దాదాపు 100 ప్రాక్టీసింగ్‌ నిపుణులు.. ఎంపిక చేసిన ప్రీమియర్‌ బీ– స్కూల్‌ విద్యార్థులతో నేరుగా గానీ, వర్చువల్‌గానీ సంభాషిస్తూ మార్గనిర్దేశనం చేయనున్నారు. బీ–స్కూల్స్‌లో లెర్నింగ్‌ సర్కిల్స్‌ లేదా క్లబ్స్‌ ఏర్పాటు చేయడంతో పాటు.. ఈ క్లబ్స్‌ను విద్యార్థులే  నిర్వహించేలా తీర్చిదిద్దాలని ఎన్‌హెచ్‌ఆర్‌డీ భావిస్తోంది. 

ఈ సందర్భంగా ఎన్‌హెచ్‌ఆర్‌డీ హైదరాబాద్‌ క్యాంపస్‌ కనెక్ట్‌ అండ్‌ అకడమిక్‌ బోర్డు ఛైర్‌ సూరంపూడి శ్రీకాంత్‌ మాట్లాడుతూ పరిశ్రమలు, విద్యాసంస్థల మధ్య బలమైన బంధాన్ని ‘‘గెట్‌-సెట్‌-గో’ ఏర్పరచగలదని నమ్ముతున్నామని తెలిపారు. అత్యంత క్లిష్టమైన, జీవితాన్ని మార్చే నైపుణ్యాలను విద్యార్థులు సాధించేందుకు , సమకాలీన అంశాలపై పరిశోధనలను చేసేలా ఫ్యాకల్టీని ఉత్సాహపర్చడానికి సహాయపడుతుందని పేర్కొన్నారు. యుక్త వయస్సులో ఉన్నప్పుడే వారిని ఒడిసిపట్టుకోవాలనేది తమ విధానం అని, రేపటి పరిశ్రమ నిపుణులుగా నిలిచే విద్యార్థులను తీర్చిదిద్దడం కర్తవ్యంగా భావిస్తున్నామని ఆయన తెలిపారు.


 

మరిన్ని వార్తలు