ఆరు నెలల పాటు సినిమాలు, వాట్సాప్‌ చూడకండి: కేటీఆర్‌

15 Mar, 2022 07:59 IST|Sakshi

కన్నవారు సంతోషపడేలా భవిష్యత్‌ను తీర్చిదిద్దుకోండి

యువతకు మంత్రి కేటీఆర్‌ పిలుపు

పీర్జాదిగూడలో ఉచిత కోచింగ్‌ సెంటర్‌ ప్రారంభం

సాక్షి, మేడిపల్లి(హైదరాబాద్‌): తల్లిదండ్రులను సంతోషపెట్టేలా యువత తమ భవిష్యత్‌కు ప్రణాళికలు వేసుకుని ముందుకు సాగాలని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. పీర్జాదిగూడ బుద్ధానగర్‌ సాయిబాబా టెంపుల్‌ కమ్యూనిటీ హాల్‌లో ఏర్పాటు చేసిన ఉచిత కోచింగ్‌ సెంటర్‌ను సోమవారం ఆయన ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో 90 వేల పైలుకు పోస్టులను ప్రభుత్వం ప్రకటించందన్నారు. అభ్యర్థులు ఆరు నెలల పాటు సినిమాలు, ఫోన్‌లో వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రాం, క్రికెట్‌ చూడడం తగ్గించుకోవాలని సూచించారు.


సెంటర్‌లో ప్రొజెక్టర్‌ను ప్రారంభిస్తున్న కేటీఆర్‌  

ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని ఆ దిశగా ముందుకు సాగాలన్నారు.  రాష్ట్రంలో మొదటిసారి పీర్జాదిగూడ నగర పాలక సంస్థ పరిధిలో ఉచిత కోచింగ్‌ సెంటర్‌ ఏర్పాటు చేసినందుకు మంత్రి చామకూర మల్లారెడ్డి, పీర్జాదిగూడ మేయర్‌ జక్క వెంకట్‌రెడ్డిని అభినందించారు.  20 సంవత్సరాలు అనుభవిజ్ఞులైన అధ్యాపకులచే కోచింగ్‌ సెంటర్‌లో 3 నుంచి 4 నెలలు పాటు శిక్షణ ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ఉచిత మెటీరియల్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం స్నాక్స్‌ కూడా అందజేస్తున్నట్లు తెలిపారు. పోటీ తత్వంతో గట్టిగా చదివితే ఉద్యోగం వస్తుందని భరోసానిచ్చారు.
చదవండి: హైదరాబాద్‌: ఫలించిన యాభై ఏళ్ల కల! 

టీఎస్‌ ఐపాస్‌ ద్వారా 19 వేల పరిశ్రమలు వచ్చాయని కేటీఆర్‌ చెప్పారు. 13 వేల పరిశ్రమల పనులు ఇప్పటికే ప్రారంభం కాగా మరో 6వేల పరిశ్రమలు ప్రారంభం కానున్నాయన్నారు. కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి, ఉప్పల్‌ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి, మేడ్చల్‌ కలెక్టర్‌ హరీష్, జిల్లాపరిషత్‌ చైర్మన్‌ మలిపెద్ధి శరత్‌చంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మలిపెద్ధి సుధీర్‌రెడ్డి, పీర్జాదిగూడ మేయర్‌ జక్క వెంకట్‌రెడ్డి, డిప్యూటీ మేయర్‌ కుర్ర శివకుమార్‌గౌడ్, కమిషనర్‌ రామకృష్ణారావు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు