ఆత్మవిశ్వాసంలో అతివలే మేటి

11 Feb, 2023 03:33 IST|Sakshi

మహిళా ఐపీఎస్‌లు పెరుగుతుండటం శుభపరిణామం 

పురుషులకు ఏమాత్రం తీసిపోకుండా ముందంజ వేస్తున్నారు 

ఔట్‌డోర్‌ శిక్షణలోనూ అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తున్నారు  

నాయకత్వ లక్షణాలు పెంచేలా అకాడమీలో శిక్షణ 

వివిధ వర్గాల అభిప్రాయాల మేరకు శిక్షణాంశాల్లో మార్పులు 

‘సాక్షి’ఇంటర్వ్యూలో ఎన్‌పీఏ డైరెక్టర్‌ ఏఎస్‌ రాజన్‌  

సాక్షి, హైదరాబాద్‌:  దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఇండియన్‌ పోలీస్‌ సర్వీసెస్‌లోకి వచ్చే మహిళా అధికారుల సంఖ్య ఏటా పెరుగుతుండటం శుభపరిణామం అని సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ నేషనల్‌ పోలీస్‌ అకాడమీ (ఎన్‌పీఏ) డైరెక్టర్‌ ఏఎస్‌ రాజన్‌ అన్నారు. ఆత్మవిశ్వాసంలో పురుషుల కంటే అతివలే మేటి అని చెప్పారు. ప్రతి బ్యాచ్‌లోనూ 20 మందికిపైగా మహిళా ఐపీఎస్‌లు శిక్షణ పొందుతున్నారని తెలిపారు.

శిక్షణలోనూ పురుషులకు ఏమాత్రం తీసిపోకుండా ఔట్‌డోర్‌లో సైతం తాము మేటి అని నిరూపిస్తున్నారన్నారు. ప్రస్తుతం శిక్షణ పూర్తి చేసుకున్న 2021 బ్యాచ్‌లోనూ దీక్ష అనే మహిళా ఐపీఎస్‌ బెస్ట్‌ ఔట్‌డోర్‌ ప్రొబేషనరీగా ఐపీఎస్‌ అసోసియేషన్‌ గౌరవ కరవాలాన్ని పొందారని, ఎన్‌పీఏ చరిత్రలో రెండోసారి ఈ ఘనత దక్కించుకున్న అధికారిణిగా నిలిచారని ఆయన పేర్కొన్నారు.

ఎన్‌పీఏలో శిక్షణ పొందిన 2021 బ్యాచ్‌ ప్రొబేషనరీ ఐపీఎస్‌ అధికారుల పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌ శనివారం జరగనుంది. ఈ సందర్భంగా.. దేశవ్యాప్తంగా శాంతిభద్రతల నిర్వహణలో అత్యంత కీలకమైన ఐపీఎస్‌ అధికారులను తీర్చిదిద్దే ఎన్‌పీఏలో ఇచ్చే శిక్షణ, మారుతున్న పరిస్థితులకు తగి­న విధంగా శిక్షణలో తెచ్చిన మార్పులు తదితర అంశాలపై రాజన్‌ ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే..  

అకాడమీలోకి వచ్చాక అందరూ సమానమే.. 
ఐపీఎస్‌కుకు ఎంపికయ్యే వారిలో కానిస్టేబుల్‌ నుంచి ఐపీఎస్‌ల పిల్లల వరకు.. స్థానిక విద్యా సంస్థలు మొదలు కాన్వెంట్లలో చదివిన వారు..అప్పుడే చదువులు పూర్తి చేసుకున్న వారి నుంచి విదేశాల్లో లక్షల జీతాల కొలువులు వదిలి వచ్చే వారి వరకు విభిన్న నేపథ్యాల వారు ఉంటారు. అది ఎన్‌పీఏలోకి రాకముందు వరకే. ఒకసారి అకాడమీలో అడుగుపెట్టిన తర్వాత వారంతా సమానమే. మొదటి రెండు వారాలు ఇదే అంశంపై దృష్టి పెడతాం. ట్రైనీలను బృందాలుగా ఏర్పాటు చేసి వారిలో నాయకత్వ లక్షణాలు పెంచేలా చూస్తాం. ఐపీఎస్‌ అధికారిగా తనతోపాటు వందల మందిని కలుపుకొని నిత్యం పనిచేయాల్సి ఉంటుంది. అందుకు తగ్గట్టుగా వారిని తీర్చిదిద్దుతాం.  

నైతిక విలువలు పెంచేలా శిక్షణ 
కొత్తగా విధుల్లోకి వచ్చే ఐపీఎస్‌ అధికారుల వైఖరి సరిగా ఉండడం లేదన్న విమర్శల నేపథ్యంలో  8 రాష్ట్రాల్లో 6 విధాలుగా అభిప్రాయాలు సేకరించాం. ఐపీఎస్‌ల వైఖరి, శిక్షణలో ఎలాంటి మార్పులు చేయాలన్న అంశాలపై డీఎస్పీ, సీఐ, ఎస్సై, కానిస్టేబుల్‌ ర్యాంకు వరకు ఒక గ్రూప్, డీఐజీ నుంచి డీజీపీ ర్యాంకు వరకు ఒక గ్రూప్, రెవెన్యూలో వివిధ స్థాయిల అధికారులు ఒక గ్రూప్, ఎన్జీఓలు.. మీడియా ఒక గ్రూప్, సమాజంలో ప్రభావిత స్థానాల్లో ఉన్న వారు ఒక గ్రూప్, ప్రజలు ఒక గ్రూప్‌.. ఇలా వారి అభిప్రాయాలు తీసుకుని వాటిని క్రోడీకరించి బలాలు, బలహీనతలు గుర్తించాం. బాధితులతో ఎలా వ్యవహరించాలన్న అంశంతో పాటు ఐపీఎస్‌ శిక్షణ నైతిక విలువలు పెంచేలా కరికులంలో చాలా మార్పులు చేశాం.  

శిక్షణలోనూ స్త్రీ, పురుష తేడా లేదు 
అకాడమీలో శిక్షణలో ప్రవేశించిన తర్వాత మహిళలు, పురుషులు అనే తేడా కూడా ఏ అంశంలోనూ ఉండదు. శిక్షణలోనూ మినహాయింపులు ఉండవు. వారంతా కూడా సుశిక్షితులైన పోలీస్‌ అధికారులుగా తయారు కావాల్సిందే. వాస్తవం చెప్పాలంటే ఆత్మవిశ్వాసంలో పురుషుల కంటే మహిళలే మేటి. ప్రతి బ్యాచ్‌లో మేం ఔట్‌డోర్‌ శిక్షణలో మహిళలకు ప్రత్యేకంగా ట్రోఫీ కేటాయిస్తాం.

ఆ ట్రోఫీయే ఈసారి దీక్షకు దక్కింది. 2019లోనూ రంజితశర్మ బెస్ట్‌ ఔట్‌డోర్‌ ప్రొబేషనరీగా నిలిచారు. ఔట్‌డోర్‌ శిక్షణలో వాళ్లు పురుషులను వెనక్కి నెట్టి బెస్ట్‌గా నిలిచారు. చూస్తుంటే ఇకపై బెస్ట్‌ లేడీ ప్రొబేషనరీ ఔట్‌డోర్‌ ట్రైనింగ్‌ మాదిరిగా బెస్ట్‌ జెంటిల్‌మెన్‌ ప్రొబేషనరీ ఔట్‌డోర్‌ ట్రైనింగ్‌ అని పెట్టాల్సి వచ్చేట్టుంది.. (నవ్వుతూ..).  

‘సైబర్‌’ సవాళ్లను ఎదుర్కొనేలా ప్రత్యేక శిక్షణ
సైబర్‌ నేరాలనేవి భవిష్యత్తులో మనం ఎదుర్కొనబోయే అతిపెద్ద ముప్పు. ఈ సవాళ్లను ఎదుర్కొనేందుకు యువ ఐపీఎస్‌ అధికారులకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నాం. ఇందుకోసం ఎన్‌పీఏలో ప్రత్యేకంగా నేషనల్‌ డిజిటల్‌ క్రైం రిసోర్స్‌ అండ్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ (ఎన్‌డీసీఆర్‌టీసీ)ని ఏర్పాటు చేశాం. సరికొత్త సైబర్‌ సవాళ్లను ఎదుర్కొనేలా ఇక్కడ శిక్షణ ఇస్తాం.

ఇప్పటికే దేశవ్యాప్తంగా పనిచేస్తున్న 10 వేల మంది వివిధ ర్యాంకుల పోలీస్‌ అధికారులకు ఎన్‌డీసీఆర్‌టీసీలో సైబర్‌ క్రైం దర్యాప్తు, నియంత్రణలో శిక్షణ ఇచ్చాం. ప్రొబేషనరీ ఐపీఎస్‌లతోపాటు సీనియర్‌ ఐపీఎస్‌లకు కూడా వివిధ దశల్లో ఇక్కడ శిక్షణలు ఇస్తుంటాం. మన పోలీసులతో పాటు నేపాల్, భూటాన్, మాల్దీవులు, మారిషస్‌ దేశాల పోలీస్‌ అధికారులకు సైతం శిక్షణ ఇస్తాం.   

మరిన్ని వార్తలు