యువత నడతపైనే దేశ భవిష్యత్తు

13 Sep, 2021 04:46 IST|Sakshi

స్వామి వివేకానంద ఆలోచనలను యువత అనుసరించాలి 

పట్టుదల, నిరంతర సాధనతోనే విజయం సాధ్యం 

చట్టాలు, హక్కులపై అవగాహన పెంచుకోవాలి  

వీఐహెచ్‌ఈ వార్షిక వేడుకల్లో సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ 

సాక్షి, హైదరాబాద్‌: యువత నడతపైనే మన దేశ భవిష్యత్తు ఆధారపడి ఉందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు. ‘భారతదేశం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం. ఈ అభివృద్ధికి ప్రధాన కారణం యువశక్తి. దేశంలోని జనాభాలో 45 శాతం మంది యువజనులే ఉన్నారు. ప్రపంచంలో ఏ దేశానికి కూడా ఇంత యువశక్తి లేదు. స్వామి వివేకానంద చెప్పినట్లు మన దేశ గతాన్ని, భవిష్యత్తును అనుసంధానం చేయగల శక్తి యువతదే’అని ఆయన అన్నారు.

ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన వివేకానంద ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హ్యూమన్‌ ఎక్సలెన్స్‌ (వీఐహెచ్‌ఈ) 22వ వార్షిక వేడుకల్లో ప్రధాన న్యాయమూర్తి జూమ్‌ యాప్‌ ద్వారా పాల్గొని ప్రసంగించారు. స్వామి వివేకానంద ఆలోచనలను యువత అనుసరించాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. యువత తమ లక్ష్యసాధనకోసం తలపెట్టిన ఆలోచనలను సరైన విధంగా ఆచరణలో పెట్టాలన్నారు. లక్ష్యసాధనలో పట్టుదల, నిరంతర సాధన ఉంటేనే విజయం సాధ్యమవుతుందన్నారు.

‘ప్రస్తుతం మన దేశంలోని యువజనుల ఆలోచనలు నిస్వార్థంగా, సమాజహితం కోసం ప్రయత్నించే విధంగా ఉన్నాయి. వీటికి మరింత పదును పెట్టాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరూ సమాజంలో జరిగే సంఘటనల పట్ల అప్రమత్తంగా ఉండాలి. తప్పు, ఒప్పుల మధ్య తేడాలను గుర్తించగలిగినప్పుడే ఎదుగుదల సరైన విధంగా ఉంటుంది. హక్కులు, చట్టాలపట్ల యువత సరైన అవగాహన అలవర్చుకోవాలి, వీటిపై సరైన పట్టు సాధించినప్పుడే సమాజానికి మరింత సేవ చేయడానికి వీలుంటుంది.

దేశంలో మార్పులు తీసుకురావాలన్నా.. శాంతిని స్థాపించాలన్నా.. దేశ పురోగతి వేగాన్ని పెంచాలన్నా యువశక్తి ఆచరణే కీలకం. నా సర్వీసులో ఎంతోమంది విజయం సాధించిన యువ అడ్వొకేట్లను చూశా. వృత్తిలోకి వచ్చినప్పుడే సరైన లక్ష్యంతో ముందుకెళ్తున్నారు. విజయం సాధిస్తున్నారు. ప్రస్తుతం యువత ముందు ఎన్నో రకాల సవాళ్లున్నాయి. తమకున్న నైపుణ్యాన్ని సరైన విధంగా ఆచరణలో పెట్టాలి. సమస్యలు లేని మార్గంలో వెళ్లడమంటే సరైన దారి కాదనే అంశాన్ని కూడా గుర్తించాలి’అని జస్టిస్‌ రమణ యువతకు దిశానిర్దేశం చేశారు.   

మరిన్ని వార్తలు