‘దొంగ కానిస్టేబుల్‌’ ఈశ్వర్‌.. డబ్బు ‘తీసుకోవడం’తోనే గుట్టు వీడింది! 

25 Nov, 2022 11:54 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సొంతంగా దొంగల ముఠాలను ఏర్పాటు చేసుకుని, వారితో ఏళ్లుగా స్నాచింగ్స్‌ చేయిస్తూ, ఆ సెల్‌ఫోన్లను విక్రయిస్తూ భారీ దందా నడిపిన హైదరాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌ కానిస్టేబుల్‌ మేకల ఈశ్వర్‌ వ్యవహారం నల్లగొండ పోలీసుల చొరవతో గుట్టురట్టు అయ్యింది. దసరా నేపథ్యంలో ఆ పట్టణంలో రెచ్చిపోయిన సెల్‌ఫోన్‌ దొంగల అరెస్టుతోనే ఇతడి దందా వెలుగులోకి వచ్చిం. అతడి నేరాల చిట్టా తెలుసుకోవడంపై దృష్టి పెట్టిన అధికారులు న్యాయస్థానం అనుమతితో కస్టడీలోకి తీసుకోవాలని నిర్ణయించారు.  

దసరా నేపథ్యంలో నల్లగొండలో... 
ప్రతి గ్యాంగ్‌లోనూ ఐదారుగురు సభ్యులతో దాదాపు 20 ముఠాలు ఈశ్వర్‌ కనుసన్నల్లో పని చేసేవి. నగరంలోని పరేడ్‌ గ్రౌండ్స్, రామగుండ ప్రాంతాల్లో జరిగిన ప్రధాని మోదీ బహిరంగ సభలు, రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో యాత్రలతో సహా పండుగలు, పర్వదినాల్లోనూ ఈ ముఠా తమ చేతివాటం ప్రదర్శించేది. ఇందులో భాగంగానే హఫీజ్‌పేటకు చెందిన కోటమ్మ, తిరుపతయ్య దంపతులు, ఇద్దరు మైనర్లు సహా ఆరుగురితో కూడిన గ్యాంగ్‌ను దసరా సందర్భంలో ఈశ్వర్‌ నల్లగొండకు పంపాడు. అక్కడి మొదటి, రెండో టౌన్‌ పోలీసుస్టేషన్ల పరిధుల్లోని మార్కెట్లలో రెచ్చిపోయిన ఈ ముఠా అనేక సెల్‌ఫోన్లను తస్కరించింది. ఈ చోరీ ఫోన్లను ఈశ్వర్‌ బయటకు పంపేయడంతో పోలీసులకూ ఆచూకీ చిక్కలేదు. 

స్కాన్‌ చేసి డబ్బు తీసుకోవడంతో... 
దసరా సందర్భంలోనే తన స్మార్ట్‌ ఫోన్‌ పోగొట్టుకున్న ఓ బాధితుడు నల్లగొండ రెండో టౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీని ఆధారంగా కేసు నమోదు చేసుకున్న అధికారులు సాంకేతికంగా ప్రయతి్నంచారు. ఈ ఫోన్‌ను అన్‌లాక్‌ చేసిన చోర దంపతులు పేటీఎం వ్యాలెట్‌ను వినియోగించగలిగారు. దీంతో హైదరాబాద్, నల్లగొండల్లోని ఆరు పెట్రోల్‌ బంకుల్లో క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేసి నగదు తీసుకున్నారు. ఇలా మొత్తం ఆరు విడతల్లో రూ.1.4 లక్షలు తన పేటీఎం ద్వారా కట్‌ అయినట్లు బాధితుడు నల్లగొండ టూటౌన్‌ పోలీసుల దృష్టికి తీసుకువెళ్లాడు. ఇలా దొరికిన ఆధారంతో ముందుకు వెళ్లాలని నిర్ణయించిన అధికారులు ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దింపారు. 

బెదిరింపు ఫోన్లకు రూ.50 వేలు చెల్లింపు... 
నిందితుల గుర్తింపు కోసం ఆ ఆరు పెట్రోల్‌ బంకులకు వెళ్లిన పోలీసులు సీసీ కెమెరాల్లో నమోదైన ఫీడ్‌ను సంగ్రహించారు. ఇలా అనుమానితులు ఫొటోలు చేజిక్కడంతో సాంకేతికంగా ముందుకు వెళ్లి కోటమ్మ, తిరుపతయ్యల ఆచూకీ కనిపెట్టారు. వీరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న విషయం తెలుసుకున్న ఈశ్వర్‌ తనదైన శైలిలో రంగంలోకి దిగాడు. వారిని వెంటనే అరెస్టు చూపించాలని లేదంటే కోర్టులో పిటిషన్‌ దాఖలు చేస్తామంటూ కొందరు న్యాయవాదులతో నల్లగొండ పోలీసులకు ఫోన్లు చేయించారు. వారికి ఈశ్వర్‌ రూ.50 వేలు చెల్లించినట్లు తెలిసింది. చోర జంట విచారణలో ఈశ్వర్‌ వ్యవహారం వెలుగులోకి రావడంతో అతడినీ అరెస్టు చేశారు. ఆ ముఠాకు సంబంధించి పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు.   

మరిన్ని వార్తలు