-

రైతుల గోస తీరేలా..! 

26 Nov, 2022 03:28 IST|Sakshi
పాలిటెక్నిక్‌ విద్యార్థినులు రూపొందించిన రైతన్నకిట్‌

తల్లిదండ్రుల బాధ చూసి ‘రైతన్న కిట్‌’ను రూపొందించిన పాలిటెక్నిక్‌ విద్యార్థినులు  

ధాన్యం, ఇతర ఉత్పత్తులు వానకు తడిసిపోకుండా ప్రత్యేక ఏర్పాట్లు  

రాయదుర్గం (హైదరాబాద్‌): వారు వ్యవసాయ కుటుంబాలకు చెందిన విద్యార్థినులు.. ఆరుగాలం పండించిన పంట వానలకు తడిసిపోతూ తల్లిదండ్రులు బాధపడుతుంటే చూడలేకపోయారు. ఆ కష్టాలను తీర్చడంపై దృష్టిపెట్టారు. ఓ మెంటార్‌ సాయంతో ‘రైతన్న కిట్‌’ను రూపొందించారు. మూడు వేల ఖర్చుతో మళ్లీ వాడుకునే ప్రత్యేక టార్పాలిన్‌ బ్యాగ్‌తో కూడిన ఈ కిట్‌కు టీహబ్‌లో నిర్వహించిన ‘యూత్‌ ఫర్‌ సోషల్‌ ఇంపాక్ట్‌’పోటీలో మొదటిస్థానం దక్కడం గమనార్హం. 

నెల రోజులు కష్టపడి.. 
వరంగల్‌ ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్‌లో వి.లహరిక, జి.చందన, ఎన్‌.శ్వేత ముగ్గురు ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు. వ్యవసాయ కుటుంబాలకు చెందిన వీరు.. ఏటా తమ తల్లిదండ్రులు పండించిన ధాన్యం వానకు తడవడం, ఎండబెట్టేందుకు వారుపడే పాట్లు, తడిసిన ధాన్యానికి తక్కువ ధరతో ఇబ్బందిపడటం  కళ్లారా చూశారు. దీంతో ఈ సమస్యపై దృష్టిసారించారు. ఇదే సమయంలో వారికి ‘యూత్‌ ఫర్‌ సోషల్‌ ఇంపాక్ట్‌’కార్యక్రమం అందివచ్చింది. ఈ కార్యక్రమం కింద తమ కు మెంటార్‌గా వచ్చిన మెట్టు రాజారెడ్డికి విద్యార్థినులు తమ ఆలోచనను వివరించారు. 

సమస్యను గమనించి.. 
వానలు వచ్చినప్పుడు రైతులు టార్పాలిన్‌లను కప్పుతుంటారు. వాటి నుంచి నీళ్లు లీకై ధాన్యం తడుస్తుంది. ఈ సమస్యకు చెక్‌ పెట్టేలా విద్యార్థినులు ఒక కిట్‌ను రూపొందించారు. దానికి కేసీఆర్‌ కిట్‌ స్ఫూర్తితో ‘రైతన్న కిట్‌’అని పేరుపెట్టారు. 

పరిష్కారాలన్నీ కలిపి చేర్చి.. 
విద్యార్థినులు నలుపు రంగులో ఉండే నాణ్యమైన రెండు టార్పాలిన్లను తీసుకున్నారు. వాటికి మధ్య లో జిప్‌ను ఏర్పాటు చేసి.. అది పెడితే ప్రత్యేకమైన బ్యాగ్‌లా మార్చేలా తీర్చిదిద్దారు. జిప్‌ వద్ద నీళ్లు పోకుండా అంటించేందుకు, ఒకవేళ చిరిగినా, రంధ్రం పడినా అంటించేందుకు టేపు, గ్లౌజులు, ఎలుకలు కొట్టకుండా ర్యాట్‌ స్ప్రే, టార్పాలిన్‌ దెబ్బతినకుండా పారలకు పెట్టేందుకు రబ్బర్‌ స్ట్రిప్‌లు, అత్యవసర ప్రాథమిక చికిత్స కిట్‌ను ఏర్పాటుచేశారు.

వీటన్నింటినీ కలిపి ఒక కిట్‌లా సిద్ధం చేశా రు. అంతా సిద్ధం చేసి పరిశీలించేందుకు విద్యార్థినులకు నెల రోజులు సమయం పట్టింది. ఒక్కో కిట్‌లో 20 క్వింటాళ్ల ధాన్యం బస్తాలను నిల్వ చేయవచ్చు. జిప్‌ తీసి పరిస్తే విశాలమైన స్థలంలో ధాన్యాన్నిగానీ, ఇతర ఉత్పత్తులను గానీ ఎండబెట్టొచ్చు. 

►గాలి ఆడేందుకు టార్పాలిన్‌ బ్యాగ్‌కు ఒకచోట చిన్నపాటి రంధ్రం చేసి మెష్‌ను అమర్చారు. టార్పాలిన్‌కు ర్యాట్‌ స్ప్రే చేస్తే 6 నెలల వరకు కూడా ఎలుకలు కొట్టకుండా ఉంటాయి. 
►నల్లని టార్పాలిన్‌ వేడిని గ్రహించి ధాన్యంలోని తేమశాతం తగ్గేందుకు తోడ్పడుతుందని విద్యార్థినులు చెబుతున్నారు.

వారి ఆలోచన నన్ను కదిలించింది 
రైతులైన తమ తల్లిదండ్రుల బాధ తీర్చాలన్న విద్యార్థినుల ఆలోచన నన్ను కదిలించింది. దీనిపై పరిశీలన జరిపి ‘రైతన్న కిట్‌’ను తయారు చేశాం. టీహబ్‌లో ప్రదర్శించగా మొదటి స్థానం, రూ.1.50 లక్షల నగదు బహుమతి వచ్చింది. ఒక కిట్‌ తయారీకి రూ.3,100 ఖర్చవుతుంది. ప్రభుత్వం సహకారం అందిస్తే రైతులకు మేలు జరుగుతుంది. 
– మెట్టు రాజారెడ్డి, రైతన్న కిట్‌ మెంటార్‌ 

ఉచితంగా ఇస్తే మేలు.. 
రైతులందరికీ మేలు జరిగేలా కిట్‌ను రూపొందించాం. దీని రూపకల్పనలో మెంటార్‌ రాజారెడ్డి సహకారం మరవలేనిది. మా ఉత్పత్తిని ప్రభుత్వం కొనుగోలు చేసి రైతులకు ఉచితంగా ఇస్తే ఎంతో మేలు జరుగుతుంది. 
– ‘రైతన్న కిట్‌’రూపకర్తలు చందన, శ్వేత, లహరిక  

మరిన్ని వార్తలు