ప్రణబ్‌ ముఖర్జీ చొరవతోనే నక్షత్ర వాటిక ఏర్పాటు

1 Sep, 2020 08:41 IST|Sakshi
రాష్ట్రపతి నిలయంలోని నక్షత్ర వాటికను ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని చదువుతున్న ప్రణబ్‌ (ఫైల్‌)

సాక్షి, హైదరాబాద్‌‌: ప్రణబ్‌ ముఖర్జీ రాష్ట్రపతి హోదాలో దక్షిణాది విడిది అయిన బొల్లారంలోని ఆర్‌పీ భవనాన్ని నాలుగుసార్లు సందర్శించారు. 2012లో రాష్ట్రపతిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన ఆయన అదే ఏడాది డిసెంబర్‌ నెలాఖరులో హైదరాబాద్‌లోని రాష్ట్రపతి భవన్‌కు శీతాకాల విడిదికి వచ్చారు. 2013 నూతన సంవత్సర వేడుకలను ఆయన ఇక్కడే జరుపుకొన్నారు. తిరిగి 2013 డిసెంబర్‌లోనూ ఇక్కడకు వచ్చారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 2014లో మాత్రం ఆయన శీతాకాల విడిదికి హైదరాబాద్‌కు రాలేదు. మరుసటి ఏడాది డిసెంబర్‌కు బదులు జూలైలోనే ప్రణబ్‌ ముఖర్జీ రాష్ట్రపతి నిలయానికి వచ్చారు. ఆ ఏడాది కేవలం మూడు రోజులు మాత్రమే ఇక్కడ ఉన్నారు. చివరిసారిగా 2016 డిసెంబర్‌లో రాష్ట్రపతి నిలయాన్ని సందర్శించారు. 

నక్షత్రవాటిక, దానిమ్మ తోటల ఏర్పాటు 
ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లోని మొఘల్‌ గార్డెన్‌లోని నక్షత్ర వాటిక మాదిరిగానే, బొల్లారం రాష్ట్రపతి నిలయంలోనూ నక్షత్ర వాటిక ఏర్పాటు చేయించారు. ఇందులో 27 నక్షత్రాలు (రాశులు) ప్రతిబింబించేలా 27 రకాల మొక్కలు ఏర్పాటు చేశారు. 99 ఎకరాల సువిశాల రాష్ట్రపతి నిలయంలో సగానికిపైగా స్థలం వృథాగానే ఉండేది. ఈ నేపథ్యంలో తొలిసారిగా రాష్ట్రపతి నిలయం సందర్శనకు వచ్చిన ఆయన ఖాళీ స్థలాల్లో పండ్ల తోటలు, పూలమొక్కలు ఏర్పాటు చేయాల్సిందిగా సూచించినట్లు బోర్డు అధికారులు పేర్కొన్నారు. దీంతో అప్పటికే ఉన్న మామిడి, ఉసిరి, సపోటా తోటలకు అదనంగా దానిమ్మ తోటను ఏర్పాటు చేశారు.  

నేనున్నానంటూ భరోసానిచ్చారు: పీవీ వాణిదేవి 
సాక్షి, సిటీబ్యూరో: ‘నాన్న పీవీతో ప్రణబ్‌ ముఖర్జీది సుదీర్ఘ బంధం. నాన్న మరణం తర్వాత ఆయన మా కుటుంబానికి నేనున్నానన్న భరోసానిచ్చారు. కొన్ని సందర్భాల్లో పార్టీ పట్టించుకోకున్నా.. ఆయన మా కుటుంబానికి అండగా నిలిచారు. ప్రణబ్‌ మరణం దేశానికి తీరనిలోటు’ అని మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు కూతురు పీవీ వాణీదేవి అన్నారు. ప్రణబ్‌ మరణంపై తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. 2012 డిసెంబరులో తొలిసారిగా పీవీ నర్సింహారావు స్మారక ఉపన్యాసాన్ని ప్రణబ్‌ ముఖర్జీయే ఇచ్చారని, ఆ రోజు తమ కుటుంబ సభ్యులందరినీ పేరుపేరునా పలకరిస్తూ ఫొటోలు తీయించారని వాణీదేవి గతాన్ని జ్ఞాపకం చేశారు. 

ప్రణబ్‌కు సీజీఆర్, గ్రేస్‌ నివాళి 
లక్డీకాపూల్‌: మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ మృతి పట్ల కౌన్సిల్‌ ఫర్‌ గ్రీన్‌ రివల్యూషన్‌ (సీజీఆర్‌), తూర్పు కనుమల పరిరక్షణ వేదిక (గ్రేస్‌) ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించింది. ఆయన మరణంతో దేశం పర్యావరణం పట్ల ఎంతో జ్ఞానం, స్పృహ కలిగిన ఓ బహుముఖ ప్రజ్ఞాశాలి, రాజనీతిజ్ఞుడిని కోల్పోయిందని అభిప్రాయపడింది. అర్ధ శతాబ్దానానికిపైగా వివిధ రూపాల్లో, హోదాల్లో ఆయన దేశానికి అందించిన సేవలు అనితర సాధ్యం, చిరస్మరణీయం అని పేర్కొంది. ప్రముఖ పర్యావరణ వేత్త ప్రొఫెసర్‌ పురుషోత్తమ్‌రెడ్డి, లీలా లక్ష్మారెడ్డి (సీజీఆర్‌), దిలీప్‌రెడ్డి (గ్రేస్‌) ఈ సందర్భంగా ప్రణబ్‌ ముఖర్జీకి నివాళులర్పించారు.  

మరిన్ని వార్తలు