పాకిస్తాన్‌ చెర నుంచి తెలుగు యువకుడి విడుదల

1 Jun, 2021 17:44 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పాకిస్తాన్‌ చెరలో చిక్కుకున్న తెలుగు యువకుడు ప్రశాంత్ ఎట్టకేలకు విడుదలయ్యాడు. వాఘా సరిహద్దులో పాక్ అధికారులు ప్రశాంత్‌ను భారత అధికారుల బృందానికి అప్పగించగా, మంగళవారం మాదాపూర్ పోలీసులు అతన్ని ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. సీపీ సజ్జనార్‌ ఆధ్వర్యంలో ప్రశాంత్‌ను కుటుంబ సభ్యులకు అప్పగించారు.

ఈ సందర్భంగా ప్రశాంత్‌ మాట్లాడుతూ.. తన విడుదలకు సహకరించిన రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు కృతజ్ఞతలు తెలిపాడు. తనను విడిపించడం కోసం ప్రత్యేక చొరవ తీసుకుని ఢిల్లీకి వెళ్లి అధికారులతో మాట్లాడిన సీపీ సజ్జనార్‌కు జీవితకాలం రుణపడి ఉంటానని పేర్కొన్నాడు. తన లాంటి వారు చాలా మంది ఏళ్ల తరబడి పాక్‌ జైళ్లలో మగ్గుతున్నారని, వారి విడుదల కూడా కేంద్ర ప్రభుత్వం చొరవ చూపాలని అభ్యర్ధించాడు. పాక్‌ చెర నుంచి బయటపడతానని అస్సలు అనుకోలేదని ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు.

కాగా, నగరంలోని ఓ ప్రముఖ సంస్థలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిగా పని చేసిన ప్రశాంత్‌ 2017 ఏప్రిల్‌లో హైదరాబాద్‌ నుంచి అదృశ్యమయ్యాడు. ప్రియురాలి కోసం స్విట్జర్లాండ్ వెళ్లే క్రమంలో అనుకోకుండా పాక్‌ భూభాగంలోకి ప్రవేశించడంతో పాక్‌ అధికారులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో ప్రశాంత్ తండ్రి బాబూరావు 2019లో సైబరాబాద్ సీపీ సజ్జనార్‌ను కలిసి తన కొడుకును పాక్‌ చెర నుంచి విడిపించాలని విజ్ఞప్తి చేశాడు.

చదవండి: 
కేటీఆర్‌ని సోనూ సూద్‌ ఏమి కోరారో తెలుసా?

మాకొద్దీ క‌రోనా ట్రీట్మెంట్‌, ప్రాణాలు పోతే పోనీ

>
మరిన్ని వార్తలు