ముందస్తు బెయిల్‌ పిటిషన్లు ఇన్నాళ్లు పెండింగ్‌లోనా..! | Sakshi
Sakshi News home page

ముందస్తు బెయిల్‌ పిటిషన్లు ఇన్నాళ్లు పెండింగ్‌లోనా..!

Published Thu, Sep 7 2023 3:34 AM

High Court was surprised by the petitions of Narayana and his benamis - Sakshi

సాక్షి, అమరావతి: అమరావతి రాజధాని ముసు­గులో 1,100 ఎకరాల అసైన్డ్, లంక భూములను కాజేసిన వ్యవహారంలో 2020లో సీఐడీ నమోదు చేసిన కేసులో తమకు ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలంటూ మాజీ మంత్రి పొంగూరు నా­రా­యణ, ఆయన సమీప బంధువులు, బినామీలు దాఖలు చేసిన వ్యాజ్యాలు దాదాపు ఏడాది కాలంగా పెండింగ్‌లో ఉండటంపై హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది.

ముందస్తు బెయిల్‌ పిటిషన్లు ఏడాది పెండింగ్‌లో ఉండటం తామెన్నడూ చూడలేదని తెలిపింది. ఇదే సమయంలో వాదనలు వినిపించేందుకు నారాయణ, ఇతరుల తరఫు న్యాయవాదులు మ­రో­సారి సమయం కోరడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఇలానే వాయిదాలు కోరుతుంటే, నారా­యణ తదితరులను అరెస్ట్‌ చేయవద్దంటూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేస్తామని, అప్పుడు తీరిగ్గా వాదనలు వినిపించుకోవచ్చునని ఆగ్రహం వ్యక్తం చేసింది. తదుపరి ఎలాంటి వాయిదాలు వేసే ప్రసక్తే లేదని, ఇదే చివరి అవకాశమని నారాయణ తదితరులకు హైకోర్టు స్పష్టం చేసింది.

అలాగే ఒకవైపు ముందస్తు బెయిల్‌ పిటిషన్లు, మరో వైపు కేసు కొట్టేయాలంటూ క్వాష్‌ పిటిషన్లు సమాంతరంగా దాఖలు చేయడంపైనా హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఇలా ఎలా రెండు రకాల పిటిషన్లు దాఖలు చేస్తారని, అవి ఎలా నిలబడతాయని ప్రశ్నించింది. ఇలాంటి ఫైలింగ్‌ను తామెన్నడూ చూడలేదని వ్యాఖ్యానించింది. అనంతరం తదుపరి విచారణను ఈ నెల 14కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ కంచిరెడ్డి సురేష్‌రెడ్డి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.

వాయిదాలతో కాలం వెళ్లదీస్తున్నారు...
తాజాగా ఈ వ్యాజ్యాలు బుధవారం మరోసారి విచారణకు వచ్చాయి. నారాయణ తదితరుల తరఫు న్యాయవాదులు ఎస్‌.ప్రణతి, అజయ్‌ తదితరులు స్పందిస్తూ, సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా తమ తరఫున వాదనలు వినిపించాల్సి ఉందని, వ్యక్తిగత కారణాలరీత్యా ఆయన హాజరు కాలేకపోతున్నందున విచారణను వాయిదా వేయాలని కోర్టును కోరారు. దీనిపై సీఐడీ తరఫున వాదనలు వినిపిస్తున్న అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి తీవ్ర అభ్యంతరం తెలిపారు. సీనియర్‌ న్యాయవాది పేరుతో వాయిదాల మీద వాయిదాలు తీసుకుంటున్నారని, ఇది ఎంత మాత్రం సమంజసం కాదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.

ఏడాది కాలంగా ఇలాగే ఈ వ్యాజ్యాల్లో విచారణను సాగదీస్తూ వస్తున్నారని తెలిపారు. అరెస్ట్‌పై స్టేను అడ్డం పెట్టుకుని కాలం వెళ్లదీస్తున్నారని కోర్టుకు ఏఏజీ నివేదించారు. ఈ సమయంలో న్యాయస్థానం జోక్యం చేసుకుంటూ, ఇలా పదే పదే వాయిదాలు కోరుతుంటే ఏఏజీ ప్రభుత్వానికి సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుందని నారాయణ న్యాయవాదులను ఉద్దేశించి వ్యాఖ్యానించింది. దాదాపు ఏడాదిగా ముందస్తు బెయిల్‌ పిటిషన్లు పెండింగ్‌లో ఉండటం ఎన్నడూ చూడలేదని, ముందస్తు బెయిల్‌ పిటిషన్లు, క్వాష్‌ పిటిషన్లు సమాంతరంగా దాఖలు చేయడం ఏంటని ప్రశ్నించింది.

దీనికి నారాయణ తరఫు న్యాయవాది ఎస్‌.ప్రణతి స్పందిస్తూ, రెండు రకాల పిటిషన్లు దాఖలు చేయవచ్చునని, ఇందుకు సంబంధించిన తీర్పులను వాదనల సమయంలో కోర్టు ముందుంచి, సంతృప్తికర వివరణ ఇస్తామని తెలిపారు. ఆమె వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం ఈ వ్యాజ్యాల్లో తదుపరి ఎలాంటి వాయిదాలు ఇచ్చే ప్రసక్తేలేదని తేల్చి చెప్పింది. వాయిదాలు ఇవ్వడం ఇదే చివరి సారి అని పేర్కొంటూ.. తదుపరి విచారణను ఈ నెల 14కి వాయిదా వేసింది.

ఏక కాలంలో రెండు పిటిషన్లా..
సీఐడీ కేసులో తనకు ముందస్తు బెయిల్‌ ఇవ్వాలంటూ నారాయణ 2022 హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఇదే సమయంలో ఆయ­న సమీప బంధువులు, బినామీలు తమ­పై సీఐడీ నమోదు చేసిన కేసును కొట్టేయాలంటూ క్వాష్‌ పిటిషన్లు వేశారు. నారాయణ కూడా తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలంటూ 2023లో క్వాష్‌ పిటిషన్‌ వేశారు. 2022లో ముందస్తు బెయిల్‌ కోసం నారాయణ దాఖలు చేసిన పిటిషన్‌ను అప్పట్లో విచారించిన హైకోర్టు, కేన్సర్‌ శస్త్రచికిత్స కోసం విదేశాలకు వెళ్లేందుకు వీలుగా మధ్యంతర ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది.

నారాయణ సమీప బంధువులు, బినామీలు దాఖలు చేసిన వ్యాజ్యాల్లో స్పందించిన హైకోర్టు, సీఆర్‌పీసీ 41ఏను అనుసరించాలని సీఐడీని ఆదేశించిన విషయం తెలిసిందే. ఆ తరువాత ఈ వ్యాజ్యాల్లో విచారణ పలుమార్లు వా­యిదా పడింది. తమకు అనుకూలంగా మధ్యంతర ఉత్తర్వులు ఉండటంతో నారాయ­ణ తదితరు­లు ఏదో ఒక కారణం చూపుతూ వాయిదాల మీద వాయిదాలు కోరుతూ వ­చ్చారు. దర్యాప్తు సంస్థ న్యాయ­వాదులు కూడా ఒకటి రెండు సార్లు వాయిదాలు అడిగారు.

Advertisement
Advertisement