ఆధార్‌ నంబర్‌తో.. భూమిని కొట్టేసేందుకు కుట్ర  

8 Jun, 2021 08:17 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, హైదరాబాద్‌: భూమి ఉన్నది 20 గుంటలే... కానీ మార్కెట్‌లో దాని ధర కోట్లు పలుకుతోంది. ఆ భూమి యజమాని దాదాపు రెండేళ్ల క్రితం మరణించారు. సదరు యజమాని కుటుంబీకులు ఆ భూమిని తమ పేరు మీద బదలాయించుకోలేదు. దీన్ని గమనించిన కొందరు ప్రబుద్ధులు భూమిని కొట్టేసేందుకు కుట్రపన్నారు. ఒక్క ఆధార్‌ నంబర్‌తో అప్పనంగా భూమిని సొంతం చేసుకుందామనుకున్నారు. రెవెన్యూ అధికారుల విచారణలో అసలు విషయం తేలడంతో అడ్డంగా బుక్కయ్యారు. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం భానూర్‌ గ్రామంలో సర్వే నంబర్‌ 497/ఇలో 20 గుంటల భూమి ఉంది. గత ఏప్రిల్‌ 19న తోట హనుమంతరావు పేరుతో ధరణి పోర్టల్‌కు ఒక దరఖాస్తు వచ్చింది.

ఆ భూమికి ఈకేవైసీ కోసం తన ఆధార్‌ నంబర్‌ను నమోదు చేయాలని ఆ దరఖాస్తులో కోరారు. దీన్ని విచారిస్తుండగానే మే 6న తోట కనకదుర్గ పేరుతో మరో దరఖాస్తు వచ్చింది. తన భర్త తోట హనుమంతరావు 2019, ఆగస్టు 9న మరణించారని, ఆయన పేరు మీద ఉన్న భూమిని తనకు వారసత్వ మార్పు చేయాలని కనకదుర్గ కోరారు. రెండు దరఖాస్తుల్లోని సర్వే నంబర్లు, ఖాతా నంబర్లు ఒకటే ఉండటంతో జూన్‌ 5న విచారణకు రావాలని ఇరుపార్టీలకు రెవెన్యూ అధికారులు నోటీసులు పంపారు. ధ్రువీకరణలు తీసుకుని సదరు భూమిని క్లెయిమ్‌ చేసుకోవాలని కోరారు.  

పౌరసరఫరాల డేటా బేస్‌తో.. 
విచారణ సమయంలో తోట హనుమంతరావు పేరు మీద దరఖాస్తు చేసుకున్న వ్యక్తి ఆ భూమికి సంబంధించిన ధ్రువీకరణలు చూపలేకపోయాడు. ఆ వ్యక్తి నమోదు చేయాలని కోరిన ఆధార్‌ కార్డులోని చిరునామాలో ఎంక్వైరీ చేయగా సదరు పేరున్న వ్యక్తి అక్కడ లేడని తేలింది. పౌరసరఫరాల డేటాలో వెతకగా ఆ ఆధార్‌ నంబర్‌తో లింక్‌ అయి ఉన్న రేషన్‌కార్డు దొరికింది. ఈ కార్డులో తోట హనుమంతరావు కాకుండా గుర్రం పాండు అనే పేరు వచ్చింది. ఇతనిది యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ కాగా, ఆ రేషన్‌కార్డుపై తన బయోమెట్రిక్‌ వివరాలను నమోదు చేసి 2020, నవంబర్‌లో రేషన్‌ బియ్యం తీసుకున్నాడని, ఆ తర్వాత వరుసగా అతని భార్య ఈ రేషన్‌ తీసుకుంటున్నట్లు వెల్లడైంది.

రెవెన్యూ అధికారులు మరింత విచారించగా, గుర్రం పాండు తన ఆధార్‌ కార్డులోని పేరును తోట హనుమంతరావుగా 2021లో మార్చుకున్నాడని, ఆ తర్వాత అదే పేరుతో ఆ కార్డులోని నంబర్‌ను నమోదు చేసుకుని విలువైన భూమిని కొట్టేసేందుకు కుట్రపన్నాడని తేలింది. దీంతో గుర్రం పాండుపై చీటింగ్‌ కేసు నమోదు చేయాలని సంబంధిత తహశీల్దార్‌ సోమవారం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.  

రెండు దరఖాస్తులు రావడంతోనే.. 
వాస్తవానికి రెండు దరఖాస్తులు ఒకే సమయంలో రావడంతోనే ఇది గుర్తించగలిగాం. లేదంటే ఆధార్‌కార్డులోని పేరు, పహాణీలో పేరు చూసి ఆ దరఖాస్తును ఆమోదించడమో, తిరస్కరించడమో జరిగేది. విచారణలో తప్పని తేలడంతో పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాం. ఇలాంటి వాటిపై ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎప్పటికప్పుడు తమ భూమి రికార్డులను ఆన్‌లైన్‌లో అయినా చెక్‌ చేసుకుంటూ ఉండాలి.
–కె. మహిపాల్‌రెడ్డి, పటాన్‌చెరు తహశీల్దార్‌  

మరిన్ని వార్తలు