మమ్మల్ని మా ఊర్లో ఉండనివ్వడం లేదు..

21 Feb, 2023 11:02 IST|Sakshi

జగిత్యాల: ‘మమ్మల్ని మా ఊర్లో ఉండనివ్వడం లే దు.. వివాహాలను అడ్డుకుంటున్నారు.. గ్రామంలో ఎవరు చనిపోయినా ఆధార్‌కార్డు ఇస్తేనే అంత్యక్రియలకు అనుమతి ఇస్తానంటున్నారు’ అని ఇబ్రహీంపట్నం మండలం వేములకుర్తి గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం ప్రజావాణి ద్వారా అద నపు కలెక్టర్లకు ఫిర్యాదు చేశారు. 40ఏళ్లుగా వేములకుర్తిలో జీవనం సాగిస్తున్నామని తెలిపారు. వలస వచ్చి ఇక్కడ ఉండొద్దా? అని ప్రశ్నించారు. మా పని మేం చేసుకుంటామని, మమ్మల్ని బతకనివ్వాలని ప్రజావాణి ద్వారా వేడుకున్నారు. సుమారు 20 మంది వరకు కలెక్టరేట్‌కు తరలివచ్చి తమ ఆవేదనను వెలిబుచ్చారు. సుమారు 60 కుటుంబాలు గ్రామంలో ఉంటున్నాయని, గ్రామం వదిలిపెట్టి వెళ్లిపోవాలని సర్పంచ్‌ ఒత్తిడి తీసుకు వస్తున్నారని ఆరోపించారు. అధికారులు జోక్యం చేసుకుని న్యాయం చేయాలని వేడుకున్నారు.

ఇల్లు కిరాయి ఇవ్వడం లేదు 
నేను పరాయి దేశం పోయి వచ్చి అంతా లాసైన. అప్పుల బాధతో నా సొంతింటిని అమ్ముకున్న. కిరాయి ఇంట్లో ఉండనివ్వడంలేదు. ఇబ్బందులకు గురిచేస్తున్నారు. 
– మాచర్ల లక్ష్మణ్‌

పెళ్లి అడ్డుకునేందుకు యత్నించారు
నేను దివ్యాంగుడిని. ఇటీవల నాకు వివాహం నిశ్చయమైంది. పెళ్లిని అడ్డుకునేందుకు సర్పంచ్‌ ప్రయత్నం చేశారు. బ్రాహ్మణులను రాకుండా చేశారు. వేరేవాళ్లతో పెళ్లి చేయించుకున్నాం.
 – రాట్నం మహేశ్‌

శవాన్ని అడ్డుకున్నారు 
మా తాత ముత్తయ్య ఇటీవల చనిపోయాడు. ఆ శవాన్ని అంత్యక్రియలకు తీసుకెళ్దామంటే ఆధార్‌కార్డు ఇస్తేనే పంపిస్తామని సర్పంచ్‌ చెప్పిండ్రు. చేసేది లేక ఆధార్‌కార్డులు ఇచ్చినం. ఇప్పుడు మా వద్ద అవిలేవు. ఇబ్బందిగా ఉంది. 
– రాజ్‌కుమార్‌

మరిన్ని వార్తలు