శవాల శివను సర్‌ప్రైజ్‌ చేసిన సోనూసూద్‌

19 Jan, 2021 12:44 IST|Sakshi

అంబులెన్స్ స‌ర్వీస్‌ని ప్రారంభించిన సోనూసూద్‌

కరోనా కష్టకాలంలో దేవుడిలా వచ్చి నిరుపేదలను ఆదుకున్న రీల్‌ విలన్‌.. రియల్‌ హీరో ‘సోనూసూద్‌’.  కార్మికులు మొదలు.. రైతులు, నిరుద్యోగులు ఇలా ప్రతి ఒక్కరికి అడిగిన సాయం చేస్తూ నలుగురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఫలానా చోట.. ఫలానా సమస్య ఉందన్న విషయం తన దృష్టికి వస్తే చాలు చేతికి ఎముక లేదన్నట్లుగా సాయం చేస్తున్నాడు. లాక్‌డౌన్‌ మొదలు ఇప్పటి వరకు వేలాది పేదలకు సాయం చేశాడు. వందలాది మంది నిరుద్యోగులకు ఉపాధి చూపించాడు. ఇక ఇప్పడు మరో అడుగు ముందుకేసి అంబులెన్స్ స‌ర్వీస్‌ని ప్రారంభించాడు ఈ రియల్‌ హీరో. మంగళవారం ఆయన హైద‌రాబాద్‌లోని ట్యాంక్‌బండ్ ఏరియాలో అంబులెన్స్‌ స‌ర్వీస్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా ట్యాంక్‌బండ్‌పై ప్రమాదవశాత్తు మరణించి, ఆత్మహత్య చేసుకున్నవారి మృతదేహాలను వెలికితీస్తూ ప్రజల హృదయాల్లో నిలిచిన శవాల శివను సోనూసూద్‌ అభినందించాడు. ప్రజలు ఇచ్చిన విరాళాలతో అంబులెన్స్‌ కొనుగోలు చేసిన శివ.. దానికి ‘సోనూసూద్‌ అంబులెన్స్‌ సర్వీస్‌’అని పేరుపెట్టి సేవలు అందిస్తున్నాడు. ఈ అంబులెన్స్‌ ప్రారంభోత్సవానికి రావాలని సోనూసూద్‌ని ఆహ్వానించాడు శివ. అతని కోరిక మేరకు మంగళవారం ట్యాంక్‌బండ్‌కు వెళ్లిన సోనూసూద్‌.. శవాల శివ ఇంటికి వెళ్లి సర్‌ప్రైజ్‌ చేశాడు. శివ చేస్తున్న సేవలను సోనూసూద్‌ ప్రశంసించారు. భవిష్యత్తులో ఏమి కావాలన్న తాను ఉన్నానని శివకు భరోసా ఇచ్చాడు. ఇక ఈ అంబులెన్స్‌ సేవలను విస్తృతం చేస్తామని సోనూసూద్‌ చెప్పాడు.  

మరిన్ని వార్తలు