South Central Railway: రైళ్లో టికెట్‌ లేకుండా ప్రయాణిస్తున్నారా!.. ఇకపై ఇట్టే దొరికిపోతారు

14 Apr, 2022 08:39 IST|Sakshi

రైల్వే టీసీల చేతికి హ్యాండ్‌ హెల్డ్‌ టెర్మినల్స్‌ యంత్రాలు

సాక్షి, హైదరాబాద్‌: రైళ్లలో టికెట్‌ లేకుండా ప్రయాణిస్తే పట్టుకునే సందర్భాలు తక్కువగానే ఉంటాయి. ఇకపై టికెట్‌ తీయకుండా ప్రయాణించేవారి ఆటలు సాగవు. ఇంతకాలం టికెట్‌ కలెక్టర్ల చేతిలో కాగితాల చార్ట్‌ మాత్రమే ఉండేది. తదుపరి స్టేషన్‌లో ఎన్ని బెర్తులు బుక్‌ అయ్యాయి, ఎన్ని సీట్లు ఖాళీగా ఉన్నాయి.. లాంటి వివరాలు రైలు కదిలితే తప్ప చేతికి అందేవి కాదు. దీంతో రిజర్వేషన్‌ ఉన్న వారెవరో, టికెట్‌ లేని వారెవరో, ఆర్‌ఏసీతో ప్రయాణిస్తున్నవారు ఎక్కడెక్కడున్నారో తెలుసుకోవటానికి సమయం పట్టేది.

కానీ, ఇప్పుడు టీసీలందరికి హ్యాండ్‌ హెల్డ్‌ టెర్మినల్స్‌ (హెచ్‌హెచ్‌టీ) యంత్రాలను అందిస్తున్నారు. ఇవి రైల్వే ప్రధాన సర్వర్‌తో అనుసంధానమై ఉం టాయి. దీంతో ఎక్కడ కొత్త టికెట్‌ బుక్‌ అయినా చిటికెలో టీసీలకు సమాచారం తెలుస్తుంది. దీంతో టికెట్‌ లేని ప్రయాణికులను గుర్తించటం సులువవుతుందని అధికారులు చెబుతున్నారు. 

గతేడాది రూ.111.52 కోట్ల జరిమానా 
గత ఆర్థిక సంవత్సరంలో టికెట్‌ లేకుండా ప్రయాణిస్తున్నవారిపై కేసులు రాయటం ద్వారా రూ.111.52 కోట్ల ఆదాయాన్ని రైల్వే ఆర్జించింది.  కాగా, బుధవారం దక్షిణ మధ్య రైల్వే ప్రిన్సిపల్‌ చీఫ్‌ కమర్షియల్‌ మేనేజర్‌ జాన్‌ ప్రసాద్‌ ఆధ్వర్యంలో టికెట్‌ తనిఖీ అంశంపై సమీక్ష జరిగింది. హ్యాండ్‌ హెల్డ్‌ టెర్మినల్స్‌ను ఎక్కువసంఖ్యలో అందించాలని నిర్ణయించారు. దీనివల్ల టికెట్‌ లేని ప్రయాణికుల సంఖ్య తగ్గడమే కాకుండా.. ఆదాయం కూడా అధికంగా నమోదవుతుందని గుర్తించారు. 

మరిన్ని వార్తలు