సర్కార్‌ బడుల్లో ఇక రాగి జావ 

22 May, 2023 03:24 IST|Sakshi

రాష్ట్రంలో పీఎం పోషణ్‌ పథకం అమలుకు సర్కారు ఓకే 

విద్యార్థులకు పోషకాహారం అందించే దిశగా చర్యలు 

ఏటా 110 రోజుల పాటు 16.82 లక్షల మందికి బ్రేక్‌ ఫాస్ట్‌ 

ఇందుకోసం రూ.27.76 కోట్ల వ్యయం అంచనా 

వచ్చే విద్యా సంవత్సరం మధ్యాహ్న భోజన పథకానికి రూ.323.71 కోట్లు 

సాక్షి, హైదరాబాద్‌:  ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థులకు పోషకాహారం అందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధమయ్యాయి. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ‘ప్రధాన మంత్రి పోషణ్‌’పథకాన్ని ఇక్కడ అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. విద్యార్థులకు ఐరన్, ఇతర సూక్ష్మ పోషకాలతో కూడిన ఆహారాన్ని ఇవ్వాలన్నది ఈ పథకం ఉద్ధేశం. ఈ క్రమంలోనే పోషకాలతో కూడిన రాగి జావను అన్ని తరగతుల విద్యార్థులకు బ్రేక్‌ ఫాస్ట్‌గా అందించనున్నారు.  

ఈ విద్యా సంవత్సరం నుంచే.. 
రాష్ట్రంలోని 16.82 లక్షల మంది విద్యార్థులకు ఏడాదిలో 110 రోజుల పాటు రాగిజావను పంపిణీ చేస్తారు. ఇప్పటికే స్కూళ్లలో ఇస్తున్న మధ్యాహ్న భోజనానికి అదనంగా.. ఉదయమే ఈ రాగి జావను అందిస్తారు. 2023–24 విద్యా సంవత్సరంలో దీని అమలుకు సంబంధించి ఇటీవల జరిగిన సమావేశంలో పీఎం పోషణ్‌ అభియాన్‌ ప్రాజెక్ట్‌ ఆమోదిత మండలి (పీఏబీ) ఆమోదం తెలిపింది. ఈ వివరాలను కేంద్ర విద్యాశాఖ ఇటీవల విడుదల చేసింది.

ఈ సమావేశం సందర్భంగా ఎందరు విద్యార్థులకు రాగి జావ అందించాల్సి ఉంటుంది? ఇందుకోసం చేయాల్సిన ఏర్పాట్లు, ఇతర అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలను సమర్పించింది. ఈ ప్రతిపాదనలను పరిశీలించిన కేంద్రం.. 2023–24లో రాష్ట్రంలో మొత్తంగా 16.82 లక్షల మంది విద్యార్థులకు 110 రోజుల పాటు రాగి జావ అందజేసేందుకు ఆమోదం తెలిపింది. దీనికి రూ.27.76 కోట్లు వ్యయం కానుండగా.. కేంద్రం 16.18 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం రూ.11.58 కోట్లు భరించనున్నాయి. 

మధ్యాహ్న భోజనం 231 రోజులు 
సర్కారు బడుల్లో విద్యార్థులకు వచ్చే విద్యా సంవత్సరంలో 231 రోజుల పాటు మధ్యాహ్న భోజనాన్ని అందించనున్నారు. ప్రాథమిక, ప్రాథమికోన్నత, బాల వాటికల్లో 231 రోజులు, స్పెషల్‌ ట్రైనింగ్‌ సెంటర్లలో 293 రోజులపాటు మధ్యాహ్న భోజన పథకం అమలుకు పీఏబీ ఆమోదం తెలిపింది.

ఈ పథకం అమలుకు రూ.323.71 కోట్లను వెచ్చించనుండగా.. కేంద్రం రూ.203.76 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం 119.95 కోట్లను భరించనున్నాయి. కేంద్రం మధ్యాహ్న భోజనం కుక్‌ కమ్‌ హెల్పర్లకు నెలకు వెయ్యి రూపాయలు మాత్రమే పారితోíÙకం ఇస్తుండగా, రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.2 వేలు అదనంగా కలిపి.. 54,232 మంది సిబ్బందికి నెలకు రూ. 3వేల పారితోషికం ఇస్తోంది. ఈ చొరవను కేంద్రం ప్రశంసించింది. 

ఆరోగ్య విశ్లేషణ అనంతరం.. 
కోవిడ్‌ తర్వాత దేశవ్యాప్తంగా విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై కేంద్ర ప్రభుత్వం ఓ సర్వే చేపట్టింది. విద్యార్థుల్లో పోషకాహార లోపం ఉందని, అందుకే చదువుపై సరైన శ్రద్ధ చూపలేకపోతున్నారని అందులో గుర్తించింది. ఈ క్రమంలో విద్యార్థులకు పౌష్టికాహారం ఇచ్చే దిశగా చర్యలు చేపట్టింది. 

మరిన్ని వార్తలు