మధ్యవర్తిత్వమే ఉత్తమ మార్గం

3 Sep, 2023 06:23 IST|Sakshi

అందరూ కలసి సమస్యను పరిష్కరించుకోవాలి

నల్సార్‌ స్నాతకోత్సవంలో సుప్రీం జడ్జి జస్టిస్‌ సంజయ్‌కిషన్‌ కౌల్‌ పిలుపు

అణగారిన వర్గాలకు న్యాయం అందేలా కృషి చేయాలని విద్యార్థులకు సూచన

హాజరైన సుప్రీం జడ్జి జస్టిస్‌ నరసింహ, హైకోర్టు సీజే జస్టిస్‌ అలోక్‌ అరాధే

సాక్షి, హైదరాబాద్‌: న్యాయపరమైన సమస్యలను పరిష్కరించడంలో మధ్యవర్తిత్వం ఉత్తమ మార్గమ­ని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సంజయ్‌కిషన్‌ కౌల్‌ పేర్కొన్నారు. కోర్టులు, చట్టాల ద్వారా అందేది కక్షిదారులపై బయటి నుంచి రుద్దిన పరిష్కా­రమే అవుతుందని.. మనుషులంతా కూర్చు­ని సంప్రదింపులతో జరిపే మానవీయ పరిష్కారం కా­దని చెప్పారు. విద్వేష భావనలు, విద్వేష ప్రసంగాలతో కలుషితం అవుతున్న సమాజంలో సోక్రటీస్‌ వంటి మహనీయులు ప్రవచించిన జీవన విధానం మంచిదని సూచించారు.

శనివారం హైదరాబాద్‌ షామీర్‌పేటలోని నల్సార్‌ న్యాయ విశ్వవిద్యాలయంలో 20వ స్నాతకోత్సవం జరిగింది. ఇందులో సుప్రీంకోర్టు న్యాయమూర్తి, జాతీయ న్యాయసేవల ప్రాధికార సంస్థ (నల్సా) కార్యనిర్వాహక అధ్యక్షుడు జస్టిస్‌ సంజయ్‌కిషన్‌ కౌల్‌ ముఖ్య అతిథిగా, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ పీఎస్‌ నరసింహ గౌరవ అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, వర్సిటీ చాన్సలర్‌ అలోక్‌ అరాధే అధ్యక్షత వహించారు.

ఈ సందర్భంగా జస్టిస్‌ సంజయ్‌కిషన్‌ కౌల్‌ మాట్లాడుతూ.. ‘‘మనుషులం కనుకే ఆలోచిస్తాం.. ఒకరికొకరు భిన్నంగా ఆలోచిస్తాం. తర్క, వితర్కాలతో సంభాషించుకుంటూనే శాంతియుతంగా జీవించే సమాజం ఉండాలి. మన రాజ్యాంగ నైతికత కూడా దీన్నే తెలియజేస్తుంది. మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించే విధానంలో అందరి తర్కం, వాదన విని.. అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం లభిస్తుంది. నాలుగు మెదళ్ల సంఘర్షణ నుంచి వచ్చే పరిష్కారం మెరుగ్గానే ఉంటుందనడంలో అశ్చర్యం అవసరం లేదు..’’ అని పేర్కొన్నారు. అణగారిన వర్గాలకు న్యాయం అందేలా కృషి చేయాలని న్యాయ విద్యార్థులకు పిలుపునిచ్చారు.

సీఎం కేసీఆర్‌ సహకారం మరువలేనిది..
నల్సార్‌ వర్సిటీలో వసతులు కల్పించడంలో సీఎం కేసీఆర్‌ సహకారం మరువలేనిదని వర్సిటీ వీసీ శ్రీకృష్ణదేవరావు పేర్కొన్నారు. జ్యుడిషియల్‌ అకాడమీ కోసం 25 ఎకరాలు ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందన్నారు. 25ఏళ్ల నల్సార్‌ వర్సిటీ ప్రస్థానంలో ఎన్నో కొత్త కోర్సులను తీసుకొచ్చామని, ఎందరో విద్యార్థులను సమాజానికి అందించామని చెప్పారు. లీగల్‌ ఎయిడ్‌తోపాటు అగ్రి లీగల్‌ ఎయిడ్‌ క్లినిక్‌లను ప్రోత్సహించడంలో నల్సార్‌ కీలక పాత్ర పోషిస్తోందన్నారు.

ఈ కార్యక్రమంలో పీహెచ్‌డీ, ఎల్‌ఎల్‌ఎం, ఎంబీఏ, బీఏ ఎల్‌ఎల్‌బీ ఆనర్స్‌ పూర్తి చేసుకున్న విద్యార్థులకు పట్టాలతో పాటు 58 మందికి బంగారు పతకాలను అందజేశారు. ప్రొఫెసర్‌ బాలకృష్ణరెడ్డితోపాటు ఇతరులు రాసిన పుస్తకాలను సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, హైకోర్టు సీజే ఆవిష్కరించారు. హైకోర్టు న్యాయమూర్తులు, అడ్వొకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్, రాష్ట్ర లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ సభ్యకార్యదర్శి గోవర్థన్‌రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు